Telugu Global
Arts & Literature

భావన: అనుభవ జ్ఞానం

భావన: అనుభవ జ్ఞానం
X

మంచి-చెడు నడుమ తేడా తెలుసుకొనే శక్తి వివేకం. ప్రతి ప్రాణికీ పుట్టుకతోనే ఈ శక్తి వస్తుంది. గడ్డి తిని బతికే జంతువులు మాంసాహారాన్ని ముట్టవు. అలాగే మాంసాహారాన్ని తినే జంతువులు శాకాహారాన్ని ఇష్టపడవు. దేన్నైనా ఇష్టపడే కాకులు వంటివీ లోకంలో ఉంటాయి.

మనుషులకు వివేకం ముఖ్యం. అవివేకులు ఎందుకూ కొరగారు. అనుభవం వల్ల వివేకం కలుగుతుంది. ఒక బాటసారికి బాగా దప్పిక వేసింది. చుట్టూ చూశాడు. దగ్గరలోనే మహా సముద్రం కనిపించింది. దోసిటితో నీళ్లు తీసుకొని గటగటా తాగబోయాడు. ఉప్పగా ఉండి మింగుడుపడలేదు. 'ఈ సముద్రంలో నీరు ఎంత ఉన్నా తాగడానికి పనికి రాదు' అని గ్రహించాడు. మరికొంత దూరంలో ఒక చిన్న వాగు కనిపించింది. బాటసారి వాగులో నీరు తాగాడు. దప్పిక తీరింది. అతడి అనుభవం వివేకాన్ని పెంచింది.

సముద్రంలో నీరు తాగడానికి పనికి రానట్లే కొందరి సంపదను చూసి అని గ్రహించాడు. సామాన్యుల సాయమే మేలు అని తెలుసుకున్నాడు. అనుభవం వల్ల కలిగిన వివేక జ్ఞానం బాగా వ్యాప్తి చెందుతుంది.

ఒక పేద బాలుడికి జిజ్ఞాస ఎక్కువ. ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచిస్తేగానీ అతడికి నిద్రపట్టదు. గోడపై వేలాడే శివుడి బొమ్మకు దండం పెట్టినప్పుడల్లా అతడి చూపు తప్పనిసరిగా దేవుడి గొంతుపై ఉన్న నల్లని మచ్చపై పడేది. ఒకరోజు రాత్రి అతడు ఎదురుగా గూటిలో వెలుగుతున్న ఆముదపు దీపం వైపు చూశాడు. దాని వత్తి నల్లగా కావడంలేదు. నూనె కూడా నల్లగా మారడంలేదు. కానీ, దీపంచుట్టూ మాత్రం నల్లటి మసి పడుతోంది! వివేకి అయిన అతడికి ఇలా అనిపించింది.

"ఈ దీపం తాను కాలిపోతూ లోకానికి వెలుగునిస్తోంది. ఈ క్రమంలో వెలువడిన నల్లటి పొగను మాత్రం తన కించే పెట్టుకొంది... కనుక దీపం దైవ స్వరూపమే!" అని బాలుడు దీపానికి నమస్కరించాడు.

కొడుకులు పుట్టలేదని కొందరు ఏడుస్తుంటారు. వాళ్లు నిస్సందేహంగా అవివేకులు. కౌరవేంద్రుడైన ధృతరాష్ట్రుడికి నూరుగురు సంతానం. అయితే, దృతరాష్ట్రుడు చనిపోయినప్పుడు ఆయనకు కర్మకాండలు చేయడానికి ఒక్కరూ మిగిలి లేరు! అసలు సంతానమే లేని శుకమహర్షికి ఏ నష్టమూ కలగలేదు' అని దూర్జటి మహాకవి శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో స్పష్టం చేశాడు.

ఒక వస్తువు విలువ తెలుసుకోవాలంటే, ముందుగా దాని గురించి పరిజ్ఞానం అవసరం. గాడిదకు గంధపు చెట్టు గురించి ఏమీ ఎరుక లేకపోవడం వల్ల దాని

విలువ తెలియకుండా ప్రవర్తిస్తుంది.ఒక వస్తువును ఉపయోగించే నేర్పుగలవారికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది.

ఒకసారి కశ్మీర్ రాజు వద్దకు అత్తరు వ్యాపారి ఒకడు దర్శనార్ధం వెళ్ళాడు. తన సంచిలోని మంచి మంచి అత్తరు సీసాలను ఏరి తీసి రాజుగారి ముందు పెట్టాడు. ఒకదాని మూత తీసి రాజుగారి చేతికి అందించాడు. సభాస్థలి అంతటా గుప్పుమని సువాసనలు నిండాయి. రాజుగారు, దాన్ని తన చేతిలో పోసుకుని కొంచెం రుచి చూశాడు, 'చీ చీ... ఇంత చేదుగా ఉందేమిటీ అని సీసాను విసిరిపారేశాడు.

ఏది ఎందుకు ఉపయుక్తమో గ్రహించగలగడం ,అనుభవ జ్ఞానాన్ని సదుపయోగం చేసుకుని జన్మ సార్థక్యం చేసుకోవడం వివేకవంతుల లక్షణం

-డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు

First Published:  1 March 2023 12:48 PM IST
Next Story