ఆకాశం నవ్వుతోంది ( కవిత)

ఆకాశం నవ్వుతోంది ( కవిత)
అంతరంగంలో
తరంగాలులేని కల్లోలసముద్రంలో
ఎగసిపడుతున్న
బడబానలాన్ని
రాక్షసి బొగ్గులేసి
కాలకళాసీలు ఎగద్రోస్తుంటే
నా వంతు ప్రయత్నంగా
గుక్కెడు ప్రేమను పుక్కిలిబట్టి
ఆ ప్రేమరసాన్ని పెల్లుబికే
అగ్ని కీలలపై వెదజల్లి
ఆర్పాలని చూశాను.
నా ప్రయత్నాన్ని చూసి ఆకాశం
నోరు తెరిచి
పకపకా నవ్వుతోంది.
2
వర్షర్తువు తొలకరికి పులకరించిన
అవనిమేను నుండి
వెలికి వస్తున్న
హరితాంకురాలను చూసి
కర్షకలోకపు ఆశలపందిరి లా హరిదంతరాలవరకూ వ్యాపించిన హరికార్ముకప్రభాదరహాసవిలాసిని ఆకాశభామిని వళ్ళువిరుచుకుని
తల్లిలా నవ్వుల జల్లులను
కురిపిస్తోంది.
3
మనిషి స్వార్థం పెరిగి పెరిగి మహాసౌధమాలికై
అంతటా క్రమ్మేస్తే
ఆఅయోమయహర్మ్య
శిఖరాలను తాకలేని ఆకాశం
అటు తిరిగి ఇటు తిరిగి
తాను ద్వ్యణుకోదరి అయ్యింది.
ఆహా నేనూ సన్నబడుతున్నానని
చిన్నగా సన్నాయిలా నవ్వుతోంది.
4
నగాలను సగం చేసి నరులు
నగరాలను నిర్మించుకుంటూ
నగజాప్రవాహాలను ఊళ్ళమీదకి మరలిస్తూంటే
అగజోద్యానలనూ మననీక
నరికి నరకులౌతుంటే
తన నగలను కోల్పోయిన
ప్రకృతికాంత క్రోధారుణ సాంధ్య రాగాలాపన చేస్తూ
చేసేకాళీ కరాళ నృత్యాలకు
అమృదు మృదంగ మర్దళ విలయవిన్యాస వికటాట్టహాసాలను జోడు కలుపుతోంది కాదంబినీసఖి
గగనచిదంబరి.
5
నేను రణాంగణంలో నాప్రతికదలికలోనూ
దేశభక్తి మకరంద మాధుర్యాన్ని నింపుకుని
గాయపడిన నాశరీరోద్గతరుధిరంతో
అశోకకుసుమాన్నై నన్ను ఆస్వాదించవచ్చిన
మృత్యు మధుపాన్ని ఆనందంగా ఆహ్వానిస్తూ
చిక్కని నా రక్తాన్ని చూస్తున్నాను.
నన్ను రణభూమికి పంపే నాచెలి
దిద్దిన వీరతిలకం కన్నా
ఈ రక్తం
ఎరుపు కాదనిపించింది.
అప్పుడు నాచెలి రాల్చిన
రెండు కన్నీటిబొట్టులను
నాతుదినిశ్వాస
ప్రళయఝంఝను పంపి
కుంభవృష్టిగా మార్చాను.
అది చూసిన ఆకాశం
నాయికా నాయకులను వేరు చేసిన మాంత్రికుడిలా ఉరిమురిమి
వికృతంగా నవ్వింది.
ఆచార్య రాణి సదాశివ మూర్తి