Telugu Global
Arts & Literature

జీవనసాపేక్షం (కథ)

జీవనసాపేక్షం (కథ)
X

" వీరలక్ష్మి ఎలా ఉందో! పెళ్ళి చేసుకుని ఉండదు. అదృష్టవంతురాలు." మనసులో అనుకున్నాననుకుని పైకే అనేసాను.

"వీరలక్ష్మి ఎవరమ్మా! " పాప ప్రశ్నకు నాతోపాటు టెన్త్ క్లాస్ చదివిన బెంచ్ మేట్."

నా జవాబు.

"ఆమె పెళ్ళే చేసుకోదని ఎందుకనిపించింది? ఈయన ప్రశ్న.

"స్కూల్ లో చదివే రోజుల్లోనే ఆమె కుడిచేతికి 'బోద' ఉండేది. చిన్నప్పుడు ఆ విషయం పట్టించుకోలేని పసితనం.

ఇప్పుడు అప్పుడప్పుడూ గుర్తుకు వస్తూ ఎక్కడుందో.... అని.... "

"అయ్యో! 'బోదకాలు' లాగా 'బోదచెయ్యి'

ఎంతబాధాకరం.ఎవరోఒకరు చేసుకునే ఉంటారులే!"....ఈయన మాట పూర్తి కాలా.

"పెళ్ళేంపెళ్ళి. వెధవపెళ్ళి. వెధవమెుగుడు వెధవసంసారం ...వెధవలంపటం. వండాపెట్టా. ఇదేగా... పెళ్ళి కానివాళ్ళు ఎంత అదృష్టవంతులో... " విసురుగా నేనన్నమాటలకు ఈయన చిన్నబుచ్చుకొని

"ఈమాట చాలాసార్లు అన్నావ్. సంసారమంటే అంతచేదుగాఉందా?" అంటూ పేపర్లో తలదూర్చారు.

"ఎన్ననుకున్నాతప్పదుగా!"అంటూ వంటగదికేసి విసుగ్గా విసవిసా వెళ్ళాను.

వెడుతూవెడుతూ "జీవితంమీదే విరక్తి పుడుతోంది...ఛీ"అన్నాను.

ఫోన్ మ్రోగుతోంది. ఆయనే తీసి ఏదో మాట్లాడారు.

"భానూ! మీ టెంత్ బ్యాచ్ వాళ్ళు ట.

గెట్ టు గెదర్ ట. ఈనెలలోనేట. కారు తీసుకుని వెడితే వెళ్ళిరా! "

స్కూల్ ఆవరణలో కారు దిగేసరికి ఎన్నో కళ్ళు ,ఎన్నో భావాలతో నన్ను పలుకరించాయ్.

కొన్ని ఈర్ష్యతో, కొన్నిప్రశ్నలతో ఇంకొన్ని భావరహితంగా.....

పూర్ణ ఎదురొచ్చి లోపలికి తీసుకెడుతూ "భానూ! వచ్చేసావా!? కారు సొంతమేగా? నీకేమోయ్ బాగాచదువుకున్నావ్! నేనేమో

టెంట్ తో ఆపేసి బావమీద వ్యామోహంతో

పెళ్ళిచేసేసుకున్నాను. అందుకేనేమో నా పిల్లలను బాగా చదివించా " నిట్టూర్పులు.

హిమ " భానూ! బాగున్నావా!? నీకేం సూపర్. అప్పట్లో నేను చదువుకుంటానని గీ పెట్టినా నన్ను చదివించలా... ప్చ్... ఇంటిపనీ వంటపనీ... "

ఇలా ఫ్రెండ్స్ లో చాలా మంది చదువులు లేకుండానే పదిలోనే పెళ్ళిళ్ళయిపోయాయ్.

మెుదటిసారిగా నన్ను ఇంత చదివించిన అమ్మా నాన్నలకు మనసులోనే కృతఙ్ఞతలు చెప్పా.

"వీరలక్ష్మీ బాగున్నావా?!నువ్వు చాలా సార్లు గుర్తుకువచ్చావ్! "

"ఏం బాగూ! చదవటమైతే చదివాను.ఈ జిల్లాకే డిప్యూటీ కలెక్టర్ ని. ప్చ్ ఏంలాభం

తెలుసుగా! నాచెయ్యి 'బోద'. పెళ్ళీ పెటాకులూ లేవు. అక్కాపిల్లలూ నాదగ్గరే ఉంటున్నారు. బావకి ఇద్దరు పెళ్ళాలు.

అటూఇటూ తిరుగుతూ ఉంటాడు. నాకు వాళ్ళూ, వాళ్ళకునేనూ... "

"మరిఅక్కబావ నీతో బాగుంటారా?బావ నీతో అడ్వాన్టేజ్ తీసుకోలేదుగా సంతోషించు. నువ్వు కలెక్టర్ హోదాలో సూపర్ "

"ఏం సూపర్!?అక్కకు బావమీద కోపం

వచ్చినప్పుడల్లా, డబ్బుకావాల్సినప్పుడల్లా, కోపం నా మీదచూపించి, డబ్బులు ఇస్తే చల్లబడుతుంది. నాకూసంసారం ఉంటే... ప్చ్... అదృష్టం లేదు. " కన్నీళ్ళు పెట్టుకుంది.

