Telugu Global
Arts & Literature

భలేవాడివి బాసూ (కథ)

భలేవాడివి బాసూ (కథ)
X

అవసరార్థం కథలు చెప్పటం సీతారాముడికి కొత్త కాదు కానీ కొత్తగా ఈమధ్య కథలు రాసి కథకుడినని అనిపించుకోవాలన్న దుగ్ధ మొదలయింది అతనికి..

ఆ కోర్కె తీరాలంటే ఓ సీనియర్ రచయిత దగ్గర కలం పట్టడం నేర్చుకోమని ఎవరో సూచిస్తే రచనలో తలపండిన రాజారాం ని పట్టుకున్నాడు. సీతారాముడి వెర్రి చూసి తలపట్టుకున్న సదరు రాజారాంకు సీతారాముడితో కలిగే మేళ్ళను గుర్తించటానికి ఎక్కువ సమయం పట్టలేదు.

ఇంట్లో కుదరదని, అదే తాజ్ మహల్ హోటల్ అయితే కుదురుగా ఉంటుందని సీతారాముడికి ఊదరగొట్టాడు.

అలా సాయంత్రం ఐదునుంచి ఆరువరకు గంటసేపు సాగే సెషన్ రోజుకో రెండొందలు సమర్పయామితో ముగిసేది.సీతారాముడి దురద తనకు బురదగా మారకుండా ఉండేందుకు రాజారాం వసూలు చేసిన కప్పమది.

ఇలా వారంరోజులు ఓపిక పట్టిన సీతారాముడిక తనపై శీతకన్ను వేస్తాడని గమనించిన రాజారాం ఓ రోజు ఓ చిట్కా చెప్పాడు సీతారాముడికి.

తన కథలన్నీ రాత్రివేళ చూసిన అభాగ్య జీవితాల్లోంచి వచ్చాయని,అంచేత సీతారాముడు కూడా ఆ పనిచేయాలని సెలవిచ్చాడు.

అలా రాస్తే కథ సహజంగా ఉంటుందని బడుగు బతుకులెంత అతుకుల బొంతలో తెలుస్తాయని ఐస్ క్రీం తింటూ జివ్వుమంటున్న పళ్ల సాక్షిగా చెప్పాడు రాజారాం.

ఈ మాట సీతారాముడికి నచ్చింది.

రాత్రి పూట నగరంలో తిరగాలన్న కోరిక ,కథారచన రెండూ పుణ్యం, పురుషార్ధంలా కలిసొస్తాయని గంతేశాడు.

ఆ హడావిడిలో నువు రాసిన కథ పట్టుకురా, మార్పులు, చేర్పులు సూచిస్తానన్న రాజారాం మాటలు సీతారాముడికి చేరాయా, గాల్లో కలిసిపోయాయా అన్నది కాలమే చెప్పాలి మరి.

ఓం ప్రథమం అనుకుంటూ ఓ రాత్రి రోడ్డమ్మట పడ్డాడు.చెవిచుట్టూ మఫ్లర్ కప్పేయగా చలిలో ఎక్కడికి బయల్దేరారన్న తల్లీ కొడుకుల మాటలు ఆతని చెవికెక్కలేదు.

సికింద్రాబాద్ లోని ఓ కేఫ్ ను ఎంచుకున్నాడు తన కథా వస్తువుల కోసం.ఆ కేఫంతా దుమ్ముగొట్టుకుని ఉంది.ఆకాశంలోని ఒకటీ అరా నక్షత్రాల్లా కస్టమర్ లు మిణుకు మిణుకుమంటున్నారు..పనిచేసే సిబ్బంది కూడా లంఖణాలు చేసున్నవారిలా కనిపించటంతో సీతారాముడి ఆనందానికి అవధులు లేవు.రచయిత రాజారాం గారి సూచన మేరకు పది కథలకు మేత దొరికిందని ఆనందపడ్డాడు.

