Telugu Global
Arts & Literature

మనం… మన ఊరు (కథ)

మనం… మన ఊరు (కథ)
X

పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఏ.యి రాఘవ ఆఫీసులో కూర్చుని మెయిల్స్ చూస్తున్నారు. టేబుల్ పైని సెల్ మ్రోగింది. చేతికి తీసుకున్నాడు.

"హలో"

"గుడ్ మార్నింగ్ సార్"

"అమృతా నువ్వా!..." ముఖంలో ఎంతో ఆనందం.

"అవును బాస్ నేనే... మరి ఎవరి కాల్ నన్నా ఎక్స్పెక్ట్ చేశారా!..."

అమృత అతని భార్య. గర్భవతి. రెండు వారాల క్రిందట కనేటందుకు పుట్టింటికి వెళ్ళింది.

"అమృ...ఆరోగ్యం ఎలా ఉంది?... బాగుందిగా...." తన ప్రియాతి ప్రియమైన అర్ధాంగిని గురించి, పుట్టబోయే బిడ్డను గురించి ఆలోచిస్తూ మెల్లగా అడిగాడు రాఘవ.

"అంతా క్షేమం. ఇరవై ఐదో తేదీన డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పింది. మీరు ఇరవై రెండునే రావాలి. డెలివరీ సమయంలో మీరు నాకు దగ్గరగా ఉండాలి‌." ఎంతో ప్రేమను వలకబోస్తూ మృదుమధురంగా పలికింది అమృత.

"తప్పకుండా నీవు చెప్పినట్లుగానే వస్తాను. అమృ... నా శరీరం ఇక్కడ ఉంది. మనస్సు నీ దగ్గరే ఉంది." విచారంగా పలికాడు రాఘవ.

"అలాగా!... వారం రోజులేగా... జాగ్రత్త... టైం కు భోంచేయండి. మీకు మరో శుభవార్త." ఆనందంగా పలికింది అమృత.

"ఏమిటది?..." ఎంతో ఆత్రంగా అడిగాడు రాఘవ.

"మన ఊరు... జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామంగా ఎన్నికయింది. జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఈనెల రెండవ తేదీ మన ఊరికి వస్తారట. అంటే తమరు ఇరవై ఒకటవ తేదీన నా ముందు ఉండాలి." గలగలా నవ్వింది అమృత.

"అమృ... తప్పకుండా వస్తాను... అమృ... వేరే కాల్ వస్తూ ఉంది. సాయంత్రం నీతో అన్నీ వివరంగా మాట్లాడుతాను."

"ఓకే సార్." అమృత కాల్ కట్ చేసింది.

రాఘవ సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది అమృత అన్నయ్య త్రివిక్రమ్.

"బావా ఎలా ఉన్నావ్?" దరహాసవదనంతో పలికాడు రాఘవ.

"నేను... మా చెల్లి... బాబు... అంతా క్షేమం. చాలాసేపుగా నీ ఫోన్ బిజీగా ఉంది."

"అవును బావా... అమృత ఫోన్ చేసింది."

"అంటే విషయాన్నీ నీకు నాకంటే ముందుగా తనే చెప్పేసి ఉంటుంది. మన ఊరు..." త్రివిక్రమ్ ముగించక ముందే...

"జిల్లాస్థాయిలో ఉత్తమ గ్రామం" పూర్తి చేశాడు రాఘవ.

"రాఘవా!... నాకు ఈ వార్త చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ పథకానికి నాంది పలికింది నీవే కదా... నాకన్నా నీకు ఎంతో సంతోషంగా ఉంది కదూ!..."

"అవును బావా... మన చిన్న శ్రమదానం... జిల్లా స్థాయిలో ఎంతగానో గుర్తింపబడింది." ఆనందంగా చెప్పాడు రాఘవ.

"నీవు ఊరికి ఎప్పుడు వస్తున్నావ్?" త్రివిక్రమ్ ప్రశ్న.

ఇరవై ఒకటిన బావా." రాఘవ జవాబు.

"నేనూ ఆ రోజే వస్తున్నాను రాఘవా. ఊర్లో కలుద్దాం. బై."

