నాన్న....!(కవిత)
నాన్న నమ్మకం !
అమ్మ నిజం !
నమ్మక, నిజాల ప్రతి రూపం సంతానం
కాఠిన్య రూప నాన్న
అగాధ సంద్ర మణిదీపం
ఆటుపోటుల నౌకను అదును చూచి నడిపే సరంగు నాన్న
జీవిత అనుభవ విలువలు పంచే జీవనదర్శి నాన్న
కష్టాల కడగండ్ల కవచమై కాచు కనురెప్పరీతి నాన్న
రుధిరమంత ధారపోసి దారి చూపించు మార్గదర్శి నాన్న
కఠినమైన సత్యాన్ని నేర్పే నీతిమార్గ దీపశిఖ నాన్న
వలయు ఓర్పు నేర్పుల వివరించు
కడు నేర్పరి నాన్న
కరకు కత్తిన కఠిన రోగాలు కరగించు వైద్యునిరీతి నాన్న
పదును ఉలి అంచున
సుందర శిల్పమును మలచు
శిల్పిరీతి నాన్న
నిర్దయ శిక్షల నిలువరించి,
విద్యల వివరించు గురువురీతి నాన్న
తాను అలసి, సొలసి
సంతును మణులుగా మలచును నాన్న
మార్గదర్శకమై నాన్న వెలుగొందు ఆచంద్రార్కము ఇలలో
నాన్న అనురాగ సౌరభం ఆస్వాదించు జీవనం ధన్యం! ధన్యం !
నాన్నను మరచిన
సర్వదేవతా ఆగ్రహం తధ్యం! తధ్యం!
మనసార నాన్నను ప్రేమిద్దాం ! ఆనందపు అంచుల విహరిద్దాం !!
ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన తల్లిదండ్రులకు సదావందనం !!
-డా. దేవులపల్లి పద్మజ
(విశాఖపట్టణము)