Telugu Global
Arts & Literature

ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు

ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు
X

(జూన్ 23, 1911 - అక్టోబరు 21, 1986) పరిశోధకుడు, విమర్శకుడు.

జీవితవిశేషాలు

బాల్యం

వీరు దివాకర్ల వంశంలో పరీధావి నామ సంవత్సరం, ఆషాఢ పౌర్ణమి నాడు ఆకుతీగపాడు గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. జన్మనక్షత్రం మూల. హరితస గోత్రుడు. వెలనాటి వైదిక బ్రాహ్మణుడు. కృష్ణ యజుర్వేదశాఖకు చెందినవాడు. తండ్రి పేరు సుందరరామయ్య, తల్లి పేరు వేంకమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం యండగండి ఇతని స్వగ్రామం. తిరుపతి వేంకటకవులలో ఒకరైన దివాకర్ల తిరుపతిశాస్త్రి ఇతనికి పినతండ్రి. దివాకర్ల వేంకటావధానికి ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు. ఇతడే ఇంటికి పెద్దకొడుకు. బాల్యంలోనే ఇతని ప్రతిభాపాటవాలు వెలుగు చూశాయి. సహజ ధారణాశక్తితో చిన్నప్పుడే తిరుపతి వేంకటకవుల అవధాన పద్యాలను కంఠస్తం చేశాడు. ఎనిమిదవ తరగతి చదివే సమయంలోనే ఇతని పద్యాలు భారతి మాసపత్రికలో ప్రచురితమయ్యాయి.

విద్యాభ్యాసం

వీరు ఇంట్లోనే తన తండ్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. రఘువంశం, ఆంధ్రనామసంగ్రహం చదువుకున్నారు. తన గ్రామం యండగండిలో ఏడవ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత ఉండిలో సంస్కృతం ప్రథమ భాషగా, తెలుగు ద్వితీయ భాషగా ఉన్నతపాఠశాల విద్య చదివాడు. అనంతరం 1930-31లో బందరు హిందూ కళాశాలలో ఇంటరు చదివాడు. ఆ సమయంలో విశ్వనాథ సత్యనారాయణ ఇంట్లో వుంటూ పేదరికం కారణంగా వారాలు చేసి చదువుకున్నాడు. విశ్వనాథకు ప్రియశిష్యుడిగా వుండి అతడి ఏకవీర నవలను చెబుతుండగా దివాకర్ల వేంకటావధాని వ్రాసేవాడు. విశ్వనాథ, కొడాలి వెంకట సుబ్బారావుల ప్రోద్బలంతో విశాఖపట్టణం వెళ్లి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. (ఆనర్సు) చేరాడు. అక్కడ పింగళి లక్ష్మీకాంతం, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, గంటి జోగి సోమయాజి ఇతనికి గురువులు. పాటిబండ మాధవశర్మ ఇతని సహాధ్యాయి. బి.ఏ. తరువాత ధర్మవరం రామకృష్ణమాచార్యులు గురించి విమర్శావ్యాసం వ్రాసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి ఎం.ఏ (ఆనర్సు) పట్టాను పొందాడు. తెన్నేటి విశ్వనాథం దగ్గర ఆంగ్లభాషా పరిజ్ఞానం సంపాదించాడు. 1942 ప్రాంతాలలో వేదాధ్యయనం మొదలు పెట్టి మహావుత చయనులు వద్ద నమక చమకాలను దశశాంతులు మొదలైనవాటిని వల్లెవేశాడు. 1957లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ఆంధ్ర వాఙ్మయారంభ దశ - నన్నయ భారతము అనే విషయంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టాను సాధించారు

వివాహం

వీరికి తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు మహాలక్ష్మితో వివాహం జరిగింది. అప్పుడు మహాలక్ష్మి వయసు ఎనిమిదేళ్లు మాత్రమే. పెళ్ళి జరిగిన మూడు సంవత్సరాలకే మహాలక్ష్మి విషజ్వరంతో మరణించింది. తరువాత ఇతడు బి.ఏ (ఆనర్సు) రెండవ సంవత్సరంలో ఉండగా చంద్రావతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిగారు.

