మనసా నీకు తెలుసా !(కవిత)
క్షమ ఇరువర్గాల వరమని
మన్నిస్తే మరుమల్లెలలంత
స్వచ్ఛంగా నవ్వగలవని
మనసుతో చూడగలిగితే
నీముందు స్వర్గానికి తీసిపోని హాయిఉందని
మానవత్వపు సంతకాన్ని సువర్ణాక్షరాలతో చేయగలవని!!
మనసా నీకు తెలుసా..
భ్రమల వెంట పడితే
ఊరించే ఆశల ఊబిలో
దిగబడిపోతావని
కవ్వించే కసాయి కత్తికి
బలి కాగలవని
కాలం కళ్లెం దాటి పరుగులు
శ్రేయస్కరం కావని
అంతరాత్మ ప్రభోదంతో
నిజాయితీ గీత దాటలేవని!
మనసా నీకు తెలుసా!
సహృదయ స్పందనకు
లే చివురు కొమ్మయినా
నవ్వుల నజరానా కాగలదని
కరకుగుండె సైతం కరుణ రసాన్ని పలికిస్తుందని!
సరిహద్దుల రేఖల్ని చేరిపేసి
స్నేహ హస్తం అందివ్వగలదని!
మనసా నీకు తెలుసా
బంధాలకతీతమైన బాంధవ్యాలేవో మనల్ని
నడిపిస్తుంటాయని
నీది నాది భావన వీడి మనంలో మమేకమైతే
వసుధైక మహత్తు తెలుసుకోగలవని
బ్రతుకు దారిలో నీదైన వెలుగు రేఖగా ప్రసరించగలవని..!
మనసా నీకు తెలుసా
అక్షరానికి మించిన నెచ్చెలిలేదని
సవ్యదిశలో నడిపే సద్గురువని
మనసుపెడితే మరణం దాకా నీకు తోడుంటుందని
కావ్య కన్యకలా నీ మెడలో
వైజయంతి మాలౌతుందని..!!
మనసా నీకు తెలుసా..
ప్రేమను పంచటంలోని ఆనందం
ప్రేమించబడటం లోని మాధుర్యమే అసలు ప్రేమ స్వరూపమని..
ఆకలి పేగుకింత అన్నమయ్యే దిశగా
చేసే త్యాగం లో ఒక్కో రేక గా
రాలిపోయాక ఆత్మనివేదన మిగిల్చే సంతృప్తే బ్రహ్మానందమని..!!
మనసా నీకు తెలుసా !
- అమృతవల్లి అవధానం
(ప్రొద్దుటూరు)