Telugu Global
Arts & Literature

అద్దె కొంప లో "ఆత్మ"

అద్దె కొంప లో ఆత్మ
X

పుట్టగానే

ఈ కొంప ను అద్దెకు తీసుకున్నాను.

ఇందులో ఎన్నాళ్లు కాపురం ఉంటానో

నాకే తెలియదు

అందుకే

ఇన్నాళ్లని దీనికి అద్దె చీటీ వ్రాయలేదు

పరిగెత్తే కాలం తోబాటు

పరుగెత్తి, పరుగెత్తి

అలసి సొలసి

నన్ను నేను చూసుకునే సరికి

వృద్ధాప్యానికి

మూడో కాలు ఆసరా అయ్యింది

అప్పుడే దృష్టి

నాయింటిని

పరిశీలించడం మొదలు పెట్టింది

అది శిధిలావస్థకి చేరి

నన్ను వెక్కిరించింది.

నా అశ్రద్ద ను వేలు పెట్టి

మరీ చూపించింది

అనారోగ్యపు అంతర్ యుద్ధంతో

పోరాడి, పోరాడి

నే ఓడి నప్పుడు.

నా కొంపే నిర్ధాక్షణ్యంగా

నన్ను బయటికి నెట్టి వేస్తుంది

నేను కానీ నేనుగా

మిగిలిన నేను

భవ బంధాల్ని వదలి

కాలం ఎరుగని అంచుల్లోకి

అదృశ్య పక్షినై ఎగిరిపోతాను

*****

ఈ భూమ్మీద

ఏ జీవికీ సొంత కొంప అంటూ

ఉండదు

ప్రతీ ఒక్కరిదీ అద్దె కొంపే.

భ్రమల సంద్రంలో

మునిగి తెలుతున్నంత కాలం

నేను, నాదీ అంటూ

వెంపర్లాడుతునే ఉంటుంది

జీవిత సత్యం బోధపడే సరికి

తానే లేకుండా పోతుంది.

- ఆసు రాజేంద్ర

First Published:  19 Oct 2023 11:31 PM IST
Next Story