Telugu Global
Arts & Literature

బారుబలి

బారుబలి
X

"బారూ, బారూ! ఈ రోజు ఆఫీసు నుంచి కొంచెం ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటంటే ??? " భార్యకి చెప్పబోయేడు మిత్రులంతా ముద్దుగా 'బ్రాందీ' అని పిలుచుకునే బ్రాంతావఝ్ఝల దీపక్ మూర్తి.

"ఛీ, నన్ను 'బారు' అని పిలవొద్దని ఎన్ని సార్లు చెప్పాలి. నాకు ఆ పేరంటేనే అసహ్యం. నా పేరు 'బాల రుక్మిణి'. వీలైతే బాల, లేకపోతే రుక్మిణీ అని పిలవండి. అంతే కానీ 'బారు' అని పిలవొద్దు. నాకు తెలుసు, మీరు ఆఫీసు అయిన తర్వాత ఆ అజంతా 'బారు'కి వెళ్లి వచ్చారని" బ్రాందీని పట్టుకొని కడిగేసింది 'బారు'.

"అది కాదు 'బారూ'! మా ఆఫీసు పక్కనే 'బారు' ఉన్న మాట నిజమే. కానీ, నాకు తాగుడు అలవాటు లేదని నీకు చాలా సార్లు చెప్పాను. ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చిన ప్రతీసారీ నేనేదో 'బారు'కి వెళ్లి వచ్చినట్టుగా ఇలా డ్రగ్ ఎంక్వయిరీ చేయడం భావ్యమా ? అసలు సాయంత్రం ఆ 'బారు' దగ్గ ..." బుర్ర వంచుకొని చెప్పబోయేడు మూర్తి.

"ఛస్...ఆలస్యంగా వచ్చినప్పుడు ప్రతీసారీ చెప్పే ఇలాంటి కథలు నాకు కాదు తెలుగు టీవీ సీరియల్ నిర్మాతలకు చెప్పండి. పాపం, వాళ్లు కథలు దొరక్క ఉన్న కథనే జీళ్లపాకంలా సాగదీస్తున్నారుట. అయినా, గుమ్మంలో నిలబడి ఏమిటా నేల'బారు' చూపులు. లోపలికి తగలడి, టేబుల్ మీద మీ పిండం ఉంది పెట్టుకొని తినండి, అదే ,..మీకోసం ఉప్పుడు పిండి ఉంది పెట్టుకుని తినండి. నేను పడుకుంటున్నా !!" బ్రాందీని ఉతికేసి, బెడ్ రూమ్ లోకి వెళ్లిన 'బారు', తలుపులు మూసేసింది.

* * * *

"బారూ, 'బారూ' ! అసలు నిన్న రాత్రి 'బారు' దగ్గర ....." పొద్దున్నే లేచి పేపరు చదువుకుంటున్న తన వద్దకు, కాఫీతో వచ్చిన భార్యామణికి ఎంతో ఉత్సాహంగా చెప్పబోయేడు మూర్తి.

"ఛత్, మళ్లీ పొద్దున్నే మొదలెట్టారా ! ఆ దిక్కుమాలిన 'బారు' అనే పేరు అంటేనే నాకు ఎలర్జీ అని ఎన్ని సార్లు చెప్పాలి ? సరేగానీ, ఈ రోజు పనిమనుషి రాదుట. కింద సూపర్ బజార్ కి వెళ్లి రెండు విమ్ 'బారు' సబ్బులు తెచ్చుకోండి, గిన్నెలు తోముదురు గాని" వెర్రిచూపులు చూస్తున్న బ్రాందీని పట్టించుకోకుండా 'బారు' జడను తిప్పుకుంటూ లోపలకి పోయింది 'బారు'.

* * * *

"బారూ!..... సారీ బాలా! అసలు నిన్న రాత్రి 'బారు' దగ్గర ఏం ..." మళ్లీ చెప్పబోయేడు మూర్తి, టిఫిన్ తినడానికి టేబుల్ వద్ద కూర్చుంటూ.

"చూడండి, నాకేమీ చెప్పనక్కర్లేదు. ఒకవేళ మీరు చెప్పినా అది నేను నమ్మను. ఎందుకంటే నమ్మడానికి మీరు కేవలం బ్రాందీ గారే కానీ గాంధీ గారు కాదని గుర్తుపెట్టుకోండి. అది సరేగానీ, ఈ సేవ సెంటర్ లో ఆధార్ కార్డులు ఇస్తున్నారుట. ఇప్పటికే జనం 'బారు'లు తీరి ఉన్నారుట. ఈ రోజైనా వెళ్లి తెచ్చుకుని చావండి " బ్రాందీని పట్టుకుని వాయించేసింది 'బారు'.

* * * *

"బా....! సారీ , బా...., అసలు నిన్న రాత్రి 'బారు' దగ్గర ఏం జరిగిం..." ప్రసన్నంగా ఉన్న 'బారు' మొహం చూసి, మళ్లీ చెప్పబోయేడు మూర్తి, ఈ సేవ కేంద్రం నుంచి వచ్చి, అన్నం తినడానికి టేబుల్ వద్ద కూర్చుంటూ.