బై...బై బావా."

***

రాఘవరావు తల్లి, త్రివిక్రమ రావు నాన్నగారి చెల్లెలు. అంటే... మేనత్త. త్రివిక్రమ్ చెల్లెలు అమృత. ఆ ముగ్గురూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. వారి తల్లిదండ్రులు మంచి ఆదర్శ భావాలు కలవారు. పిల్లలను ఎంతో క్రమశిక్షణతో పెంచారు. ఆ కారణంగా రాఘవ... త్రివిక్రమ్... అమృత... స్కూలు, కాలేజీలలో ఫస్ట్ ర్యాంక్స్ సాధించారు. తోటి పిల్లలకు ఆదర్శప్రాయులు. అధ్యాపకులకు వారంటే... ఎంతో ప్రేమ... అభిమానం.

త్రివిక్రమ్... రాఘవ కన్నా రెండు సంవత్సరాలు పెద్ద. అమృత రాఘవ కన్నా మూడేళ్లు చిన్న. అమృతకు ఇష్ట సఖి ప్రక్క వూరి మునసబు గారి అమ్మాయి శాంతి. ఒకే వయసు వారు. ఒకే క్లాసులో చదివేవారు.

ఆ నలుగురూ పెరిగి పెద్దవాళ్లయ్యారు. రాఘవ సివిల్ ఇంజనీర్... త్రివిక్రమ్ కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాడు. అమృత... శాంతి... బియిడి పూర్తి చేశారు. 2019లో త్రివిక్రమ్ కు, శాంతికి వివాహం జరిగింది. మూడు నెలల తర్వాత రాఘవకు, అమృతకు వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా రాఘవ చెన్నైలోనూ... త్రివిక్రమ్ విశాఖపట్నంలోనూ ఉన్నారు. త్రివిక్రమ్ కు మూడు నెలల మగబిడ్డ. వారి మహోన్నతకి కారకులు వారి తల్లిదండ్రులు.

సాయంత్రం హోటల్లో భోంచేసి రాఘవ ఇంటికి వచ్చాడు. డ్రెస్ మార్చుకొని సోఫాలో కూర్చున్నాడు. అతనికి ఎంతో ఆనందంగా ఉంది. మనస్సు గతం వైపుకు పరుగు తీసింది.

నాలుగేళ్లక్రితం సంక్రాంతికి తను, అమృత, త్రివిక్రమ్, శాంతి తమ సొంత ఊరికి వచ్చారు. మిత్రులందరూ వచ్చిన వారిని కలిశారు. అందరూ కలిసి వూరంతా తిరిగారు చూశారు. రోడ్ల పక్కన ఉన్న చెట్లను నరికి రోడ్లను వెడల్పు చేశారు మునిసిపాలిటీ వాళ్ళు. అంతకు పూర్వం రోడ్లకు ఇరుపక్కల చెట్లు ఉండేవి. పన్నెండు గంటల మిట్ట మధ్యాహ్నం కాలంలో నడిచినా... శ్రమ అనేది ఉండేది కాదు. రోడ్ల ప్రక్కన ఉన్న నీడనిచ్చే చెట్ల కారణంగా ఈసారి 20 నిమిషాలలో అందరికీ చెమటలు క్రమ్మాయి. నడిచే దానికి అసహనం కలిగింది. ఊరంతా చుట్టి అందరూ రాఘవ ఇంటికి వచ్చారు. రాఘవ తల్లి అందరికీ నీరు మజ్జిగ ఇచ్చింది. చల్ల కడుపులోకి దిగేసరికి రాఘవ మస్తిష్కంలో ఒక మెరుపు మెరిసింది.

"బావా!..." త్రివిక్రమ్ వంక చూసి పిలిచాడు రాఘవ.

"ఏం రాఘవా!..." త్రివిక్రమ్ గారి ప్రశ్న.

