Telugu Global
Arts & Literature

ఆనందం

ఆనందం
X

'అమ్మా, నాకా బంతి కావాలి' పిల్లవాడు కొట్లో కనిపిస్తున్న బంతిని చూస్తూ మారాం చేస్తూ అన్నాడు.

'అలాగే,రేపు నాన్నకి చెప్పి కొనిపిస్తాలే' తల్లి సమాదాయిస్తూ అంటోంది.

'రోజు ఇదే చెబుతావు' రెండు కాళ్ళు నేల కేసి కొడుతూ కోపంగా అన్నాడు.

''రేపు తప్పకుండా కొనిపెడతాను సరేనా' తల్లి వాడికి దగ్గరకి తీసుకుంటూ అంటోంది.

ఇంతలో మెట్రో లిఫ్ట్ ద్వారం తెరుచుకుంది.అందరం లోపలికి వెళ్ళాం.

ఈ సంభాషణ దాదాపుగా పదిరోజుల బట్టి నేను మెట్రో స్టేషన్ లో లేడీస్ బోగి దగ్గర వింటూనేఉన్నాను.కొడుకు మారాం, తల్లి బుజ్జగింపు ఇలాగే కొనసాగుతోంది.

మియాపూర్ లో మెట్రో దిగి పక్కన ఉన్న పార్క్ పక్కన బెంచి మీద కూర్చున్నాను. ఇంకో బెంచి మీద ఆమె కొడుకు కూర్చున్నాడు.

నాది షిఫ్ట్ డ్యూటీ, ఒక్కోసారి సాయంత్రం నాలుగు గంటలకి, ఇంకోసారి ఆరు గంటలకి బయలుదేరుతూ ఉంటాను. మా వారికి రెడ్డి లాబ్స్ లో ఉద్యోగం.ఆఫీస్ నుంచి వస్తు నన్ను ఇక్కడనుంచి ఇంటికి తీసుకెళ్ళతారు.

ఆమెను,కొడుకుని కూడా వాళ్ల ఆయన వచ్చి లూనా మీద తీసుకెళ్ళతాడు.

ఆ రోజు తొలిసారిగా ఆమెలో మాట కలిపాను.

నాంపల్లిలో ఒక ముస్లింల ఇంట్లో పనిచేస్తుందిట.ఇంటిపని,వంట పని అన్ని చేస్తుందిట.పొద్దున్న ఎనిమిందింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు.

ముందు MMTS లో వెళ్ళేదిట.ఇప్పుడు మెట్రో లో వెళుతోంది.కొడుకుని అక్కడే ప్రభుత్వ బడిలో చేర్పించిందట.రోజు పని ముగించుకొని పిల్లవాడ్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది.

మొగుడు మియాపూర్ లో ఏదో కంపనీలో వెల్డింగ్ పని చేస్తాడుట.అతనికి షిఫ్ట్ కుదిరినప్పుడు ఇద్దరిని తనతో ఇంటికి తీసుకెళతాడు.లేకపోతే షేరింగ్ ఆటో లో ఇంటికి వెళ్ళిపోతుందిట.

పిల్లాడు పసుపు పచ్చ బంతి కావాలని పెద్దగా ఏడుస్తూ గొడవ చేస్తూనే ఉన్నాడు.

ఇంతలో మా వారు రావడంతో ఇద్దరు ఇంటికి బయలుదేరాం. కనుమరగవుతున్న పిల్లాడి రూపం నన్ను వెంటాడుతోంది.

ఈ కోవిడ్ ఉదృతి తగ్గటంతో మెట్రో స్టేషన్ లో అన్ని కొట్లు తెరిచారు. విలాసవంతమైన పెద్ద కంపెనీలు అద్దెకి తీసుకున్నాయి.

పెద్ద పిజ్జా కొట్టు,ఆ పక్కనే చిన్న బంతి నుంచి ఖరీదైన బట్టల వరకు అమ్మే పెద్ద కొట్టు, ఆ పక్కన ఫ్రాంకీ అమ్మే అల్ఫాహారపు కొట్టు ఇలా చాలానే తెరుచుకున్నాయి.

ఈ స్పోర్ట్స్ దుకాణం తెరిచి నెలయింది.కొట్టు ముందు బంతులు,ఆట వస్తువులు చాలానే పెట్టారు.ఆ పిల్లవాడ్ని రోజు చూస్తూ జాలేసి, నేను ఆ బంతి కొందామని వాకబు చేసాను.