"నా మనసేం బాగాలేదు. కేవలం ‌సాం'బారు' ఒకటే పెట్టాను. కిక్కురు మనకుండా తిని పండుగ చేసుకోండి" రుసరుసలాడుతూ విసవిసా నడుచుకుంటూ వెళ్లి పోయింది 'బారు'.

* * * *

"బారూ, బా.... ! అసలు నిన్న రాత్రి 'బారు' వద్ద ఏం జరిగిందంటే ??" సాయంత్రం టీవీ చూస్తున్న తన వద్దకు, టీ కప్పుతో వచ్చిన భార్యామణికి ఆఖరి ప్రయత్నగా చెప్పబోయేడు మూర్తి.

"ఈరోజు మా అన్నయ్యకి, ఆయన దగ్గర జూనియర్లుగా పనిచేసిన అడ్వకేట్లందరూ కలిసి , కోర్టు లోని 'బారు' అ‌సోసియేషన్ హాలులో సన్మానం చేస్తున్నారుట. వెళ్లి చూసి సిగ్గు తెచ్చుకోండి" దురుసుగా చెప్పింది.

"అదేమిటి ? మరి సిగ్గు తెచ్చుకోవడానికి నువ్వు రావా ?? సారీ, అదే..... సన్మానం చూడడానికి నువ్వు రావా ??" తడబడుతూ అడిగాడు మూర్తి.

"సర్లెండి, మీతో రావడం కన్నా, క్రో'బారు' తో తల గోక్కోవడం బెటర్" ఏమాత్రం తగ్గని కోపంతో నేలను బలంగా తన్ని సీన్ లోంచి నిష్కమించింది 'బారు'.

* * * *

"బారు వాళ్ల అన్నయ్యకు 'బారు'లో ‌సన్మానం అయితే, దానికి 'బారు' రాకుండా నేనొక్కడినే ఎందుకు వెళ్తాను ? నా మాట 'బారు' విననప్పుడు, 'బారు' మాట నేనెందుకు వినాలి ? అరె, అసలు నే చెప్పేది కొంచెం విని తగలడాలి కదా ? అసలు ఏమీ వినకుండా, 'బారు'లో మందు కొట్టినట్టు అలా మీద పడి కరిచేస్తే ఎలా ? ‌

సినిమాల్లోనూ, తెలుగు టీవీ సీరియల్లులోనూ ఇలాంటివి చూస్తాం...... హీరో 'అసలేంజరిగిందంటే ?' అని చెప్పబోతాడు. నిజంగా ఓ రెండు నిమిషాలు హీరో చెప్పేది ఏమిటో, ఆ హీరోయిన్ వింటే కథ అక్కడతో అయిపోతుంది. కానీ, సినిమా వాళ్లైతే ఓ గంట, టీవీ వాళ్లైతే ఓ ‌సంవత్సరం పాటు సాగదీయడం కోసం ఓ సీన్ క్రియేట్ చేసి, హీరోయిన్ చేత 'మీరేం చెప్పనక్కరలేదు. నాకంతా తెలుసు' అని చెప్పించి కథను పొడిగించుకుంటూ పోతారు. కానీ ఇది జీవితం.


అసలు తను చెప్పదలచుకొన్నది ఏమిటి ?.....

"బారూ', 'బారూ' ! అసలు నిన్న రాత్రి 'బారు' దగ్గర ఏం జరిగిందంటే....., ఆఫీసు నుంచి వస్తూంటే, 'బారు' వద్ద నాకు ఓ వంద రూపాయల నోట్ల కట్ట దొరికింది. పాపం, పోగొట్టుకున్న వాళ్లు ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేద్దాం అని ఓ గంట సేపు ఎదురు చూసాను. ఎవరూ రాలేదు. అందుకే ఇంటికి రావడం ఆలశ్యం అయ్యింది.

ఆ 'బారు' వద్ద దొరికిన పదివేలుతో నువ్వు మల'బారు' గోల్డు షాపు కెళ్లి ఏదైనా కొనుక్కో అని చెబుదామనుకుంటే........,

అసలువిని చావదే. పైపెచ్చు నేను 'బారు' అనే మాట వాడకూడదుట . ఆ మాటంటే తనకు ఎలర్జీ అట.

తను మటుకు నేల'బారు', విమ్ 'బారు', ‌సాం'బారు', క్రో'బారు' అంటూ బోల్డు సార్లు బోల్డు 'బారు'లు మాట్లొడొచ్చా ?

కాబట్టి, ఆ పదివేలు ఇలాంటి చౌక 'బారు' మనస్తత్వం ఉన్న 'బారు'కు ఇవ్వడం కన్నా, కష్టాల్లో ఉన్న తన స్నేహితుడు 'బారు' గాడుకి అదే బాలాంత్రపు రుక్మాంగధరావు గాడికి ఇస్తే కొంచెం పుణ్యమైనా వస్తుంది"

...అని మనసులో అనుకుంటూ, కోపంగా భార్య 'బారు' వైపు చూసి, బావగారి 'బారు' వైపు కాకుండా , మిత్రుడు 'బారు గాడి ఇంటి వైపు కదిలాడు బ్రాందీమూర్తి.

- బుద్ధవరపు కామేశ్వరరావు

హైదరాబాద్

First Published:  4 Dec 2022 8:19 PM IST
Next Story