సేద్యం నుంచి సాహిత్య శిఖరాలకు.. సన్నపురెడ్డి
‘గంట మోగినప్పుడల్లా బడి చేత దీపాలుంచుకొని గుమిగూడిన చుక్కల పగటి ఆకాశమవుతుంది.. గంట మోగినప్పుడల్లా బడి పావురాలు వాలిన దేవాలయ ప్రాంగణంలా ముస్తాబవుతుంది. పగలంతా బడి జోలపాడి లాలించే అమ్మ ఒడి’ తన బడి కవితలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి బడి ప్రశస్తి, పవిత్రత గురించి రాసిన వాక్యాలు ఇవి. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన సన్నపురెడ్డికి బడి అన్నా, విద్యార్థులన్నా ఉన్న ఎనలేని ప్రేమకు ఈ వాక్యలు అద్దం పడతాయి. అంతేకాదు ‘బోధనన్నా అధ్యయనమన్నా – అవి రెండూ రెండు కిటికీలుగా శ్వాసించే బడిగది అన్నా అంతులేని ఇష్టం` అంటారు ఆయన. విద్యాబోధన విషయంలో సన్నపురెడ్డి చాలా నిక్కశ్చిగా ఉండేవారు. విద్యార్థులు అంటే ప్రాణంపెట్టే సన్నపురెడ్డికి పిల్లల చదువుతర్వాతే మిగితా విషయాలు. ఆయన బోధనలో ఉన్నతస్థాయికి చేరిన విద్యార్థులు లెక్కలేనంతమంది. ఉపాధ్యాయులతోపాటు ప్రభుత్వ, పైవేటు రంగాల్లో అత్యంత ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారూ ఉన్నారు.
అచ్చంగా ఉపాధ్యాయుడైతే సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నామం పెద్ద చర్చనీయాంశంకాదు. ఆయన బడిదాటి సమాజహితమైన జనరంజక రచనలతో దిగ్గజంగా ఎదగడం సాహితీ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశం. రాసిన కవితలకూ ప్రశంసలు, కథలకూ అభినందనలు, నవలలకు ఎల్లలు దాటిన కీర్తి ప్రతిష్ఠలు. అందుకే సన్నపురెడ్డి సాహితీ కీర్తి కిరీటం.
35 ఏళ్లకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో మమేకమై విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన సన్నపురెడ్డి ఈ మార్చి 31న పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయ, సాహిత్య ప్రస్థానాన్ని ప్రస్తావించాలనిపించింది.
సన్నపురెడ్డి 1963లో కడప జిల్లా, కాశినాయన మండలం, బాలరాజుపల్లిలో జన్మించారు. బిఎస్సీ, బిఈడీ చేసి 1989 లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారారు. అంతకు ముందు 1987 నుంచే ఆయన కవి, కథకుడు, నవలా రచయిత. ఉపాధ్యాయవృత్తిలో ఉంటూనే అటు సాహిత్య సేవలోనూ ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. వందకు పైగా కవితలు రాసిన సన్నపురెడ్డి దాదాపు వంద కథలు, పది నవలలు రాశారు. చాలా కథలకు బహుమతులందుకున్న ఆయన తన తొలి నవల ‘కాడి’ కి 1998 లో ఆటా నవలల పోటీలో ద్వితీయ బహుమతిని అందుకున్నారు. ఆ తర్వాత వెనుదిరి చూడక పాండవబీడు, పాలెగత్తె, తోలుబొమ్మలాట, చినుకుల సవ్వడి, ఒక్కవాన చాలు, మబ్బులువాలని నేల , ఒంటరి, కొండపొలం నవలలు రాశారు. ఒంటిరి, కొండపొలంలకు తానా బహుమతులు దక్కగా కొండపొలం నవలను ప్రముఖ దర్శకుడు క్రిష్ అదే పేరుతో సినిమాగా రూపొందించారు. మిగిలిన నవలలకూ బహుమతలూ, ప్రశంసలు దక్కాయి. ఆయన రాసిన కథలతో కొత్త దుప్పటి, బతుకు సేద్యం పేరుతో రెండు కథా సంపుటాలను వెలువరించారు.
