Telugu Global
Arts & Literature

ప్రాప్తాప్రాప్తాలు (కథ)

ప్రాప్తాప్రాప్తాలు (కథ)
X

గంట నుంచీ చెప్పిన మాటే చెబుతున్నాడు ముకుందం. రాఘవరావు దంపతులు నోరు విప్పకపోయినా తన ధోరణిలో తను ఒకటే వల్లిస్తున్నాడు. తనూ తన పెళ్లాం గౌతమినే కోడల్ని చేసుకోవాలని కలలు గంటున్నారట. కాని కొడుకు ససేమిరా అంటున్నాడు. తను ప్రేమించిన అంజలినే చేసుకుంటానని పట్టుబడుతున్నాడు.

‘‘నన్నేం చెయ్యమంటావు బావా...మేం ఎందుకూ పనికిరానివాళ్లమైపోయాం. మీకసలు మొహం చూపించాలంటేనే సిగ్గుతో ప్రాణం పోతోంది’’ అంటున్నాడు ముకుందం.రెండు చేతులతోనూ తల బాదుకుంటున్నాడు.

ముకుందం వచ్చిన దగ్గర్నించీ లోపలే ఉంది గౌతమి. లోపలినుంచే మేనమామ ఏకపాత్రాభినయాన్ని వినీ వినీ ఇహ ఊరుకోలేకపోయింది. తన ప్రవర్తనలో అధర్మం ఏదీ లేదనుకున్నప్పుడు భయం ఎప్పుడూ ఉండదామెకి.

కర్టెన్‌ తీసుకుని ఇవతలికి వస్తూ, ‘‘మావయ్యా, మధ్యలో నేను కల్పించుకుని మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకు. డబ్బున్నవాళ్ల సంబంధం కోసం నువ్వూ అత్తా ఎంత పట్టుగా ఉన్నారో మాకు తెలుసు. బావే స్వయంగా నాకు చెప్పాడు. తనకి నన్ను చేసుకుతీరాలన్న పట్టుదల ఏమీ లేదని కూడా నిష్కల్మషంగా చెప్పాడు. మొత్తం ఇదంతా సహజమేనని, ఎవరికి వాళ్లు ఎదగాలనే కోరుకుంటారని అనుకున్నాం తప్పితే మిమ్మల్ని మేమెవ్వరం తిట్టుకోలేదు. అమ్మకీ నాన్నగారికీ కనీసం కోపం కూడా రాలేదు. బాధా లేదు. ఎవరికి ఏది ఎంత ప్రాప్తమో అంత!! హాయిగా బావకీ అంజలికీ పెళ్లి చెయ్యండి. నువ్వింక ఇలా బాధపడటం మానేస్తే బావుంటుంది’’ అంది నవ్వుమొహంతోనే.

తన గుట్టు రట్టవగానే ముకుందం ఒక్కసారిగా మేకతోలు వదిలేశాడు.

‘‘ఏవిటే పెద్ద గొప్పగా చెబుతున్నావు..మీరు తిట్టుకుంటే మటుకు...మాకేం భయమా..?? పోనీలే బాధపడతారని ఆ ముక్కా ఈ ముక్కా కల్పించి చెబుతూ ఉంటే నేనేదో నాటకాలాడుతున్నట్టుంది గాబోలు నీకు..సిద్ధాంతాలు వల్లిస్తున్నావు. అవును...నిజమే!! నేనూ నా పెళ్లాం డబ్బున్నవాళ్ల పిల్లని

చేసుకుందామనుకుంటున్నాం. అయితే ఏమిటిట... ఎప్పుడో పాతికేళ్ల కిందట ఏదో అనుకున్నామని ఇప్పుడు పిల్లాడి భవిష్యత్తును నాశనం చేస్తామా...అంజలి కోటీశ్వరుడి కూతురైనా మావాడితో సమానంగా ఉద్యోగం చేస్తోంది. నీ బతుక్కి అది కూడా లేదు. ఇలాగే మిడిసిపడుతూ ఉంటే..ఆఖరికి...’’ అంటూ రాఘవరావు మొహం చూసి మాట మింగేసి, చప్పున లేచి గడప దాటేశాడు.

