Telugu Global
Arts & Literature

భావన : ఆత్మవిశ్వాసం

భావన : ఆత్మవిశ్వాసం
X

ఆలోచనల రూపంలో ఉన్న ఆత్మవిశ్వాసం శ్రమశక్తిగా రూపాంతరం చెందేప్రక్రియను అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది .

మనం తినే ఆహారం, త్రాగేనీరు,పీల్చేగాలి, సూర్యరశ్మి భౌతికశక్తిగా మారి, మన కృషికి తోడ్పడుతున్నాయని మనకు తెలుసు ఈ ప్రక్రియకు అనుగుణంగా మన శరీరం నిర్మాణం చెయ్యబడి ఉంది.

అయినప్పటికి మనకు మనం చేసే పనిపట్ల ఉన్న భావం అదనపు శక్తిని ఇస్తుంది.అనగా మనకు ఇష్టమయిన పనిని చేస్తున్నప్పుడు అంకిత భావంతో కష్టపడతాం ఎంతకష్టపడ్డా అలసిపోం ఆ దశలో మన భౌతికశక్తితోపాటు మన ఆలోచనలు కూడ కలసి శ్రమశక్తిగా బహిర్గతమయ్యే అనుభూతి కల్గుతుంది.

మనం చేసే పనిని బాధ్యతగా స్వీకరించి దృఢ నిశ్చయంతో నిజాయితీగా వ్యవహరిస్తున్నప్పుడు అదనపు శక్తి మనలోనుంచి బహిర్గతమవుతుంది పని పట్ల మనకున్న వైఖరి, పని నుండి మనంఎదురుచూసే ప్రయోజనం, పనిలో మనకున్న నైపుణ్యం మన విలువలు అన్ని కలసి మానసిక శక్తిగా వ్యవహరిస్తాయి మానసిక శక్తిని ఆత్మవిశ్వాసం ఉత్పత్తి చేస్తుంది.పనిపట్ల మనకు సదభిప్రాయం లేకపోతే మానసిక శక్తి శ్రమ శక్తిగా రూపాంతరం చెందదు అప్పుడు తొందరగా అలసిపోతాం.

అనేక సందర్భాలలో ఎంత కష్టపడ్డా వైఫల్యాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

అప్పుడు నిరాశా నిస్పృహలకు లోనవుతాం. అట్లాగే నివారణ లేని జబ్బులతో బాధపడుతున్నప్పుడు కూడ మన ఓర్పు, సహనం తగ్గిపోతాయి కొన్ని సందర్భాలలో ఆప్తులను

కోల్పోయినప్పుడు భరించరాని దుఃఖం మన శక్తిని హరించి వేస్తుంది.

ఇట్టి పరిస్థితులలో ఆశ విశ్వాసాలు భౌతికశక్తిగా రూపాంతరం చెంది మనకు అండగా ఉంటాయి దీనినే ఆధ్యాత్మిక శక్తిగా అభివర్ణిస్తాం ఆత్మవిశ్వాసం ఉన్నవారు ఆధునిక విజ్ఞానాన్నిఆధ్యాత్మిక చింతన ద్వారా ఓర్పు, అందిపుచ్చుకోగల్గుతారు.

సహనం, సర్దుకుపోయే స్వభావం బహిర్గతమవుతాయి అప్పుడు అంతర్గత శక్తి శ్రమశక్తిగా రూపాంతరం చెందే అనుభూతి కల్గుతుంది.

భౌతికశక్తితోపాటు మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి కూడ మన శ్రమశక్తిగాబహిర్గతమవుతున్నాయి మనం చేసే పనిని విధిగా భావించి యాంత్రికంగా వ్యవహరిస్తున్నప్పుడు తొందరగా అలసిపోతాం. కాని పనిని బాధ్యతగా స్వీకరించి ఉత్సాహంతో స్పందిస్తే అదనపు శ్రమ శక్తి బహిర్గతమవుతుంది. ఈ అదనపు శక్తినే మానసిక శక్తిఅంటాం .అట్లాగే మన కృషికి అదృశ్యశక్తి తోడ్పడుతోందనే విశ్వాసంతో ఆశనుపెంచుకొంటే అదనపు శ్రమ శక్తి మనకు అండగా ఉంటుంది ఈ శక్తినే ఆధ్యాత్మిక శక్తిఅంటాం .ఈ మూడు శక్తుల ఉత్పత్తిలోను, అనుసంధానంచెయ్యడంలోను ఆత్మవిశ్వాసం ప్రధాన భూమికను నిర్వహిస్తుంది.

మనం వినియోగించే శ్రమశక్తి ఒక బ్యాటరీ నుండి అందుబాటులోకి వస్తోందనిఊహించుకొందాం .

బ్యాటరీని ఎప్పటికప్పుడు ఛార్జి చేస్తే గాని మనకు అవసరమయినశక్తి లభించదు బ్యాటరీని ఛార్జ్ చెయ్యకుండా ఉపయోగిస్తే పని జరగదు .మన శరీరంలోని బ్యాటరీని ఛార్జి చెయ్యటానికి మూడు ఛార్జర్లు ఉన్నాయి ఒక ఛార్జరు భౌతిక శక్తి ఉత్పత్తికి వినియోగించుకొంటాం .

అనగా భౌతిక పదార్థాలను శ్రమశక్తిగా రూపాంతరం చెందించే పరికరం.

ఇంకొక ఛార్జరు మానసిక శక్తిని శ్రమశక్తిగా మార్చి మనకందిస్తుంది.

మూడవ ఛార్జరు ఆధ్యాత్మిక ఆలోచనలను శ్రమశక్తిగా మార్చుతుంది.

ఆధ్యాత్మిక చింతన ఆశావిశ్వాసాలను ప్రేరేపించి కార్యనిర్వహణా సామర్థ్యం వృద్ధిచేసి, క్రియాశక్తిని బహిర్గతం చేస్తుంది అందువల్ల ఆధ్యాత్మిక ఛార్జరును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడానికి కృషిచెయ్యాలి ఈ మూడు ఛార్జరుల పనితీరును సమన్వయం చేస్తే ప్రక్రియను ఆత్మవిశ్వాసం అంటాం ఈ ఛార్జరులకు మరమత్తులు వస్తే ఆత్మవిశ్వాసం సరిచేస్తుంది అందువల్ల మన ఆలోచనలు శ్రమశక్తిగా రూపాంతరంచెంది, మన కృషికి తోడ్పడటానికి ఆత్మవిశ్వాసం అవసరం .

తెలుసుగా !మన శరీరంలో ఒకబ్యాటరీ, మూడు ఛార్జర్లు ఉన్నాయి. ఈ ఛార్జరులన్ని ఆత్మవిశ్వాసం అధీనంలో ఉంటాయి. మూడు ఛార్జరులలో ఏది సరిగ్గా పని చెయ్యకపోయినా అంతర్గత శక్తి సంపూర్ణంగా వినియోగంలోకిరాదు .

అందువల్ల ఆత్మవిశ్వాసాన్ని వృద్ధి చేసుకొని ఈ మూడు ఛార్జర్లను పటిష్టంగా వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి.

- అట్లూరి వెంకటేశ్వరరావు

First Published:  2 Aug 2023 9:16 PM IST
Next Story