Telugu Global
Arts & Literature

నది - నేను

నది - నేను
X

నాలోంచి ప్రవహిస్తున్న

ఒకానొక నది గురించి ప్రస్తావించాలి. నన్ను నిండా ముంచెత్తిన నీరులేని నది గురించే చెప్పాలి.

రాత్రివేళ కొండమీదకు వినిపించే నీటి గలగలల్లోంచి

నా మట్టితో శృంగారం జరపలేని నది గురించే దుఃఖరాగం వినిపించాలి

ఎక్కడో కురిసిన నీటితో నదిని నిలువరించడానికి గొంతెండిపోయేదాకా గొంతెత్తి పిలవాలి

నదీ దేహం మీద తేలే ఇసుకదిబ్బల్లోంచి దోసెడునీళ్లను ఒడిసిపట్టలేక

దాహగాయాలతో చలమలవుతున్న కళ్ళల్లోంచి స్రవిస్తోన్న కన్నీటి గురించే మాట్లాడాలి.

గొంతు తడుపుకోడానికివ్వకుండా సముద్రానికి పరుగులెత్తే నది గురించే విలపించాలి.

నీరు ఎప్పుడూ రాజకీయమే వాటాలకందని మాటల యుద్ధంలో

చాపకింద ప్రవాహంలా కనబడకుండా వెళ్లిపోయే

నది పక్కనే నడుస్తోన్న జీవితాన్ని ఎప్పటికీ తడపలేని నది గురించే నాలుగు వాక్యాలు రాయాలి

నది నదిగానే ఉరకలెత్తుతోంది. నదిలో నీటి సంబంధం లేని నేను తనతోపాటే సముద్రంలో కలిసిపోతున్నాను.

-బండ్ల మాధవరావు

First Published:  26 Sept 2023 5:36 PM IST
Next Story