అప్పుడే బట్టలు, గడ్డం రెండూ మాసిపోయినా చీకటిలో సిగరెట్ వెలుగుతో, మండుతున్న కళ్ళతో ఓ భగ్నప్రేమికుడు లాంటి యువకుడు కనిపించాడు సీతారాముడికి.

అతనికథ రాయాలని సంబరపడ్డాడు మనవాడు.

"బాబు, మీ పేరేంటి"

మాటలు కలిపే ప్రయత్నం చేశాడు.

"ఎందుకు, నా పేరు తెలుసుకుని ఏం జేస్తవ్ "

కొట్టినట్టు చెప్పాడు ఆ అపరిచితుడు.

"నీ జీవితాన్ని కథగా రాసి పదిమందికీ తెలియచేస్తాను"

సీతారాముడి మాటల్లో దర్పం తొంగిచూసింది.

"నాకేంటి లాభం"

"నా కథకు ప్రైజొస్తే ఆ డబ్బులు నీవే"

"ఆ సంగతి తరవాత. ముందయితే జరంత బిర్యానీ పెట్టిపించు "

మళ్లీ అదే మొరటుదనం.

కథ కోసం ఇలాంటివారిని ఎంతమందినయినా డీల్ చేయగలనని తన భుజాన్ని తానే తట్టి లోపలికి దారితీశాడు.

"బేరర్ ఒక బిర్యానీ, ఒక చాయ్"

ఆర్డర్ జారీ చేసి

ఆ యువకుడి వంక చూసిన సీతారాముడు

"ఇప్పుడు నీ కన్నీటి ఆనవాళ్ళను

మాసిపోయిన ఆ గడ్డం దాచుకున్న జ్ఞాపకాలను చెప్పు.ఆ తరువాత ఆ బిర్యానీని దోచుకుందువు గానీ"

అబ్బో ప్రాస భలేకుదిరిందని

బ్రేవో మై బాయ్ అనుకుంటుండగా

అప్పుడు జరిగిందో హఠాత్పరిణామం.

"ఏంరా మల్లిగా,దొంగతనం జేసుడేగాక, తప్పించుకు తిరుగుతవులే.నడువుర ఠానాకు. నీమీద వారెంట్ జారీ అయింది "

ఈమాటంటూనే దృష్టిని పక్కనున్న

సీతారాముడిపై సారించాడు.

"ఎవలువయా నువ్వు. చూస్తే పెద్దాయనలా గొడుతున్నవ్.

ఓహో, ఈమల్లిగాడు ఎత్కపోయిన మాల్ నీకమ్మిండులే, నువు భీ స్టేషను నడు."

లాఠీ ఝళిపించాడు కానిస్టేబుల్.

"అవునన్నా, నాకు బిర్యానీ తినిపించనీకచ్చిండు"

సదరు మల్లి మాటలకు సీతారాముడి నోటికి పక్షవాతమొచ్చింది.

మంచుతుపానులో తడిసినట్టు మెదడు మొద్దుబారిపోయింది.

జరిగినది అర్థమవుటకు మిక్కిలి సమయము గడువగా, కడు ప్రయత్నం చేసి,తగినంత పైకం పరిహారముగా కనీస్టేబుల్ గారి సముఖమునకు సమర్పించి, కథనెటులనో సుఖాంతము చేసుకుని సీతారాముడు కొంప చేరెను.

కథేమోకానీ, కొంప కొల్లేరయిందని మళ్లీ కథజోలికీ పోలేదు సీతారాముడు.ఫోన్ చేస్తాడేమోనని కథకుల తిలకుడు రాజారాం

నంబర్ ని బ్లాక్ చేసేశాడు కూడాను..మీకెప్పుడయినా కనిపిస్తే కథ గురించి అడగండి.. భలేవాడివి బాసూ అని పారిపోతాడు

-సి.యస్ .రాంబాబు

First Published:  26 Jan 2023 2:10 PM IST
Next Story