Telugu Global
Arts & Literature

భూదేవి జవాబు పత్రం (కవిత)

భూదేవి జవాబు పత్రం (కవిత)
X

నువ్వు తిరుగుతూనే వున్నావు.

నేను వెలుగుతూనే వున్నాను.

వెలుగు చీకటి వెన్నెల

పంచుతూనే వున్నాం...

కాలం కాసిన విజయాలు

చెప్పమంటూ సూర్యుడి ప్రశ్నావళికి

భూదేవి జవాబు పత్రం -

భూమి కక్ష్యలో

పరిభ్రమించి

నింగి నిగూఢ చరిత్ర

పారదర్శకం చేసిన

ఆకాశ రారాజు

వ్యోమగామి యూరీ గగారిన్!

చంద్రుడు దైవమై

భూలోక వాసుల ప్రార్ధనలు

చంద్రమండలం తవ్వి

రేరాజు మట్టేనని

మన్ను తెచ్చిన

మానవుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్!

ఎవరెస్టు విర్రవీగుతూ

ఆకాశమే హద్దు నాదంటే

ఫలించిన టెన్సింగ్ దీక్ష

వీర విహారమై

ఓటమి ఎరుగని

ఎవరెస్టు వీగిపోయింది!

నడక నేర్వక

ఎదురుగా కూర్చున్న నీటికి

నడకలు నేర్పి

నేలను నరాలు చేసి పారించిన

శాస్త్రవేది కాటన్!

మానవుడు

ఒక మహనీయుడు

ఒక దానవుడు

నియంతృత్వం కన్న హింసను

ప్రజాస్వామ్యం దత్తత తీసుకుంది.

మనిషే మనిషికి ఆహారమై

మనిషిని తింటూ మనిషి!

- అడిగోపుల వెంకటరత్నం

First Published:  31 Oct 2023 6:01 PM IST
Next Story