రాఘవరావు లేచి వచ్చి కూతురి తల నిమురుతూ, ‘‘మావయ్య మాటలు పట్టించుకోకు తల్లీ. నొసట రాసి పెట్టి ఉన్నది సప్త సముద్రాల అవతల ఉన్నా మనకి దక్కుతుంది. మనది కానిది మన గుప్పెట్లో ఉన్నా జారిపోతుంది!’’ అన్నాడు.

గౌతమి తండ్రి వైపు చూస్తూ ప్రశాంతంగా నవ్వింది..‘‘చిన్నప్పటి నుంచీ మీరు నాకు బోథిస్తున్న ఈ ప్రాకృతిక సత్యాలే నన్ను ప్రశాంతంగా ఉండేలా చేస్తున్నాయి నాన్నా. నేను దేనికి అర్హురాలినో, దాన్ని భగవంతుడే స్వయంగా నాకు ఇస్తాడన్న నమ్మకం నాకుంది. అంతకు మించినదానికోసం నేను దురాశపడను. మంచి జీవితం కోసం నా వంతుగా నేను కష్టపడతాను. అంతే!’’ అంది.


చిరుద్యోగి రాఘవరావు ఒక్కగానొక్క సంతానం గౌతమి. పెద్ద చదువులు చదవాలని ఉన్నా తండ్రికి ఆర్థికంగా బరువు కాకూడదని బికాం చదివి, కంప్యూటర్‌ కోర్సులేవో నేర్చుకుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఇప్పుడిప్పుడే ఇంటర్వ్యూలకు వెళుతోంది.

ఆ రోజు సదరన్‌ స్టార్‌ షిప్పింగ్‌ కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరైంది గౌతమి. ఎగుమతి ` దిగుమతుల వ్యాపారంలో సదరన్‌ స్టార్‌కి చాలా పెద్ద పేరుంది. బోర్డ్‌ రూంలో సదరన్‌ స్టార్‌ అధినేత జగదీశ్‌ ప్రసాద్‌, జనరల్‌ మేనేజర్‌ గోపాలన్‌లిద్దరూ గాక, జగదీశ్‌ ప్రసాద్‌ ఒక్కగానొక్క బిడ్డ భరణీ ప్రసాద్‌ కూడా ఉన్నాడు. కంప్యూటర్‌ సెక్షన్‌లో కీలకమైన పోస్టుకి నిర్వహిస్తున్న ఆ ఇంటర్వ్యూల్ని స్వయంగా నడపమంటూ తండ్రి ఇచ్చిన ఆదేశానుసారంగా భరణి అక్కడికి వచ్చాడు. తండ్రి, జిఎం చెరోవైపూ కూర్చుని గమనిస్తూ ఉండగా, మధ్యలో కూర్చుని ఇంటర్వ్యూలు ప్రారంభించాడు భరణి.

ఎక్కువగా వచ్చింది ఆడపిల్లలే. చుడీదార్లు, జీన్స్‌..విరబోసుకున్న జుట్లు... పోనీటైల్స్‌...కనిపించని బొట్లు లేదా బోసి నుదురు..చురుకైనసమాధానాలు..నంగిరి మాటలు...

పదిమందిని ఇంటర్వ్యూ చేశాక కాఫీ బ్రేక్‌ తీసుకున్నారు.

‘‘ఒకప్పుడు భారతీయ వనితల ముస్తాబు ప్రపంచంలోనే ప్రత్యేకమైనదిగా ఉండేది. ఇప్పుడు ప్రాక్పశ్చిమాల్లో ఎటు చూసినా ఒకటే ముస్తాబు...ఒకటే వేషం’’ కాఫీ తాగుతూ అన్నాడు భరణి.

‘‘ఇంటర్వ్యూల వల్ల నీకొచ్చిన జ్ఞానమన్నమాట’’ జగదీశ్‌ ప్రసాద్‌ నవ్వాడు.

కాఫీలయ్యాక మళ్లీ ఇంటర్వ్యూలు ప్రారంభించారు. పదకొండో అభ్యర్థిగా గౌతమి లోపలికి వచ్చింది.

పొడుగ్గా, తీగలా ఉన్న ఆమె శరీరం, నీలం రంగు కాటన్‌ చీరలో అందంగా, హుందాగా ఉంది. కుడి చేతికి నాలుగు బంగారు రంగు గాజు గాజులు, ఎడం చేతికి వాచీ, చెవులకు చిన్న చిన్న జూకాలు...నుదుట చిన్న దోసగింజ బొట్టు, కళ్లకు సన్నగా తీర్చిదిద్దినకాటుక..చెదరని చిరునవ్వుతో మెరుస్తున్న లేత పెదవులు..

