Telugu Global
Arts & Literature

తిప్పుడు పొట్లాం - (కథానిక)

తిప్పుడు పొట్లాం - (కథానిక)
X

రెండు రోజుల్లో దీపావళి.

మనవడు, మనవరాలు వచ్చే సమయం దగ్గర పడుతోంది.

మా వీధిలో హడావుడేమి లేదు.

చమురు దీపాలు పెట్టడం మానేశారు. ఎలక్ట్రికల్

వీధి దీపాలే దీపాలవరుస.

ప్చ్! అంతా రెడీమేడ్!..కృత్రిమం..

దీపావళి..నా చిన్నప్పటి రోజుల ఆనందపు జ్ఞాపకాలు తారాజువ్వల్లా పైకి ఎగిసాయి...

***

బామ్మ..ఒరేయ్ ప్రసాదం! ఇవ్వాళ నరక చతుర్దశి ఒళ్ళంతా

నూనె పట్టించుకో ..తలంటు పోసుకోవాలి, గట్టిగా అరిచింది.

అరుగు మీద నుంచి సిసింద్రీ

' బర్న్ టెస్ట్ 'చేస్తున్న నాకు ఆ అరుపు నా చెవిలో ' తాటాకు టపాకాయలా' పేలింది.

గబగబ తలంటు పోసుకుని వీధిలోకి పరుగు పెట్టాను.

చేబోలు ప్రసాద్ గాడు ఇంకా రోడ్డెక్కలేదు. ఎదురింటి బర్రెయ్య గారి మనవడు

రామం సోవియట్ అట్టలతో తయారు చేసిన సిసింద్రీ గుల్లల్లో మందు కూరుతున్నాడు.

"అన్నాయ్! రాత్రినుంచి ఎన్ని కూరావు"?. అడిగాను.

"500 వరకు ఉంటాయిరా" అన్నాడు.

అమ్మో ! అన్నా! అంటూ గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు.

ఇంకా వీధిలో ఎవ్వరి సవ్వడి లేదు. అక్కడక్కడ " ఢాం! ఢాం మంటూ టపాకాయల సౌండ్లు వినబడుతున్నాయి.

రామాలయంముందు

మొక్కరాల రామం, విద్యశంకర్ , చేబోలు సుబ్బారావు ఇత్యాదులు కమిటీ తరఫున తలపెట్టిన

దీపాలంకరణ కోసం గుడిముందు కర్రలు పాతి మధ్యలో బద్దలు కట్టి వాటిమీద బంక మన్ను వేసి వాటి మీద ప్రమిదలు పెడతారుట.

అందరం ఆ సెంటర్లో

బాణాసంచా కాల్చామని చెప్పారు..

మొక్కరాల రామం వెయ్యి జువ్వ కట్టాడట.

అందరు కాల్చేసాకా జువ్వల పోటీలు అక్కడ జరుగుతాయి.

నాన్న ఈ రోజు సాయంత్రం

బాణాసంచా వెలివెల ముత్యం కొట్లో కొంటానని చెప్పారు. తమ్ముళ్ళు నేను ఒకేరకం కొత్త బట్టలు కట్టుకున్నాం.

బామ్మ గారు ఐతంపూడి నుంచి వెంకన్న తెచ్చిన వెన్నపూస కాచిన సువాసన ఘుమఘుమలాడుతూ ముక్కున తాకుతోంది.

నేతితో మైసూర్ పాకం చేయడానికి అమ్మ బామ్మ కి సాయం చేస్తోంది.

దేవుడి గదిలో అమ్మ వెలిగించిన అంబికా దర్బార్ అగరవత్తు

సువాసన వేంకట రమణుడు ఆనందంగా ఆఘ్రాణిస్తున్నాడు.

ఇంతలో నడిపూడి వెంకటరత్నం జ్ఞాపకం వచ్చాడు.

బర్రెయ్య గారి ఇంటి పక్క దొడ్లో చిన్న పాకలో ఉంటాడు.

వాడు ఒకప్పుడు నా క్లాసుమేటు. వాడి

నాన్న వడ్రంగి. వాడ్ని బడి మానిపించి పనిలో పెట్టేసాడు.

రత్నం చెక్కతో కొండపల్లి బొమ్మల్లా కొంగ, ఏనుగు, అంబారి లాంటి బొమ్మలు చేసి నాకు చూపించేవాడు.

అవి భలే బాగుండేవి.

వాడి ఇంటికి వెడితే మా బామ్మ ఎందుకు కోప్పడేదో నాకు అర్ధం అయ్యేది కాదు.

నేను ఏడ్చి గీ పెట్టినా. బలవంతాన ఇంటికి వచ్చాకా స్నానం చేయించేది అమ్మ.

" నన్ను ఎందుకు మీ ఇంట్లోకి రానివ్వరేంట్రా మీ బామ్మ గారు?