సన్నపురెడ్డి రచనల్లో జీవం తొణికిసలాడుతుంది. అందుకే ఆయన రచనలు జనరంజకం. ఆయన ప్రతి రచన సాహితీ పోటీ ప్రపంచంలో నిలిచి నెగ్గినవే. ఆయన ఘనకీర్తిని చాటినవే. తానాలో దాదాపుగా ఆయన రాసిన అన్ని నవలలకు బహుమతులు లభించాయి. ‘నువ్వు మా నవలల పోటీకి నవల రాయడం ఆపితే ఒక్క సారైనా వేరొకరికి బహుమతి ఇస్తామ’ని తానాలాంటి సంస్థ చెప్పిందంటే సన్నపురెడ్డి రచనల పదును ఎలాంటిదో చెప్పకనే చెబుతుంది.
సన్నపురెడ్డి నిగర్వి. అసలు శరీర అవయవాల్లో దాని తాలూకూ ఆనవాల్లుంటేనే కదా! అది మొగ్గ తొడిగి బయటకు నిగడడానికని సన్నపురెడ్డిని తెలిసినవాళ్ళంటారు. అర్దం పర్దం లేని పదిలైన్ల పదాలు రాసి కవిత్వమని చెప్పుకునేవాళ్ళూ, పట్టుమని నాలుగు కథలు రాసి సాహిత్య పోషకులుగా కితాబునిచ్చుకునేవారూ, ఒక నవలరాసి సినిమా ప్రపంచాన్నే యేలే అర్హత తమదేనని జబ్బలు చరుచుకునేవారున్న సమూహంలో సన్నపురెడ్డిలాంట వ్యక్తి అరుదు.
సన్నపురెడ్డి కమర్షియల్ రైటర్ కాదు. సినిమా టిక్‌గా అభూత కల్పనల మేళవింపుతో అడ్డగోలు రాతలు రాసి సీరియల్‌కో, సినిమాకో అమ్మి సొమ్ము చేయాలనే తత్వం ఉన్న రచయితా కాదు.
సమకాలీన సామాజిక స్థితిగతులను కాచివడపోసి కథలు, నవలలుగా రాసి సమాజాన్ని కదలించిన రచయిత. విప్లవ సాహితీ కారుడు కాదుగానీ అట్టడుగు వర్గాల పక్షపాతి అని చెప్పవచ్చు. వారి ఈతి బాధలను సమాజానికి ఎరుకపరిచిన రచయిత. దగా పడ్డ జాతుల బ్రతుకు చిత్రాన్ని తన కనుపాపల కాన్వాస్‌పై ముద్రించి ఆ బొమ్మలకు ప్రాణం పోస్తున్న రచయిత.
అందుకే ఇప్పటికీ సన్నపురెడ్డి పైన చెప్పుకున్న వర్గాల కళ్లముందే ఉంటారు, వారితో మాటలు కలుపుతారు, వారి కష్టాలు వింటారు. పరిష్కారాలు చూపే ప్రయత్నం చేస్తారు. వాటన్నింటినీ రచనలుగా మారుస్తారు. తద్వారా సమాజానికి చురక అంటిస్తారు, పాలక వర్గాలను చెల్లున కొరడాతో చరుస్తారు.
ఆదిపత్య కులంలో పుట్టుక అయినా పీడితుల పక్షపాతి సన్నపురెడ్డి. జీవితకాలం కాడి భుజానేసుకొని బతుకును గుంజే మట్టి మనిషి రైతు పక్షపాతి ఆయన. ఇంటికూలీలుగా మారి రైతుల వెన్నుకాచే దళితుల పక్షపాతి ఆయన. పల్లె చిత్రంలో అటు సేద్యగాళ్ళు ఇటు దళితుల బ్రతుకు చిత్రాన్ని సన్నపురెడ్డి రచనల్లో మనం సమగ్రంగా దర్శించవచ్చు. దళితులు ఇతర అణగారిన వర్గాల రక్తమాంసాలు కరగకుండా పెత్తందారుల ముఖచిత్రమే ఉండదంటారు తన రచనల్లో సన్నపురెడ్డి.
