Telugu Global
Arts & Literature

తూలిక

తూలిక
X

అమ్మ రెండు

రిబ్బన్లు చుడితే చాలు

అవనంతా ఇంద్రధనుస్సులు

ఎగరేస్తుంది

తమ్ముడి

అల్లరి గాలుల్ని కాస్తూ

ఇల్లంతా చిరునవ్వుల

తెరచాపల్ని పూస్తుంది

లక్ష్మీదేవి పుట్టిందని

తలుస్తావో లేదో గానీ

సరస్వతికి దూరం చేయకు

సావిత్రీభాయికి

పరిచయం చేయడం మరువకు

రేపటి నీ దిగులు గుడిసెకు నిట్టాడి

నీ చిన్న కష్టానికి కూడా చలించే

నాలుగు తడి చినుకుల మేఘం

ఆత్మీయతల అల్లికల దారాలతో

కుటుంబ బంధాల

చిరుగుల్ని కలిపికుట్టే బుల్లి దర్జీ

అంతెంతుందుకు

ఏ రంగాన్నయినా శాసించగల

ధీరవనితల చిరునామా ఆమె

మీరనుకుంటున్నట్టు

గుండెల మీద కుంపటి కాదు

ఇంటింటా గుండెల్లో వెలగ్గలిగే

ఒకే ఒక ఆత్మీయ దీపం

చింతల చీకటి సముద్రాన్ని దాటించే

వెన్నెల పడవ

ఆడపిల్లంటే

ఆకాశంలో సగం కాదు

ఈ భూమిని పచ్చగా మొలకెత్తించే

తడి చినుకుల ఆకాశం మొత్తం ఆమే

అమ్మ రెండు రిబ్బన్లు చుట్టి

నాన్న నాలుగు మాటలతో

ప్రేమగా పలకరిస్తే చాలు

ఇంద్రధనుస్సుల ఆకాశాన్ని తెచ్చి

ఇంటి చూరుకు తగిలిస్తుంది

భూగోళాన్నే కానుకగా ఇచ్చి

ఆత్మీయంగా

ఒక చిరునవ్వు రువ్వుతుంది

ఆమె ఉత్త బాలికని కొట్టిపారేయకు

నీ నా మనందరి

జీవితకాలపు తూలిక

- చిత్తలూరి

First Published:  15 Jan 2023 8:10 PM IST
Next Story