నాకు జవాబు తెలియని ప్రశ్న సంధిస్తాడు ఎప్పుడూ!

నాకు తెలియదు. కానీ మనం ఫ్రెండ్స్ మి కదా! అవన్నీ వదిలేయ్ అన్నాను.

వాడు సరైన శరీర పోషణ లేకపోవడం వల్ల బక్కగా ఉండేవాడు. వాడి బట్టలు చూసి నాకు జాలి కలిగి ,

అమ్మకి చెప్పాను.

" నువ్వు వాడకుండా ఉంచిన లాగు, చొక్కా ఇవ్వరా వాడికి" అంది. వెంటనే పట్టుకు వెళ్ళి ఇచ్చాను.

సంతోషంగా తీసుకున్నాడు.

దీపావళి అని బామ్మ చేసిన

బెల్లం మిఠాయి, కారప్పూసా తీసుకెళ్ళి ఇచ్చాను. వాడు చెల్లి ఆనందంగా తిన్నారు.

ఇంతలో వాడు..

" ఒరేయ్! మా నాన్న 'తిప్పుడు పొట్లాం' బాగా కడతాడు..అన్నాడు.

" తిప్పుడు పొట్లాం అంటే? అడిగాను.

అయ్యో! తెలియదా?

"భలే ఉంటది. ,ఊరించాడు.

ఇంతలో వాడి నాన్న రంబాలు వచ్చి నా ముందు కూర్చున్నాడు.

"పెసాదం బాబు!

తిప్పుడు పొట్లం తిప్తూంటే

సుట్టూ నిప్పు రవ్వలు

ఇష్ణు చక్రంలా మెరుపుల్తో కనబడతాయి.

నీకు మా ఓడికి కట్టిత్తానుగా" అన్నాడు.

ఇంతలో మా నాన్న రమ్మంటున్నాడని మా పనబ్బాయి కృష్ణ కబురట్టుకు వచ్చాడు.

****

బజార్లో వెలవల ముత్యం కొట్లో కళ్ళు చెదిరిపోయే

శివకాశి సరుకు వచ్చింది.

స్టాండర్డు, అనిల్, బ్రాండ్

కాకరపువ్వొత్తులు దగ్గరనుంచి

పాంబిళ్ళల వరకు పెట్టెలు పేర్చి ఉన్నాయి. దీపావళి మందుల కొత్త వాసన గాఢంగా పీల్చాను.

ముందు వాకిట్లో తోలుతో చేసిన తూటా జింగిడీలు ఉన్నాయి. పక్కనే పెద్ద గమేళాలో "కుండ పిచికలు" దీపావళి రాత్రంతా కీచ్ కీచ్ మనడానికి రెడీగా ఉన్నాయి.

గుత్తులు గుత్తులుగా తాటాకు టపాకాయలు వేలాడుతున్నాయి.

అవన్నీ చూస్తుంటే నా మనసు ఆనందంతో చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది.

మతాబుమందు ఆల్రెడీ కొనేసి , నాన్న, నేను గొట్టాల్లో కూరేసాము.

చిచ్చుబుడ్లు మా పనబ్బాయి కృష్ణ ఒక వంద తయారు చేసి అరుగుమీద హిందూ పేపరు పరిచి వరసగా పేర్చి పెట్టాడు.

దసరా సెలవుల్లో మానాన్న పనిజేసే

బ్రూక్ బాండ్ కాఫీ పొడి ప్యాకెట్లు పెట్టే తేలికైన చెక్కపెట్టి ముక్కల్ని కాల్చి బొగ్గు తయారు చేసి

దాన్ని మెత్తగా 'వస్త్ర కలితం' చేసి పెట్టి. సూరేకారం ఉడకపెట్టి.. ఎండబెట్జి, కొనుక్కొచ్చిన గంధకం 7-2-1

పాళ్ళతో కలిపి ఉంచాను నాలుగు రోజుల క్రితం

సోవియట్ పేపరు గొట్టాల్లో రెండొందలు కూరేసాను.

"రండి సర్! అంటూ మా నాన్న ని ఆహ్వానించాడు ముత్యం.

కొత్తరకాలు అంటూ తూనీగలు, కప్ప బొమ్మలున్నవి, వెన్నముద్దలు,

కాకరపువ్వొత్తుల దగ్గర్నుంచి తలో రకం డజను చొప్పున కొనేసాము. నేల టపాకాయల పొట్లాములు రెండు విడిగా

నా పోకెట్ మనీతో కొన్నా.

ఒకటి రత్నం కి ఇద్దామని.

పేక తో తయారు చేసే జువ్వలు రెండొందలు

నాన్న కొనుక్కున్నాడు.

నాన్నకి దీపావళి అంటే గొప్ప సరదా!

