అసలు జీవితం
జీవితమంటే చతురంగమని బలాల నడిపి మంత్రిని చంపి,
రాజును తోసి ఆటకట్టని గెలుపోటములను చాటేరు
గెలిచిన రాజెవరు? మనుషులు గెలిచే రోజెపుడు?
అసలు జీవితం ఇదే ఇదే అని తెలిపే వారెవరు?
జీవితమంటే వైకుంఠ పాళి ఆటే చూడంటూ
నిచ్చెనలెక్కి పాముల దాటి వైకుంఠాన్ని పొందంటూ
పరమపదాన్ని చూపేరు పరమాన్నమెచట దాచేరు?
అసలు జీవితం ఇదే ఇదే అని తెలిపే వారెవరు?
జీవితమంటే రంగులరాట్నం రమ్మని ఎక్కించి
గిర గిర తిప్పి హంగులు చూపి మాయను తోసేరు
నేలను విడిచి నింగిని తాకితే మబ్బుల పొంగేగా
అసలు జీవితం ఇదే ఇదే అని తెలిపే వారెవరు?
జీవితమంటే హరివిల్లంటూ జీవితమంటే నాటకమంటూ
జీవితమదిఒక బంగరు కల అని జీవితమది ఒక అమృత ఫలమని
ఆశలతోటల మదిలో పెంచేరు? ఆలోచనలను మొదలే తుంచేరు
అసలు జీవితం ఇదే ఇదే అని తెలిపే వారెవరు?
పూటపూటకొక ఆటను చేరి నాటకాలలో పాత్రలదూరి
బాటబాటలో మలుపుల కోరి చాటు మాటుగా దొంగగ మారి
నేటిని, గూటిని, నీలోని నిన్ను విడిచిన నీకు మిగిలేదేముంది?
అసలు జీవితం ఇదే ఇదే అని బ్రతికే నాడెపుడు?
అసలు జీవితం ఇదే ఇదే అని బ్రతికే వాడెవడు?
రచన ...
ఆచార్య రాణి సదాశివ మూర్తి