అప్రయత్నంగా తండ్రీకొడుకులు ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు.

‘‘దక్షిణ భారతీయ వనిత...’’ ఇద్దరి మనసుల్లోనూ ఒకటే మాట కదిలింది.

ఎదురుగా కూర్చున్న అమ్మాయి మొహంలో ఇంటర్వ్యూ టెన్షన్‌ కి బదులు స్థిరంగా ఉన్న ప్రశాంతతను గమనిస్తూ ప్రశ్నలు ప్రారంభించాడు భరణి. టెక్నాలజీ, జనరల్‌ నాలెడ్జికి సంబంధించినంత వరకూ అన్నీ ఎక్కడా తొణుకు బెణుకు లేకుండా చక్కగా చెప్పిందామె. తండ్రి మొహంలో మెచ్చుకోలు చూస్తూ ఇంటర్వ్యూ ముగించాడు భరణి.

వెళ్లిపోవడానికి లేచి నిలబడిరదామె. వెనక్కి తిరగబోతూ ఉండగా, ‘‘మీరు కట్టుకున్నది కొత్త చీరలా ఉంది..’’ అన్నాడు భరణి.

గౌతమి చప్పున ఇటు తిరిగి, కాస్త ఆశ్చర్యంగా ‘‘అవును సార్‌..కొత్త చీరే’’ అంది.

‘‘ఇంటర్వ్యూ అని కొత్త చీర కట్టుకున్నారా...బావుంది!’’

వెటకారమో, ప్రశంసో అర్థం గాకుండా అతడు అన్న మాటకి ఆమె చురుగ్గానే స్పందించింది. సూటిగా అతడి వైపు చూస్తూనే సరళమైన స్వరంతో, ‘‘ఇంటర్వ్యూ అని కట్టుకోలేదు. ఈ రోజు నా పుట్టినరోజు. అందుకని కొత్తచీర కట్టుకున్నాను. ఎటూ కట్టుకున్నాను గదా అని దీంతోనే ఇంటర్వ్యూకొచ్చాను.’’ అంటూ జవాబు చెప్పింది.

ఆ రోజు ఆమె పుట్టినరోజన్న విషయాన్ని సర్టిఫికెట్ల ద్వారా గమనించిన తర్వాతే భరణి ఆ ప్రస్తావన ప్రారంభించాడు.

అయినా ఏమీ తెలియనట్టే, ‘‘అవునా...హేపీ బర్త్ డే! మీరేమీ అనుకోకపోతే, బర్త్ డేకి అమ్మాయిలoదరూ ఏవేవో చీరలు కొనుక్కుంటారు. మీరీ కాటన్‌ చీర కొనుక్కున్నారేమిటి..?!’’ అంటూ ప్రశ్నించాడు.

ఇంటర్వ్యూల్లో అభ్యర్థి మనస్తత్వాన్ని రకరకాలుగా ప్రశ్నించి తెలుసుకుంటారుట..ఇలాగే కాబోలు..అనుకుంటూ, నిస్సంకోచంగా, నిర్మలంగా జవాబు చెప్పింది గౌతమి..‘‘నాన్నగారి సంపాదన చాలా తక్కువ. అప్పులు చెయ్యడం మాకు ఇష్టం ఉండదు. ఈ చీర అమ్మవారి గుళ్లో వేలం పాటలో వంద రూపాయలకి వచ్చింది. బావుందని తీసుకున్నాం. కాటన్‌ కాబట్టి అమ్మా నేనూ ఇద్దరం కట్టుకుంటాం!’’

దాదాపు ఆర్నెల్ల తర్వాత, ఒకానొక స్టార్‌ హోటల్లో ఘనంగా జరుగుతున్న తన కొడుకు పెళ్లికి సదరన్‌ స్టార్‌ అధినేత వస్తున్నాడని తెలిసి చాలా ఆనందపడ్డాడు ముకుందం. కాబోయే వియ్యంకుడు రాజారాంకి సదరన్‌ స్టార్‌ అధినేత జగదీశ్‌ ప్రసాద్‌ బాగా తెలుసుట. అతడికి చెప్పి చిన్న కొడుక్కి సదరన్‌ స్టార్‌ లో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని అనుకుంటూ, రాజారాంతో బాటు తను కూడా జగదీశ్‌ ప్రసాద్‌కి స్వాగతం చెప్పడానికి పరిగెత్తాడు.