"చూసావు కదా! ఏ వీధిలో కూడా ఒక్క చెట్టు కూడా లేదు. అన్నింటిని కొట్టేశారు. పూర్వంలో రోడ్డుకు రెండు వైపులా చెట్లు ఉండేవి. వాటి నీడన నడుస్తుంటే ఎంతో హాయిగా, ఆనందంగా, అలసట లేకుండా ఉండేది. ఇప్పుడు మనకు తొమ్మిది గంటల ఎండకే చెమట పట్టింది... కనుక... మనమంతా కలసి చందాలు వేసుకొని ఊరంతా... చెట్లను నాటుదాం. ఏమంటావు బావా" ఆత్రంగా త్రివిక్రమ్ ముఖంలోకి చూస్తూ అడిగాడు రాఘవ.

త్రివిక్రమ్ కొద్ది క్షణాలు ఆలోచించాడు... తర్వాత.... "తప్పకుండా చేద్దాం" నవ్వుతూ చెప్పాడు త్రివిక్రమ్.

మిత్రులంతా ఆ ఇరువురు బావమరుదులను మరో పేరుతో పిలుస్తారు కృష్ణార్జునులని. ఆ ఇరువురి మాటలను మిత్రులంతా సమర్థించారు. సమ్మతించారు.

అందరూ కలసి గ్రామ సర్పంచి గారిని కలిశారు. వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆ ఇరువురు మంచి పేరున్న కుటుంబీకులైనందున వారి తల్లిదండ్రులు సర్పంచ్ గారికి బాగా తెలిసి ఉన్నందున "మీకు తోడుగా మా పంచాయతీ సిబ్బందిని కూడా పంపుతాను. నేనూ పాల్గొంటాను. మీరు సంకల్పించిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం" హృదయపూర్వకంగా రాఘవ, త్రివిక్రమ్ లను అభినందించాడు సర్పంచ్.

తర్వాత అందరూ కలిసి వారు చదివిన స్కూలుకు వెళ్లి హెడ్మాస్టర్ కోదండ రామయ్య గారిని కలిశారు. తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇష్టం ఉన్న విద్యార్థులు మాతో పాలుపంచుకునే రీతిగా చేయండి సార్." ఎంతో వినయంగా రాఘవ కోరాడు.

హెడ్మాస్టర్ సర్క్యులర్ ను రెడీ చేసి అన్ని సెక్షన్స్ కు పంపారు. "రేపు మీలో ఎవరన్నా ఒకరు వస్తే పాల్గొనే పిల్లల పేర్లు మీకు ఇస్తాం. నేను, నా సహోపాధ్యాయులం కూడా ఈ మహత్కార్యములోపాలుపంచుకుంటాం. మీ సంకల్పం చాలా గొప్పది. ఆనందంగా అందరం కలిసి నిర్వహిస్తాం." తన వంతు హామీని ఇచ్చారు హెడ్మాస్టర్.

మంచి మొక్కలను తెప్పించే దానికి తమ మిత్రులను రాఘవ, త్రివిక్రమ్‌లు ఒంగోలు, రాజమండ్రికి పంపారు. ఆ మిత్రులు వేప, నేరేడు, కానుగ, మర్రి, టెంకాయ మొక్కలతో రెండవ రోజు సాయంత్రానికి తిరిగి వచ్చారు.

పురోహితుడు బలరామశాస్త్రి గారు నిర్ణయించిన శుభముహూర్తాన మన కృష్ణార్జునులు, వారి సతీమణులు, స్నేహితులు, అధ్యాపకులు స్కూలు పిల్లలు, పంచాయితీ సిబ్బంది... అందరూ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.సర్పంచి గారు వచ్చి పది మొక్కలు నాటి... అర్జెంటు పని ఉందని... సవినయంగా చెప్పి వెళ్లిపోయారు. ఆడుతూ పాడుతూ అందరూ కలసికట్టుగా పనిచేశారు. వారం రోజుల కార్యక్రమంగా అనుకున్న ఆ మహత్కార్యాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేశారు. అనుకున్న దాన్ని సాధించినందుకు రాఘవ, అమృత, త్రివిక్రమ్, శాంతి వారి మిత్రులు... ఎంతగానో సంతోషించారు.

