అనుభవమే దేవుడు
పుట్టుకంటే ఏమిటని అడిగాను,
పుడితే తెలుస్తుందన్నాడు దేవుడు!
చదువంటే ఏమిటని అడిగాను,
చదివితే తెలుస్తుందన్నాడు!
మేధస్సు అంటే ఏమిటని అడిగాను,
మేధావి అయితే తెలుస్తుందన్నాడు!
ప్రేమంటే ఏమిటని అడిగాను,
ప్రేమించి చూడు తెలుస్తుందన్నాడు!
ఆప్యాయతంటే ఏమిటని అడిగాను,
ఆప్యాయతను చూపితే తెలుస్తుందన్నాడు!
పెళ్ళి వల్ల కలిగే సుఖమేంటని అడిగాను, పెళ్ళి చేసుకుని చూడు తెలుస్తుందన్నాడు!
బిడ్డ అంటే ఏమిటని అడిగాను,
బిడ్డను కంటే తెలుస్తుందన్నాడు దేవుడు!
వృద్ధాప్యమంటే ఏమిటని అడిగాను,
వృద్ధుడైతే తెలుస్తుందన్నాడు దేవుడు!
పేదరికమంటే ఏమిటని అడిగాను,
అవస్థపడు, తెలుస్తుందన్నాడు దేవుడు!
మరణమంటే ఏమిటని అడిగాను,
మరణిస్తే తెలుస్తుందన్నాడు దేవుడు!
అనుభవిస్తేనే
తెలుస్తుందంటే
ఇక నువ్వెందుకు అని అడిగాను…
దేవుడు కాస్తంత దగ్గరకొచ్చి "అనుభవమంటేనే నేనయ్యా" అని అదృశ్యమయ్యాడు!!
(తమిళ మూలం - కణ్ణదాసన్),
అనుసృజన - యామిజాల జగదీశ్