యాత్రికుడొస్తాడు (కథనాత్మక కవిత)
యాత్రికుడొస్తాడు
అనంత సాగరాలు దాటి,
దీవులు సందర్శించి,
తుఫాను కడలుల గుండా
సాహస యానం చేసి,
యాత్రికుడొస్తాడు.
అతడొస్తే పగడాలూ, మరకత మణులూ,సుగంధ ద్రవ్యాలూను,
అతడొస్తే దేశాంతరాల గాధలూ,చిత్రవిచిత్రాలూ,
అన్నీ పట్టుకొని
యాత్రికుడొస్తాడు.
ఎడారులను గడచి,మైదానాలు దాటుకుని,అడవులను అధిగమించి,
యాత్రికుడిక్కడికి వస్తాడు.
సముద్రపు దొంగలను, అడవిలోని దుండగీడులనూ పారద్రోలి,
త్రోవ పొడవునా క్రూరమృగాలనూ,విష సర్పాలనూ వధించి,
యాత్రికుడొస్తాడు.
మేలిజాతి అశ్వాలను,దీటైన
ఒంటెలనూ తీసుకొని,
యాత్రికుడొస్తాడు.
అతడి కోసం అశ్వశాలనూ,బసనూ ఏర్పాటు చేయండి,
తేనెనూ, మధువునూ,మధురమైన ఖర్జూరాలనూ సిద్ధం చేయండి,
లేళ్ళూ, దుప్పులూ పట్టుకురండి,
మన ఊరి పిల్లలనూ,వృద్ధులనూ తోడ్కొని రండి,
సాయంత్రం వేళ అతని నోట యాత్రానుభవాలు వారు వింటారు,
మన సంగీతకారులనూ,
నాట్య గత్తెలనూ రావాలని చెప్పండి,
మన ఆతిథ్యంతో అతను పరవశుడవ్వాలి,
మన యువకులు కర్రసాముతో,
ఖడ్గ విన్యాసాలతో అతనిని ఆనందపరచాలి,
ఆ యాత్రికుడు మన ఆతిధ్యాన్ని
తన తదుపరి మజిలీలో గుర్తుచేసుకోవాలి.
మనమూ ఈ జగతికి అతిథులమేగా,
ఏమున్నది మూన్నాళ్ల జీవితం!
ముగిసిపోయేలోగా ఇలా గడపాలి,
మరో మజిలీకై సాగిపోవాలి!!
-దండమూడి శ్రీచరణ్