అసంపూర్ణ
ఈ లోకం
నీ కాళ్లకు చుట్టుకున్న గజ్జె చేసే తైతక్క శబ్దం
అయినా నువ్వు లోకువ దానికి
ఈ ప్రేమా
ఆ బంధం
నువ్వు వదిలేసిన నీ నిశ్వాస విడిచే ఒకానొక నీరవ రాగం
అయినా నీపై పెత్తనం వాటికి
కళ్ళకు నిండుగా కాటుక పెట్టుకున్నట్టు
చిక్కటి నవ్వును నవ్వుతావే
నిజమేనా అది; అసలు నీదేనా హాసమది
గుండె నదిని ఏ రాయీ చలనసహితం చేయనట్టు
ఓ నిర్మలత్వాన్ని మోముపై పూయిస్తావే
నమ్మమంటావా అది; అసలే అలజడీ లేనిదా నీ మది
ఎన్నాళ్ళనలా హోరెత్తే అలసత్వాన్ని ఎదిరిస్తావు
ఎన్నేళ్ళని చెమ్మగిల్లే ఎదను ఎండగడతావు
ఎందాకని ఒంటరి పయనాన్ని గుంపులో సాగిస్తావు
ఏ తీరం నీకై ఎదురుచూస్తుందని ఎదురీతకు అలవాటు పడతావు
మారదు ఏదీ....
కాలం సాగడం
వికలమైన నీ మనస్సు మూగగా రోదించడం
ఆగదు ఏదీ
నీ చే లోకం పుట్టడం
నీదన్న అస్తిత్వం అక్కడ గిట్టడం
వదలదు ఏదీ
చేదును తీపిగా మభ్యపెట్టే నీ పోరాట శేషం
విధిలిఖితంగా నువ్వు రాసుకున్న అసంపూర్ణ నీ జీవితం.....
- సుధామురళి