‘పాలు లేని అగ్రవర్ణాల పురిటి బిడ్డకు ఓదళిత మహిళ పాలిచ్చి పెంచడం సన్నపురెడ్డి ‘చనుబాలు’ కథలో మనకు కనిపిస్తుంది. అదొక్కటేకాదు ఇలాంటి సన్నివేశాల దొంతర ఆయన కథల్లో మనకు వరుసకట్టి తారసపడతాయి. పీడితుల వ్యధలను ఆయన తన రచనలద్వారా విస్పష్టం చేయడం కనిపిస్తుంది. అందుకే ఆయన రచనలు సమాజహితం.
సన్నపురెడ్డి మితభాషి. చాలా తక్కువ మాట్లాడి మనతో ఎక్కువ మాట్లాడిస్తారు. తనరచనలతో జనాన్ని అంతకుమించి ఆలోచింప జేస్తారు. బడి కాగానే తీరిక సమయంలో గ్రామస్తులతో మాట్లాడతారు. రైతులు, కూలీలు, మేదర్లు, గొల్లలు ఊర్లోని అన్ని సమూహాలతో మాట్లాడటం ఆయనకు ఇష్టం. పైపై మాటలుకాదు, వారి కష్టాలపై లోతుగా అధ్యయనం చేస్తారు.
మధ్యతరగతి వ్యవసాయకుటుంబం నుంచి వచ్చిన సన్నపురెడ్డి సీమ కరువుకు ఎదురొడ్డి రైతుగా వ్యవసాయమూ చేశారు. సేధ్యం కష్టాలపై కవితలూ, కథలేకాదు ఏకంగా నవలలే రాశారు.
‘మేఘాల నీడలు కదిలితే చాలు కళ్ళు – పురివిప్పే నెమళ్ళవుతున్నాయి.
కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై పైరు చెక్కిళ్ళమీద జాలిగా జారుతోంది.’
ఒక్కవాన చాలు కవితలో సీమ కరువు పరిస్థితులను ఏకరువు పెడతారు సన్నపురెడ్డి.
వ్యవసాయమన్నా, రైతన్నా ఆయనకు ఎనలేని ప్రీతి.
వారి దుస్థితిని తట్టుకోలేని తడిగుండె సన్నపురెడ్డిది. అందుకే.. ‘ఓట్లకుతప్ప మరెందుకూ పనికిరాని యీగడ్డమీద వరుణదేవుడికి కూడా సీతకన్నే’ అని ఆవేదన చెందుతారాయన.
‘మాడి మసైపోతున్న పైరు కన్నీటి చుక్కలై నాకళ్ళ మేఘాల్లోంచి జారటంతప్ప’ అని తన నిస్సహాయతనూ వ్యక్తపరుస్తారు.
‘ఈ సీమ ఎడారిగా మారినా బాగుండు – రాని వసంతం కోసం ఎదురుచూస్తూ క్షణం క్షణం చావకుండా ఉండేందుకు.’ అంటూ నిర్వేదన చెందుతారు సన్నపురెడ్డి. అందుకే ‘సన్నపురెడ్డి ఈ కాలం మహారచయిత’ అంటారు దివంగత ప్రముఖరచయిత సింగమనేని నారాయణ.
గ్రామీణ జీవుల జీవనయాణయే సన్నపురెడ్డి రచనలు. అవి కథలైనా, నవలలైనా. ఆయన పల్లె ప్రేమికుడు, అక్కడి జనం ప్రేమికుడు, అంతేనా! చెట్టూ,చేమా ప్రేమికుడు, వాగూ, వంకా ప్రేమికుడు, పశు పక్షాదుల ప్రేమికుడుకూడా. టోటల్‌గా ప్రకృతి ప్రేమికుడు. తన పల్లెలోని రెడ్లు, వైశ్యులు, గొల్లలు, మాలలు, మాదిగలు, ముత్రాసులతో కలిసి జీవిస్తారు.
చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగముంటేనే ఆధునిక సౌకర్యాలకోసం పట్టణాలకు ఎగబాకే కాలమిది. సన్నపురెడ్డి ఉపాధ్యాయుడైనా ఆయన ఆ దారిని తోసిరాజాడు. కాంక్రీట్ జంగిల్లో బ్రతుకు దారిపట్ల విముఖత చూపారు.
పదవీ విరమణ వయస్సు వచ్చినా ఇప్పటికీ తూర్పున నల్లమల కొండలకు దగ్గరగా ఉన్న బాలరాజుపల్లెను, తన ఇంటిని విడనాడలేదు. తల్లిదండ్రుల జ్ఞాపకాలు చెదరనివ్వలేదు. సిద్దోళ్లకుంట, మాలిండ్లు, సరప్పచేల పొలాలు, బావి, చింతచెట్టు, మర్రిచెట్టు గురుతులు ఎప్పటికీ చెరిగేవికాదు. తనమనస్సుతో సన్నపురెడ్డి నిత్యం వాటితో మాటకలుపుతూనే ఉంటారు. సగిలేరు, జ్యోతివాగు, ఉప్పువాగు నీటి గలగలలను ఆయన కర్ణభేరీలు ఇప్పటికీ ఆస్వాదిస్తూనే ఉన్నాయి. ఇంటిలో మునగచెట్టు, ఇంటిముందు వెలగచెట్టు ఊసులు ఒకటా రెండా కోటానుకోట్లు. ఊరివాళ్ళే కాదు ఇంట్లో భార్యా,బిడ్డలకంటే ఆయన వాటితోనే ఎక్కువగా ఊసులాడుతుంటారు. ఇంటిముంగిట అరుగుమీద పులిజీతాన్ని( పులి, మేక ఆట) ఆయన వదలదలుచుకోలేదు. తనఅస్థిత్వం పల్లె గురుతులేవీ మరుగు పడనివ్వదలుచుకోలేదు. సన్నపురెడ్డికి అవే ఊపిరి. భౌతికంగా ఎక్కడున్నా మనస్సును బాలరాజుపల్లెలో కట్టిపడేశారు. పల్లె మనుషులు, మనసుల మర్లులో ఆయన జీవనయానం సాగిస్తున్నారు.
మార్చినెల 31న ఉపాధ్యాయుడిగా సన్నపురెడ్డి పదవీ విరమణ చేస్తారు. ఆ తర్వాత ఆయన రచనా వ్యాసంగంలో వేగం పెంచుతారు. ఇప్పటికే కొన్ని చారిత్రక నవలల రచనలు ముగింపు దశకు తెచ్చినట్లు నాకు తెలుసు. విశ్రాంత ఉద్యోగిగా ఆయన మరిన్ని రచనలు సాగించాల్సి ఉంది. ఇది సమాజానికి తప్పనిసరి. నామటుకు నాకు ఆయన విషయంలో ఒక వెళితి ఉండి పోయింది. సన్నపురెడ్డికి కేంద్రసాహిత్య అకాడమీ వస్తుందనీ ఎదురు చేశాను. వాస్తవానికి అది ఎప్పుడో రావాల్సింది. కానీ ఆలస్యం కావడం బాధించే అంశం. సాహిత్య అకాడమీ అవార్డుల్లోకూడా రాజకీయాలు చోటు చేసుకున్నాయని కొంతకాలంగా ఆరోపణలు, వాదనలూ వినిపిస్తున్నాయి. అది నిజమైతే చాలా దురదృష్టకరం. ఆ నీలి నీడలు త్వరగా తొలగిపోవాలి. త్వరలోనే సన్నపురెడ్డిలాంటి రచయితకు ఆ అవార్డు వస్తుందని నమ్మకం పెట్టుకొని ఉన్నాను. నేనే కాదు సాహిత్యాభిమానులందరూ ఆ గడియల కోసం ఎదురు చూస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఆయన ఆయురారోగ్యాలతో ఉండి కుటుంబంతో సంతోషంగా గడపటంతోపాటు మరిన్ని రచనలు చేయాలని, సాహితీ ప్రపంచాన్ని మరింతగా అలరించాలనీ కోరుకుంటూ.....
- బిజివేముల రమణారెడ్డి
జర్నలిస్ట్, రచయిత