Telugu Global
Arts & Literature

ప్రీ-పోయెట్రీ రైటింగ్ షూట్

ప్రీ-పోయెట్రీ రైటింగ్ షూట్
X

రకరకాలపెన్నులు...

రంగుల కాగితాల

మధ్య నేను...

గట్టిగా కష్టపడుతూ

కవిత్వాన్ని నలగ్గొడుతూ

తలంటుతూ

సైడ్ లుక్ లో నా బుగ్గల్లో

నే రాసే అక్షరాల

నీడ కనిపించేందుకు

చుట్టూ కంచెలా

నాలుగైదు అద్దాలు..

నా వేళ్ళ నలుపు

రంగు కనబడకుండా

పెన్నుకు చుట్టడానికి

తెల్లని సన్నజాజి

పూల దండ...

రకరకాల యాంగిల్స్ లో

నిలబడి

నుదిటి మీద

నాలుగు చెమట చుక్కలు

రాల్చుతూ

నా కవితలోకి ఆ ఉప్పదనాన్ని

ఒంపుతూ...

పడుకుని ఒళ్ళంతా

పాకిన సిగ్గుని

అక్షరాల్లోకి రాల్చుతూ...

కూర్చుని

మౌనమునిలా ధ్యానిస్తూ

మట్టిని

అక్షరాల్లోకి నింపుతూ....

శ్రీశ్రీని, జాషువాని

ఆవాహన చేసుకుని

దీర్ఘంగా ఆలోచిస్తూ

శ్రమజీవుల

కవిత్వం రాస్తూ...

కొన్ని కాండీడ్ క్లిక్స్..

ఇంకొన్ని

నాచురల్ ట్రిక్స్...

మరికొన్నిటిలో

సోషల్ మీడియా మిక్స్...

అండ్ ఫైనల్లీ

ప్రీ-పోయెట్రీ రైటింగ్

షూట్ పూర్తి...

కవయిత్రిగా తెరంగేట్రం..

అరంగేట్రం...

స్వామి కార్యం ,స్వకార్యం...

ఇప్పుడు నేనొక

మహాసముద్రాన్ని...

మహా కవయిత్రిని.

-అమూల్యచందు

First Published:  24 Jun 2023 10:08 PM IST
Next Story