ఒక పెద్ద అట్టపెట్లో సర్ది రిక్షాలో పెట్టించాడు ముత్యం.

ఇంటికి వెళ్ళ గానే

తమ్ముళ్ళు గోల గోలగా ఆనందంగా కేరింతలు కొడుతూ వాటి దగ్గరకు వచ్చారు..

ఇంత హడావుడిలో ఉండగా వెంకటరత్నం వీధి గుమ్మం దగ్గర తచ్చాడుతున్నాడు.

వాడ్ని చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్ళాను.

"మా అయ్య రమ్మంటున్నాడు ",అన్నాడు.

"అన్నం తినరా!' అమ్మ మాట వినిపించనట్టు

వాడితో పరిగెత్తాను.

రంబాలు ఇంటి అరుగు మీద

తెల్లటి గుడ్డ మీద ఆవు పేడ అలికి ఆరబెట్టి ఉంది.

ఒక గమేళాలో రంపం పొట్టు

రాళ్ళ ఉప్పుతో కలిపి ఉంది.

ఆరు తాటి కమ్మలు, చాంతాడు పక్కన పెట్టి ఉన్నాయి.

కాసేపటికి ఆరపెట్టిన గుడ్డ పరిచి మధ్య రంపపు పొట్టు రాళ్ళ ఉప్పు కలిపిన మిశ్రమం పోసాడు, దాన్ని నెమ్మదిగా చుట్టలా చుట్టి నిలబెట్టిన

తాటి కమ్మల మధ్య నిలబెట్టీ అడుగునుంచి , కమ్మల చుట్టూ చాంతాడు గట్టిగా కట్జి

మూడు కమ్మల చివర్లు కలిపి అక్కడ పొడుగు చేంతాడు కట్టాడు తిప్పడానికి వీలుగా!

"దీని మీద నిప్పులు వేసి తిప్పాలి పెసాదం బాబు! అని ఎలా తిప్పాలో చూపించాడు రంబాలు.

ఓహ్! మీ నాన్న ఎంతో మంచివాడురా!" అన్నాను సంబరంగా!

"మరి! మా అయ్య కి తెలియని పని లేదు తెలుసా" అంటుంటే వాడి కళ్ళు మిలమిలా మెరిసాయి.

ఇంటికెళ్ళి, అమ్మ కి నాన్నకి ఈ మాట చెప్పాను. ఊరికే తీసుకోకు పాపం,.

" వాడికి కొన్ని దీపావళి సామాన్లు ఇయ్యి అన్నారిద్దరు.

అలాగే అన్నాను సంతోషంగా!

****

సాయంకాలం అయ్యింది.

రోజూ చీకటి అంటే భయం.

ఈ రోజు చీకటి అంటే మోదం!

ఎప్పుడప్పుడు చీకటవుతుందా అని

ముగ్గురం, మిగిలిన పిల్లలం ఎదురుచూస్తున్నాం.

నెమ్మదిగా చీకటి ఆకాశానికి కాటుక పెట్టి దీపావళి ని పిలిచింది.

వెలుగుల సూరీడు

"వెళ్తున్నా ఆ శబ్దాలు నేను భరించలేను బాబు! అంటూ పడమర వైపు దాక్కున్నాడు

బామ్మ మడిగా ప్రమిదల్లో నూనె పోసి నానబెట్టిన వర్తులు వేసి వెలిగించి దేవుడి ముందు పెట్టి గోగు కాడలకు కట్టిన గుడ్డ వర్తులు మా చేత వెలిగింపచేసింది.

కొత్తబట్జలు కట్టుకుని

వీధి గుమ్మంలోకి

"దిబ్బు దిబ్బు దీపావళి!

మళ్ళీ వచ్చే నాగుల చవితి" అంటూ దివిటీలు కొట్టాము

బామ్మ నోట్లో బెల్లం మిఠాయి పెట్టింది.

ఏదో జ్ఞాపకం వచ్చి కాకరపువ్వొత్తులు, మతాబులు చిచ్చుబుడ్లు రకానికి ఆరు చొప్పున తీసుకుని వెంకట రత్నం ఇంటికి పరుగెత్తాను.

వాటిని చూసిన రంబాలు , రత్నం అమ్మ, చెల్లి, వాడు

ఆనందంతో పొంగి పోయారు.

వాడి మొహంలో నిజమైన దీపావళి కనబడింది.

'దీపావళి అనగా దీపముల వరుస అంటూ తెలుగు వాచకం లో ఉన్న పాఠంలో వాక్యాలు చదువుతూ

వీధిలో పిల్లలందరం

కాల్చడం మొదలు పెట్టారు.

నేను, రత్నం ముందుగా

వీధి చివరకు వెళ్ళి తిప్పుడు పొట్లాం తిప్పడం మొదలు పెట్టాం. వీధిలో ఇంటి అరుగుల మీద దీపాలు పెట్టారు. వెలుగులతో వీధి అంతా నిండిపోయింది.

