అధికార బొంగరం గిర్రున తిరుగుతోంది
వ్యవస్థ చేతినీడలో…
ప్రజల ఘోష…
అసెంబ్లీ గోడల నుండి
విరుచుకు పడిన పొర్లుదండాల దుమ్ములో…
కలిసిపోయింది.
సూర్యుణ్ణి ఒకవైపు చంద్రుణ్ణి ఒకవైపు
కళ్ళల్లో దాచుకున్న వారు
ఇపుడు మబ్బుల వెనకకు
ఒదిగిపోయారు.
విరగబడ్డ కొండ చెరియలా….
మార్కెట్… జనాల మీదకు ఒరిగిపోయింది.
మందు జల్లుతో.. తూగుతూ..
మత్తుగా.. ఓటర్లు…
టీవీలని వదలని ప్రకటనల్లా…
అందరూ… వినోదపు గోడకు కట్టేయబడ్డారు…
ప్రవాహంలో కొట్టుకు పోయిన ఎదురీత…
ఇసుకలో కూరుకుపోయిన శిలాఫలకం.
కొమ్మన కూర్చున్న పిట్టొకటి…
అన్నీ ఎరిగిన దానిలా
వేదాంతపు పాటొకటి పాడుతోంది..
గొంతులో దిగబడిన ముల్లుని
దేనితో తియ్యాలన్నది తేలని లెక్కై
గాలికి లేచిన ఆకులా
గిరికీలు కొడుతోంది.
-అవ్వారు శ్రీధర్ బాబు