చిన్న బంతి రెండొందలట, పెద్ద బంతులు అన్ని అయిదు వందలు పై మాటే. అదే మాట ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళుతుంటే మా వారితో అన్నాను.

"ఏదో ఒకటి, పాపం కొని ఇచ్చేయలేకపోయావా!

దానకర్ణురాలివి "మా వారు వెటకారంగా అన్నారు .

'రేపు అదే చేస్తాను, పాపం పడుతూ లేస్తూ ఉన్న పేద కుటుంబం. ఆ పిల్లాడ్ని చూస్తే నాకు మన చింటూ గుర్తుకు వస్తున్నాడు.'

ఆయన వంక చురుగ్గా చూస్తూ అన్నాను.

అమెరికాలో ఉన్న ఆరేళ్ల మనవడు నా కళ్ళ ముందు మెదలగా నా కళ్ళు చెమర్చాయి .

*

ఆ రోజు మెట్రో దిగగానే వెళ్లి ఆ బంతిని కొనేసి హ్యాండ్ బాగ్ లో పెట్టుకున్నాను కానీ, ఆమె,పిల్లాడు ఆ రోజు నుంచి మూడు రోజులు వరకు నాకు కనపడనే లేదు.

ఆ రోజు నేను మెట్రో దిగివస్తుంటే పై నుంచి చూస్తే ఆమె కింద నడుస్తూ కనిపించింది. బంతిని చేతికి ఇచ్చి,ఆ పిల్లాడి కళ్ళలో ఆనందం చూడాలన్న నా ఆత్రం, నా అడుగులు వేగంగా పడేలా చేసింది.

లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. ఆమె ఎప్పటిలాగే భర్త కోసం ఎదురు చూస్తూ పార్కు బెంచి మీద కూర్చుంది.కాని పిల్లాడు ఆమె పక్కన లేడు.నా మనస్సు ఒక్కసారిగా ఉస్సురుమంది.

నేను నెమ్మదిగా ఆమె పక్క బెంచి

మీద కూర్చుoడగా మా వారు ఫోన్ చేసి ఇంకో పదినిమిషాలు ఆలస్యం అవుతుందన్నారు.

ఫోన్ పెట్టేసి తల తిప్పి చూస్తే ఆ రోజు కల్వరి చర్చి లో ఏదో కార్యక్రమం ఉన్నట్టుంది, చుట్టూ తినుబండారాల వాళ్లు, బుడగల వాళ్లు అంతా సందడి వాతావరణం కనిపించింది.

ఇంతలో వాళ్ల నాన్న చేయి పట్టుకుని ఆ పిల్లవాడు గెంతులు వెసుకుంటూ తల్లి దగ్గరికి సంతోషంగా వచ్చాడు.వాడి చేతిలో అయిదు రూపాయిల పెద్ద రంగు రంగుల బుడగ.

వాడు బుడగను ఎగరేస్తూ తల్లికి చూపిస్తూ తెగ మురిసి పోతున్నాడు.

బిడ్డ ఆనందాన్ని చూసి ఆ తల్లి కళ్ళలో వేల మెరుపులు.

ఆ ఇద్దరీ ముద్దులు మురిపాలు చూస్తుంటే నాకు లోలోపల తెలియని ఆనందం కలిగింది.

'అమ్మా,ఆ కోట్లో బంతి ఏం బాలే.

ఈ బుడగే పెద్దగా ఎంత బావుందో' తండ్రి బుగ్గ మీద ముద్దు పెడుతూ ఎగురుతూ అన్నాడా పిల్లవాడు.

ఎగురుతున్న బుడగని భద్రంగా పట్టుకొని, తండ్రి భుజాల మీద నుంచి ఎదురుగా ఉన్న లోకాన్ని వెలిగిపోతున్న ముఖంతో పిల్లవాడు చూస్తుoడగా, వాళ్ల బండి రివ్వున ముందుకు సాగిపోయింది.

వాళ్ళను చూస్తూ ఆలోచనలో పడ్డ నేను ఫోన్ మోగడంతో ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డాను.

బాగ్ లోంచి సెల్ తిసుకుంటూ ఉంటే నేను కొన్న ఖరీదైన చిట్టి బంతి నా చేతికి మెత్తగా తగిలింది.

-కామరాజుగడ్డ వాసవదత్త రమణ

First Published:  18 Dec 2022 2:42 PM IST
Next Story