Telugu Global
Arts & Literature

చవితి చంద్రుడు

Interesting Poem

చవితి చంద్రుడు
X

చంద్రుడు తూర్పున ఉదయించడా?

ఏమో ... ఇటీవలి దాకా అలానే

అనుకున్నా...

సూర్యుడెళ్ళాక చంద్రుడూ ...

ఈయనెళ్ళాక ... ఆయనా

రోజూ వీళ్ళ రొటీన్ ఇదే

అనుకున్నా ...

కానీ సోషల్ పాఠం శోషొచ్చే దాకా

అర్థం చేసి చెప్పిన నాన్న

మాటలు గుర్తొచ్చాయ్

సూర్యుడూ, చంద్రుడూ

తూర్పున ఉదయించును

పడమటన అస్తమించును అని ...

కానీ స్వస్తి శ్రీ చాంద్రమానేన

దుర్ముఖి నామ సంవత్సరే

దక్షిణాయనే వర్ష ఋతూ

భాద్రపద మాసే శుక్ల పక్షే

తదియ ... రవి వాసరే

సాయంకాలం ఏడింటికి అయిదు నిమిషాల ముందు చవితి

ప్రవేశం ... ఇది

జంబూ ద్వీపే భరత వర్షే

భరత ఖండే ... మేరోర్దక్షిణ దిగ్భాగే ...

కానీ పడమటి దిక్కున ముందే

ప్రకాశించడం లో ఏంటో తేడా?

నాకర్థం కాదులే ...

నేనేమైనా ఖగోళ శాస్త్రజ్జుడినా

పంచ్ డైలాగులు తెలిసిన

పంచాంగ కర్తనా

నా అజ్జానానికి నేనే జోహారు

చెప్పేసుకుంటున్నా ...

కలికాలంలో దిన వారాలు వెనుకా

సినిమాలూ, పండుగలూ ముందూ

అమెరికా లో అరుదెంచుతాయ్

మధ్యలో ఉన్న ఐరోపా లో ఇంకోలా

పోన్లే ...

ఆకలిగొన్న వాళ్ళెక్కడ పడితే

అక్కడే ఉన్న ఈ భూ గోళం లో

ఏ పండగ ముందొస్తే ఏంటీ

ఎవరి డబ్బులు దండగయితే ఏంటి ...

ఇక్కడ మాత్రం

లా అండ్ ఆర్డర్ కాపాడు స్వామీ ...

అదే చేత్తో

సిద్ధాంత కేసరులూ, సిద్ధుల గుఱించి

ఎద్దేవా చేసిన

దేవరకొండ బాలగంగాధర తిలక్ నీ

క్షమించెయ్యి నాయనా ...

మతాలకతీతంగా మందీ మార్బలం

మధ్య మతాధిపతులూ,

మఠాధిపతులూ,

పీఠాధిపతులూ,

అమ్మలూ, అయ్యలూ

సాధువులూ, సంతులూ, పునీతులూ

అయిపోతున్నారు ...

లేక ఆ బిరుదులు

పాస్త్యుమస్ గా పొందుతున్నారు ...

అయినా చిత్రం కాకపోతే

నీలాపనిందల కథ మోసుకు తిరిగే

చంద్రుడు ముందే ఎందుకొచ్చాడో?

పోన్లే ఎవరెట్టా పోతే నాకెందుకు ...

ఎవరు తూర్పునొస్తే నాకేంటి

ఎవరు పడమటినుంచీ ఉరికొస్తే

నాకేంటి... నా పిచ్చి గానీ

నారసింహ పతంజలి

గోపాత్రుడి కథలో చెప్పలా

భూమి గుండ్రంగానో,

బల్లపరుపుగానో

ఉండదు

పోలీసోడి లాఠీ లా ఉంటుందనీ ...

అదే నిజం ...

భక్తి తప్పినా ... ముక్తి తప్పకుండా

ముక్తి తప్పినా భక్తీ తప్పకుండా

ఓ బొజ్జ గణపయ్యా ...

నువ్వూ నేనూ సేం టు సేం

నీకూ బొజ్జ ఉంది - నాకూ బొజ్జ ఉంది

గణానాం త్వా ... గణపతిగ్ం హవామహే... కవిం కవీణాం

ఉపమశ్రవస్తవం ...

- సాయి శేఖ‌ర్‌

First Published:  4 Sept 2023 4:53 PM IST
Next Story