నిరంతర వర్తమానం కానియకు
చూట్టానికదొక
చిన్న కన్నీటి బొట్టే!
కానీ దాని వెనకాల అనేక
అగాధ శోక సముద్రాలున్నాయి!
కావడానికదొక
కనిపించని నిట్టూర్పే
కానీ అదొక జీవితకాలపు
నిస్పృహల హోరుగాలి!
ఆ ముఖంలోకనిపించే నిర్మల
నిశ్చేతనను చూసి మోసపోకు
అది దిగంతాలదాకా పరుచుకున్న
విశాల నిరాశా సహారాల
క్లుప్త రూపమయ్యుండొచ్చు !
లోనా బయటా అంతటా
దుఃఖమే దుఃఖం!
ఇంజనువెనకాల బోగీల్లాగా
పాతదుఃఖంవెంట కొత్తదుఃఖం వస్తూనేఉంటుంది.
బాధలను
తలుచుకుంటుంటేనే బాధ
అనుభవించే టప్పుడు మరీబాధ!
ప్రతి బతుకూ బాధల ప్రశ్నార్ధకాల కొడవలి గుర్తే!
ప్రతి ప్రశ్నా
ఒక నిరంతరనిశీధి పెంజీకటే!
ఇవ్వాళ బాధా బతుకూ పర్యాయపదాలైపోయాయి.
దుఃఖమూ,ఏడుపూ,కోపమూ,వేదనా
ఇవి నిచ్చెనమెట్లు!
జ్వలిస్తూ చెలరేగే అంతశ్చేతన కార్చే నెత్తురుబొట్లు!
జీవితపు ఆటుపోట్లలో భాగంగా
బాధలు వస్తాయి,పోతాయి!
కానీ దాన్నో నిరంతర వర్తమానంగా మారనీకు!
బాధలను తొలగించుకోవడానికి ప్రయత్నించకపోవడం
జీవితపు నిరర్థకతకు సంకేతం!
ఏడుస్తూకూచోడం
దుఃఖానికి గుర్తే కాని
బాధకు పరిష్కారం కాదు!
దిగుల్నుపగలగొట్టి
వాస్తవస్థితిని మార్చుకో!
ప్రయత్నించి పీడనపై
తిరగబడటం నేర్చుకో!
- బృందావనరావు (అహ్మదాబాద్)