"విజయా! నిన్నుచూసి చాలా రోజులయింది

వీరపత్నివీ! వీరమాతవీట కదా?!భర్తనీ, కొడుకునీ కూడా దేశానికి బహుమానం గా ఇచ్చావ్... "

"ప్చ్... ఏం ఒరిగిందనీ? అవార్డ్ లూ పతకాలూ తప్ప.... బైటికి పొంగిపోతాం..

లోపల అభద్రతభావం.... సరిహద్దు దేశాలూ, నా భర్తశవాన్ని నాకే బహుమతిగా పంపాయి. ప్రభుత్వం వీరమరణం పొందాడని ....సైనిక వందనంతో గంధపు చెక్కలతో కాల్చిన బూడిదతో పాటు, ఆయన సైనిక డ్రస్ నా చేతిలో పెట్టింది.

"ఈగౌరవం అంతా చూసి నాకొడుకూ సైన్యంబాట పట్టాడు. వాడు బహుమానం గా శవాన్నే తెస్తాడో, దేశగౌరవాన్నే తెస్తాడో చూడాలి."

"ఇక నా కూతురు.... స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్స్ మీద మెడల్స్ కొడుతోంది.వయసువచ్చిందిఇకఆపి పెళ్ళి చేసుకోమన్నాను. కానీ ఒలింపిక్స్ లో ఏదో ఓ మెడల్ దేశానికి కానుకగా తీసుకువచ్చాకే పెళ్ళి అంటోంది. "

"మంచిదేగా! మీకుటుంబాన్ని చూసి దేశంగర్వపడుతుందిగా "

"మరినేనూ! ఏకాకిగా బ్రతకాలా? అదికూడా నీలాగా చదువుకుని, చక్కగా పెళ్ళి చేసుకుని,ఒద్దికగా ఉంటే ఎంతచక్కగా ఉంటుంది. "

ఐన్ స్టీన్ సాపేక్షసిద్ధాంతం గుర్తుకు వచ్చింది

సాపేక్షం అంటే పోలిక. ఒకదాన్ని మరొకదానితో పోలిక.

అన్నీ, అంతా సాపేక్షమే. ఎంత చిన్న విషయమైనా పెద్దవిషయమైనా, దేన్నీ మరొకదాని ప్రసక్తి లేకుండా, మరొక దానితో పోల్చకుండా చెప్పటానికి వీలులేదు. విశ్వంలో సాపేక్షం కానిది అంటే...మరో దానితో పోల్చబడనిది ఏదీలేదు .ఉంటే గింటే విశ్వానికి అవతలే.ఈ ప్రమేయమే అన్నిటిలోనూ హెచ్చుతగ్గులుచూపించే కొలమానం. దానికి చాలా ఉదాహరణలు ఇచ్చాడు,ఐన్ స్టీన్.

కానీ ఇక్కడ బోలెడు చూసాను.

చక్కని సంసారం ఉన్న నేను గొప్పదాన్నా?

చదువుకోకుండా పెళ్లి చేసుకుని ఇంటికి అంకితమైన వీళ్ళు గొప్పవాళ్ళా?

అంగవైకల్యాన్ని సైతం ఎదిరించి, డిప్యూటీ కలెక్టర్ కాబోయే కలెక్టర్ హోదాలో కూడా, పెళ్ళి కాలేదనే.... అసంతృప్తి తో రగులుతున్న వీరలక్ష్మి మాత్రం ఎవరికి ఆదర్శం?

మరి ఈ వీరపత్ని, వీరమాత సంగతేంటి?

ఎవరిజీవితం వాళ్ళకి వెగటుగా, పక్కవాళ్ళ జీవితం దేవుడిచ్చిన బహుమతిగా కనబడుతోంది.

నిజానికి ఎవరి పరిస్థితులకు తగ్గట్టు ఎవరిజీవితం వారికి వరం గానే ఉంది.

అందరూ సేఫ్ జోన్లలోనే ఉన్నారు.

ఇక....మా టెన్త్ ఫ్రెండ్స్ లో బాగా చదువుకుని మంచి పొజిషన్ కు వచ్చిన కొందరికి సన్మానాలు జరిగినాయ్. రచయిత్రిగా నాకూ సన్మానం చేసి బహుమతి ఇచ్చారు....

దానికన్నా....

నేను ఇక్కడికి రాకపోతే చాలా జీవితసత్యాలను మిస్సయ్యేదాన్నేమో!?

అనేంత కానుక పొందాను.

ఇంటికితిరిగి వచ్చిన నాకు శ్రీవారు ఎదురై

"మీ బ్యాచ్ వాళ్ళు నీకేం బహుమతి ఇచ్చి సత్కరించారోయ్" అడిగారు నవ్వుతూ.

నేను గభాలున కౌగిలించి "మిమ్మల్ని నాకు బహుమతి గా ఇచ్చారు " అన్నాను.

నాకు తెలుసు! నేనేమన్నానో ఆయనకు అర్ధం కాలేదని!.....

- భాగవతుల భారతి

First Published:  17 Oct 2023 10:16 PM IST
Next Story