ఉద్యోగపర్వం

1934లో అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి డా||సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇతడిని విశాఖపట్టణంలోని మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాలలో తెలుగుపండితుడిగా నియమించాడు. తరువాత పదోన్నతి పొంది అదే కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేశాడు.ఆంధ్ర విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్‌కు అధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. 1951లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరాడు. 1957లో రీడర్‌గా, 1964లో ప్రొఫెసర్‌గా, తెలుగు శాఖాధ్యక్షుడిగా పదోన్నతి పొందాడు. 1974-1975ల మధ్యకాలంలో ఎమినెంట్ ప్రొఫెసర్‌గా, 1975 నుండి 1978 వరకు యు.జి.సి.ప్రొఫెసరుగా పదవీ బాధ్యతలు నిర్వహించాడు. ఇతడి పర్యవేక్షణలో 15మంది పి.హెచ్.డి, ఒకరు ఎం.ఫిల్ పట్టాలను పొందారు. ఇతని శిష్యగణంలో ఎం.కులశేఖరరావు, ఇరివెంటి కృష్ణమూర్తి, పి.యశోదారెడ్డి, సి.నారాయణరెడ్డి, ముద్దసాని రామిరెడ్డి మొదలైనవారు ఉన్నారు.

సారస్వతరంగం

ఈయన నలభైకి మించి గ్రంథాలను రచించారు. వాటిలో పద్యకృతులు, వచన రచనలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు, టీకాతాత్పర్యాలు ఉన్నాయి. ఖండవల్లి లక్ష్మీరంజనంతో కలిసి ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణకు విపులమైన పీఠిక వ్రాశాడు. తెలంగాణాలోని మారుమూల గ్రామాలకు పిలవగానే వెళ్లి ఉపన్యాసాల ద్వారా అక్కడి ప్రజలకు తెలుగు భాషాసాహిత్య చైతన్యాన్ని కలిగించాడు. అనేక కవిపండితుల గ్రంథాలకు చక్కని పీఠికలను, సమగ్ర సమీక్షలను అందించి వారిని ప్రోత్సహించాడు. ఇతనికి అనేక సాహిత్య సంస్థలతో సంబంధం ఉండేది. వాటిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు, యువభారతి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, సంస్కృత భాషా ప్రచార సమితి, ఆర్ష విజ్ఞాన సమితి, సురభారతి, కళాస్రవంతి అనేవి కొన్ని. ఇతడి ఉపన్యాసాలకు జనం వేలకొలది వచ్చేవారు. వసుచరితము గురించి ఇతడు ఉపన్యసిస్తుంటే శ్రోతలు వర్షంలో గొడుగులు పట్టుకుని నిలబడి ఉపన్యాసం విన్నారంటే వీరి ఉపన్యాస కళ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.వీరు సుమారు 50 గ్రంథాలు వెలువరించారు . వీరు సుమారు 15 అవధానములు చేశారు. విద్యార్థిగా ఉన్నపుడు బందరు హిందూ కళాశాలలో మొదటి అవధానం చేశాడు.

తరువాత ఉండి, మొదటి ప్రపంచతెలుగు మహాసభలలో (హైదరాబాదు), ఆకాశవాణిలో, విద్యుత్‌సౌధ (హైదరాబాదు) లో, కాకినాడ తదితర ప్రాంతాలలో అవధానాలు నిర్వహించారు

అవధాని గారు 1986లో భారతీయ విద్యాభవన్ ముంబై వారి చండీయాగానికి వెళ్లారు. అక్కడ వారికి జైన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆ సందర్భంలో అధిక రక్తస్రావము జరిగి 1986, అక్టోబరు 21 తేదీన అస్తమించారు.


దివాకర్ల వెంకటావధాని



First Published:  23 Jun 2023 4:57 PM IST
Next Story