విజాతి ధృవాలు ( కవిత)
BY Telugu Global27 Jun 2023 5:14 PM IST
X
Telugu Global Updated On: 27 Jun 2023 5:14 PM IST
ఎందుకు మొదలైందో
ఎలా మొదలైందో తెలియదు!
చిటపట చినుకుల
మాటలే అనుకుంటే
వాదనల ఈదురుగాలులు వీచాయి
అసంతృప్తి అవిరిని వెలిగక్కాయి!
"ఆగ్రహిం"చిన వర్షబిందువులు
బాణాల్లా చురుగ్గా
మనసును తాకాయి
"ఇగో"ల తుంపర మొదలై
వాగ్యుద్ధపు జడివాన కురిసింది
ఇరువురి మధ్య
మౌనమై "వెలిసింది"
ఎవరికి వారు’ తగ్గేదిలే ‘అనుకుంటూ భీష్మించుకుని
ఎడమొహం పెడమొహాల
విజాతి ధృవాలైనారు!
తప్పనిసరి అవసరమో
విడదీయరాని అనుబంధమో
సహజీవన సూత్రమో
ముడిపడిన సంబంధమో
ముద్దుపలుకుల పసితనమో
రాయబారం నడుపుతాయి!
ఇద్దరిలో ఒకరు బ్రతిమాలాక
తప్పొప్పులు విచారించుకున్నాక
మన్నింపులు కోరుకున్నాక
అనురాగం సరాగాలాడుతుంది
ముడుచుకు కూర్చున్న బింకం
అలక మానుతుంది
ముద్దుముచ్చట్లకు తెరతీస్తాయి
నవ్వుల పువ్వులు విరబూస్తాయి!
మౌనానికి
కాలం తీరిపోతుంది తప్పక...
అప్పటిదాకా
వేచిచూడాల్సిందే!!!
- చంద్రకళ దీకొండ,
Next Story