Telugu Global
Arts & Literature

దీపావళి చెలియ ( కవిత)

దీపావళి చెలియ ( కవిత)
X

పూవుల లోపల గులాబివే? చెలి!

పులుగుల లోపల మయూరివే!

ఫలాలలోపల రసాలము

ఋతువులలోపల వసంతము

పండుగ లందున దీపావళి

పాటలలో నీవే జావళి

రసాలలోపల శృంగారం

జగానికే అది ఆధారం.

దేశాలలోపల నవభారతం

గిరులందు నీవే మలయాచలం

నీ కోసమే నే జీవించితి.

నా దేవిగా నిను భావించితి

అందాలు చీందే నీ రూపము

నా గుండెలందున నవదీపము.

నీ కంటి చూపే సోపానము

నీ మాట తీయని అనుపానము

ఆరని దివ్వియ నీ అందము

వీడనిదే మన అనుబంధము

పొగ చీర కట్టిన పూబోణి!

సెగ రైక తొడిగిన నా రాణి !

వెలుతురు నీలో విలసిల్లెనే

వలపులు నీలో వికసిల్లెనే

గగనము నీకై వంగెను లే

ధర నీ కోసము పొంగెనులే.

నీ కన్నులలో ఒక స్వర్గం

నీ అడుగులలో నవమార్గం

నీ నవ్వులలో నందనము

నీ అందానికి వందనము

కవుని మేనిలో పార్వతివి

బ్రహ్మ నాల్కపై భారతివి

హరి హృదయమున జలధిసుతవు

కవి కలమున గల సుకవితవు

ఉదయశిఖరిపై రవి శిఖవు

చరమాచలమున శశికళవు

అంతట వున్నది నీవేనే

ఎక్కడ లేనిది నీవేనే!

నేనై పలుకుట నీవేనే !

నీవై వెలుగుట నేనేనే !

- దాశరథి

First Published:  12 Nov 2023 2:54 PM IST
Next Story