Telugu Global
Arts & Literature

భావన: ప్రకృతి -పురుషుల నుంచి నేర్చుకొవాలి

భావన: ప్రకృతి -పురుషుల నుంచి నేర్చుకొవాలి
X

ఈ సృష్టి యావత్తూ మనిషికి ఒక పాఠశాల. ఈ ప్రకృతిలోని ప్రతీచెట్టూ, ప్రతీ జీవీ…ఏదైనా తన సహజ జీవన విధానంతోనే మనిషికెన్నెన్నో విషయాలను బోధిస్తుంటాయి.

ఐకమత్యం, ప్రేమ, త్యాగం వంటి సుగుణాలన్నీ మనిషి ప్రకృతినుంచే నేర్చుకోవాలి.

మనిషి ప్రకృతిలోని అందాలనాస్వాదించడమే కాదు…! వాటిని అధ్యయనం చేయాలి. ఆ ప్రకృతి ధర్మాలను ఆచరణలోకి తెచ్చుకోవాలి.

పచ్చని ఆకులతో కళకళలాడే వృక్షం శిశిరంలో తన ఆకులను రాలుస్తుంది. వేసవిలో ఎండి మోడైపోతుంది. వసంతకాలం రాగానే ప్రతి కొమ్మా చిగురిస్తుంది.

జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దనీ, మంచిరోజు తప్పక వస్తుందనీ మానవాళికి సందేశమిస్తుంది.

అంతేకాదు… !

వృక్షం తానెంత ఎత్తుకెదిగినా ఉన్నచోటునే ఉంటూ అందరికీ ఆశ్రయమిస్తుంది. తన పళ్లను అందరికీ ఇచ్చి అలసిన జీవులను తన కొమ్మల నీడల్లో సేదతీరుస్తుంది.

పరోపకారం, త్యాగగుణం కలిగి ఎన్నో జీవిత సత్యాలను బోధిస్తుంది వృక్షం. ఆ సత్యాలు మనిషి గ్రహించి వాటిని తన జీవితానికి అన్వయించుకోవాలి.

ఎల్లలేలేని అనంత జలరాశి సాగరం. ఎన్నెన్నో ఆటుపోట్లను తట్టుకుంటూ చూపరులకు ప్రశాంతంగా కనిపిస్తుంది. విశ్రమించని అలలు పట్టుదలతో ఒడ్డును తాకి సంకల్పబలం ఎంత గొప్పదో లోకానికి చాటిచెబుతాయి. అలాంటి స్థితప్రజ్ఞతను, సంకల్పబలాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి.

రామాయణం, భారతం, భాగవతం... మన సంస్కృతిని కథల రూపంలో వివరించే ఉత్తమ గ్రంథాలు. జ్ఞానాన్ని, స్ఫూర్తిని కలిగించే ఆ గ్రంథాలను ప్రతి మనిషీ అధ్యయనం చేసి వాటిలోని ధర్మాలనాచరించాలి.

రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఆయన పావన చరిత్ర కోట్లమందికి ప్రేరణనిచ్చింది. కుమారుడిగా, సోదరుడిగా, భర్తగా... ఆదర్శవంతమైన జీవితం గడిపినందుకే రాముడు ఆదర్శపురుషుడిగా పూజనీయుడయ్యాడు. ఎవరైనా, ఎప్పుడైనా దీనుడై రక్షించమని కోరితే అతడికి శరణిచ్చి రక్షించడమే తన వ్రతమంటాడు రాముడు. ప్రతి మనిషీ ఇలాంటి ఉత్తమ లక్షణాలను పొదివి పట్టుకుంటే ఎల్లెడలా శాంతి పరిఢవిల్లుతుంది. రామాయణ పారాయణం చేయడం, రామభజన చేయడం కాదు. (చేయవద్దని చెప్పడంలేదు. ప్రవర్తనలో గుణాత్మకమైన మార్పును తెచ్చుకోవాలని నొక్కి వక్కాణిస్తున్నాను) రాముడిలా మర్యాదా పురుషోత్తములం కావాలి.

నిఖార్సైన భక్తికి నిలువెత్తు ప్రతీక ఆంజనేయుడు. ఆయన సంకల్పానికి సజీవ రూపం, శక్తిసామర్థ్యాలకు నిలువెత్తు సాక్ష్యం. ఈశ్వరాంశతో జన్మించిన ఆంజనేయుడు మహావీరుడు. ఐనప్పటికీ సూర్యుడి వద్దకు వెళ్ళి విద్య నేర్పమని వినయంగా అర్థించాడు. ఏకాగ్రతతో విద్యను అభ్యసించి విద్యార్థి లోకానికే ఆదర్శప్రాయుడయ్యాడు.

అడ్డంకులెన్నెన్ని ఎదురైనా తలపెట్టిన కార్యాన్నెలా సాధించాలో చేసి చూపించాడు. ఉత్తమ భక్తుడిగా, ఉత్తమ సేవకుడిగా ముల్లోకాల్లోనూ నిలిచిపోయిన ఆంజనేయుడు అందరికీ చిరస్మరణీయుడు.

ఆయన ఆచరించిన సేవాధర్మాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. వారే అసలైన ఆంజనేయ భక్తులు.

’కృష్ణస్తు భగవాన్‌ స్వయం’ అని భాగవతం బోధించింది. బృందావనంలో ఆటపాటల్లో మునిగి ఉన్నప్పుడు, కురుక్షేత్రంలో రణరంగం మధ్యలో ఉన్నా, చూస్తుండగానే యదువంశం నాశనం అయిపోతున్నా… అపూర్వమైన ప్రశాంతతను, నిశ్చలత్వాన్ని ప్రదర్శించాడు శ్రీకృష్ణుడు. అలాంటి నిశ్చలత్వాన్ని ప్రతి ఒక్కరూ సాధించాలి.

అనుగ్రహం కోసం భగవంతుణ్ణి ఆరాధించడం, జ్ఞానం, ధర్మం తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం మాత్రమే కాదు… భగవంతుడు మెచ్చే మంచి లక్షణాలను అలవరచుకోవాలి.

ధర్మాన్ని అవగాహన చేసుకుని, ధర్మంగా నడిచే ప్రయత్నం చేయాలి. వారిని మాత్రమే భగవంతుడు తన నిజమైన భక్తులని భావిస్తాడు. వాళ్లకు మాత్రమే సత్ఫలితాలను ఇస్తాడు. నాటకాలరాయుళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అనుగ్రహం కలగదు.

-ఎస్.లక్ష్మీనారాయణ మూర్తి

First Published:  13 July 2023 4:22 PM IST
Next Story