సరికొత్త సిల్వర్‌ కలర్‌ ఆడి కారు వచ్చి హోటల్‌ పార్కింగ్‌లో ఆగింది. లేత గులాబీరంగు కుర్తా పైజామాలో కార్లోంచి దిగుతున్న వ్యక్తిని చూస్తూ, ‘‘అరె...పెద్దాయన రాలేదు. వాళ్లబ్బాయిని పంపించారు. అతను జగదీశ్‌ గారి ఏకైక పుత్రుడు భరణీ ప్రసాద్‌’’ అంటూ వియ్యంకుడితో వ్యాఖ్యానించాడు రాజారాం.

భరణి వెనకాలే, చీర కుచ్చెళ్లు పాదాల మీద జీరాడుతూ ఉండగా కార్లోంచి దిగుతున్న మరో వ్యక్తిని చూస్తూ, ‘‘కోడల్ని కూడా పంపించారయ్యా..ఈ మధ్యనే భరణికి పెళ్లయింది. చాలా సింపుల్‌ గా యాదగిరి గుట్ట మీద చేశారట. ఎవ్వర్నీ పిలవలేదు.’’ అంటూ గబగబా ముందుకి నడిచాడు.

వియ్యంకుడితో బాటు తను కూడా పరుగులాంటి నడక నడిచాడు ముకుందం.

కారు దిగిన చిన్నయ్యగారికి వియ్యంకుడు వంగి వంగి సలాములు చేస్తూంటే తను కూడా వందనాలు అర్పించాడు. ఖరీదైన పట్టుచీర, వజ్రాల నగలతో చిన్న సార్‌ వెనకాలే హంసలా నడుస్తున్న చిన్నమ్మగార్ని చూసి మాత్రం కళ్లు తిరిగి పడబోయాడు.

‘‘ఏవండీ, విన్నారా...గౌతమికి పెళ్లయిపోయిందట. గుట్టు చప్పుడు గాకుండా యాదగిరి గుట్ట మీద చేశారట. మనని కూడా పిలవలేదూ..’’ భార్య సాగదీస్తూ చెప్పినప్పుడు పుల్లలా తీసి పారేశాడు ముకుందం.

‘ఏ ముష్టి వెథవకో ఇచ్చి చేసుంటార్లే. మనని పిలవడానికి మొహం చెల్లి ఉండదు. పోనీ వెథవగోల..’’ అంటూ విసుక్కున్నాడు.

ఆ గౌతమే ఇప్పుడిలా...ఆడి కారులో...

తనని సరిగ్గా గమనించకుండా దండాలు పెట్టేసి ఆనక తెల్లబోతున్న ముకుందాన్ని చూసి ఎప్పటిలాగే చిరునవ్వు నవ్వింది గౌతమి.

"బావున్నావా మావయ్యా...”

‘‘ఆ....ఆ...’’ తనని పట్టించుకోకుండా ముందుకి వెళ్లిపోతున్న భరణిని చూస్తూ ముకుందం మాటలకి వెతుక్కుంటూ ఉంటే గౌతమికి నవ్వొచ్చింది.

‘‘గాభరా పడకు మావయ్యా. ప్రాప్తాప్రాప్తాలంటే ఇలాగే ఉంటాయి...ఇంత దిమ్మ తిరిగేట్టుగానే.

చిన్నప్పటినుంచీ నాన్నగారు నూరి పోశారు కాబట్టి నాకు తట్టుకునే శక్తి ఉంది. నీకు కొత్త కదా...లోపలికి వచ్చి ఏ కూల్‌ డ్రిoకో తాగు..స్థిమితపడుతుంది!’’ ముకుందంతో నెమ్మదిగా చెప్పేసి, భర్త వెనకాలే హుందాగా నడుస్తూ వెళ్లిపోయింది!!

-బి.లక్ష్మీ గాయత్రి

First Published:  23 May 2023 1:13 PM IST
Next Story