మా తిప్పుడు పొట్లం చిటపటలతో నిప్పురవ్వలు

కృష్ణుడు వదిలిన సుదర్శనం లా గిరగిర తిరుగుతూ తిమిరం మీద సమరం చేస్తోంది. అందరూ మమ్మల్నే చూస్తున్నారు ఆశ్చర్యంగా.

నేను గర్వంగా మరింతగా గిరగిర తిప్పాను.

వీధి అరుగు మీద కూర్చుని అమ్మ తమ్ముళ్ళతో మతాబులు కాల్పిస్తోంది.

బామ్మ ప్రమిదల్లో నూనె పోస్తోంది.

రామాలయం సెంటర్లో నాన్న,రామం, విద్యా

శంకరం , సుబ్బారావు అన్నయ్య, ప్రసాద్ గాడు

జువ్వలు వదులుతున్నారు.

రాములోరు దీపాల వెలుగులో సీతమ్మ ని చూస్తూ మైమరిచి ఉన్నారు. హనుమ వారిద్దరి మీద కాలుతున్న నిప్పులు పడకుండా రెప్ప వాల్చకుండా కాపలాకాస్తున్నాడు.

నాన్న తోలు జింగిడీని నేలమీద రాసి వదులుతున్నారు.

నేను నిక్కర్లో సిసింద్రీలు వేసుకుని, ఒకోటీ తీస్తూ చివర ముచికిని నోటితో కొరుకుతూ

చేతిలో నిప్పు కణికలా ఉన్న చాంతాడు మీద పెట్టి ఉఫు.ఉఫూ అంటూ ఊదుతూ 'చుయ్' మనగానే వదులుతున్నా.

ఇంతలో జరిగిందా సంఘటన, పైకి వదిలిన జువ్వలు కొన్ని కొబ్బరాకులకు తగిలి నేలబారుగా వెళ్ళి హఠాత్తుగా మా బామ్మ చీరమీద పడింది. ఆవిడ కంగారుగా దులుపుకోవడంలో చేతిలో ఉన్న నూనె చీరమీద పడి భగ్గున అగ్ని రాజుకుంది.

అందరూ కేకలు పెడుతున్నారు.

వేణమ్మగారు! చీర అంటుకుంది అంటూ..,

ఈ అనుకోని హఠాత్పరిణామానికి అందరూ విస్తుపోయి చూస్తున్నారు తప్ప ఎవ్వరూ ముందుకు వెళ్ళడం లేదు.

ఇంతలో ఎవరో అక్కడ ఉన్న ఇసక ని మంటల పోసి గట్టిగా చేతులతో బామ్మ వంటిమీద చీరమీద గట్టిగా కొట్టేసరికి ఆరిపోయింది.

బామ్మ నిస్సత్తువుగా అరుగుమీద కూలబడింది. అందరం పరిగెత్తుకుని వెళ్ళాము.

నాన్న ...అమ్మ! అమ్మ! అంటూ దగ్గరకు వెళ్ళారు. అమ్మ అత్తయ్య గారు! అంటూ వెళ్ళి పక్కన కూర్చుంది.

"ఇబ్బంది లేదు' ఆ స్వామే కాపాడారు అంది దణ్ణం పైకి పెడుతూ ఆయసపడుతూ సైగ చేసింది.

వీడే ఆ దేవుడు అమ్మ! అంటూ నాన్న

వెంకట రత్నాన్ని తీసుకెళ్ళి బామ్మ ముందు నిలబెట్టాడు.

వాడు ఒణికి పోతున్నాడు . బామ్మగారి మడి మైలపడిపోయిందని.

బామ్మ కళ్ళల్లో నీళ్ళు! వాణ్ణి దగ్గరకు రమ్మనమని పిలిచి దగ్గరకు తీసుకుని పక్కనే ఇత్తడి డబ్బాలో ఉన్న మిఠాయి ఉండ నోటిలో పెట్టి,

దీర్ఘాయుష్మాన్ భవ! అంటూ ఆశీర్వదించింది.

'మానవత్వానికి మడిఅడ్డుకాదు.. దేవుడు కళ్ళు తెరిపించాడు అంది మా బామ్మ పైకి గట్టిగా.,. కళ్ళు తుడుచుకుంది అప్రయత్నంగా.

వెంకట రత్నం మొహం మతాబులా వెలిగిపోయింది.

నోరు తియ్యగా అయ్యింది.

దీపావళి దివ్వెల మరింతగా ప్రకాశించాయి.

వాడు కూడా మాతో దీపావళి ఘనంగా చేసుకున్నాడు.

- చాగంటి ప్రసాద్

First Published:  11 Nov 2023 1:14 PM IST
Next Story