**

నెల రోజుల కిందట క్రొత్తగా వచ్చిన యం.ఆర్.ఓ ఆ గ్రామానికి వచ్చి గ్రామాధికారులతో కలిసి ఊరంతా తిరిగి చూశారు. ప్రతి రోడ్డుకూ ఇరువైపులా క్రమంగా నాటి... పెరుగుతున్న చెట్లను(మొక్కలు) చూశారు. నిర్వాహకులను గురించి తెలుసుకున్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కలసి ఆ గ్రామాన్ని గురించి వివరించారు.

అంతా శ్రద్ధగా విని... "ఆ గ్రామాన్ని... అచ్చటి కార్యకర్తలను నేను చూడాలి. ఇరవై రెండవ తేదీన ఆ ఊరికి నా ప్రోగ్రాం... సర్పంచికి తెలియజేయండి." అనుచరులకు ఆదేశాన్ని ఇచ్చారు జడ్పీ చైర్మన్ గారు. వారి అనుచరులు గ్రామాధికారులకు వారి విజిట్ గురించి తెలియజేశారు.

***

జడ్పీ చైర్మన్ గారి స్కార్పియో కారు ఆ గ్రామంలోని హైస్కూల్ ఆవరణంలో వచ్చి ఆగింది. వారు, అనుచరులు కారు నుండి దిగారు.

గ్రామస్థులు సవినయంగా చేతులు జోడించారు. ప్రతి నమస్కారాన్ని ఎంతో వినయంగా నగుమోముతో చేశారు చైర్మన్ గారు. "ఊరంతా ఒక్కసారి తిరిగి వద్దాం పదండి".

అందరూ కలిసి ఊరంతా తిరిగి హైస్కూల్ ఆవరణలో వేసి ఉన్న స్టేజిని సమీపించారు. చైర్మన్ సుఖాసీనులయ్యారు. హెడ్మాస్టర్ గారు పూలమాలను వారి మెడలో వేశారు. శాలువాను కప్పి సత్కరించారు.

రాఘవను, త్రివిక్రమ్‌ను... సర్పంచ్ జడ్పీ చైర్మన్ గారికి పరిచయం చేశారు. కరచాలనం జరిగింది. మెడలోని పూలమాలను టేబుల్ పై ఉంచి...

"పది సంవత్సరాలుగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ పదవిలో ఉన్నాను. మా యం.ఆర్.ఓ గారు ఈ ఇద్దరు యువకులను గురించి... వారు చేసిన మహత్కార్యాన్ని గురించి చెప్పినప్పుడు... వీరిని కలవాలని, మీ గ్రామాన్ని చూడాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాఘవ త్రివిక్రమ్ ల్లాగా ఊరికి ఇద్దరు ఉంటే చాలు. మన జిల్లా కొద్దికాలంలోనే ఇతర ప్రాంతాలకు ఆదర్శప్రాయం అవుతుంది. నాకు తెలుసు... వీరి గుండెల నిండా ఉండేది మనం... మన ఊరు... మన వారు బాగుపడాలి అనే సత్సంకల్పం... ఈ భావన చాలా గొప్పది... యువతరం అందరిలోనూ యిలాంటి భావన ఉంటే మన జిల్లా... మన రాష్ట్రం... దేశానికే ఆదర్శప్రాయం అవుతుంది. అలా కావాలని నా కోరిక... అందుకుగాను మీ ఊరిని ఆదర్శంగా తీసుకొని నా వంతు ప్రయత్నం... నేను చేస్తాను. మీ అందరికీ ఒక సంతోషకరమైన వార్త. ఈ గ్రామం మన జిల్లాలోనే ఉత్తమ గ్రామం. ఈ గ్రామాభివృద్ధికి పాతిక లక్షలు విరాళాన్ని ఇస్తున్నాను. మంచి మనస్సులు ఉన్న మీకందరికీ నా శుభాశీస్సులు... వందనాలు. యువతరం జిందాబాద్. జైహింద్." ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆ ఆవరణం దద్దరిల్లింది. రాఘవ ఎంతో ఆనందంతో త్రివిక్రమ్‌ను కౌగిలించుకున్నాడు.

-చతుర్వేదుల చెంచు సుబ్బరాయ శర్మ

First Published:  29 Oct 2023 1:30 PM IST
Next Story