సాకారం చేస్తూ..(కవిత)
భాషకందని భావ శిల్పాన్ని
చెక్కాలని
కఠిన పదాల శిలను
ముందరేసుకుని కూర్చున్నా..
రోజుల తరబడి చెక్కుతున్నా
అక్షరానికి లావణ్యం చిక్కలేదు
క్షణంలో కనిపించినట్లే కనిపించి
ఫక్కున నవ్వి తప్పుకుంటుంది..
మళ్లీ నేను
ఎదురుపడ్డ పదాల్ని బామాలి
భుజాననున్న సంచిలో వేసుకుని
పట్టువదలని విక్రమార్కుని వోలె
చెక్కుతూనే ఉన్నా..
ఒళ్ళంతా సింగారంతో
ఓ కవితా బుట్టబొమ్మ
కళ్ళ ముందు నిల్చొని
అర్ధ రాత్రి కవ్వింపు.. ఉహూ..
నాకేం నచ్చలా..
కుదరదని
ఆలోచన దుప్పటి కప్పుకుని పడుకున్నా ...
కునుకు పిట్ట వాలీ వాలగానే..
భావ తంత్రుల్ని మీటుతూ
సుతారంగా
భావజలాన్ని కుమ్మరిస్తూ
లోలోపల
ఒక్కో శృతి పొరను చీల్చివేసి..
నర్తిస్తూ నన్ను తట్టి లేపింది
ఓ నవ కావ్య కన్యక..!
శుష్కపదాల నగ్నత్వంపై మోజుకూడదంటూ
భావామృత జలధిలో ముంచేసి
కవన పీఠంపై అభిషిక్తను చేసి కలకాలంనిలిచిపోయే
కవితా కిరీటాన్ని
అలంకరింపజేస్తోంది..
ఎప్పటి నిరీక్షణో సాకారం చేస్తోన్న
ఓ కలా..నీకిదే నా ఆహ్వానం.
-అవధానం అమృతవల్లి
(ప్రొద్దుటూరు)