కాలపు మూసలో పడి
పట్టించుకోలా…
వయసు కరిగిన విషయం
ఆలోచనే లేదు రేపటిరోజు గురించి,
ఎప్పుడూ నిన్నటిలోకి తొంగిచూస్తూ ..
వాయిదాలు వేస్తూ గడపడమే
ఏ పనికైనా
గుర్తొస్తుంది అప్పుడే రేపు అని..
ఉత్త భ్రమలో బతకడమే
వ్యర్థమయింది ఎంతో తెలియకుండానే…
మనసు మూలమూలలా
పేరుకుపోయిన జ్ఞాపకాల తడి..
పాత్రలు మారే జీవితనాటకంలో
కంటినుండి ద్రవిస్తూ,
చిరునవ్వై పెదాలపై పూస్తూ…
అలసిపోతున్నా…
అనుభవాల సయ్యాటలో
నాకై మిగిలిన క్షణాలను వెతుక్కుంటున్నా..
అంతర్లీనంగా కదిలే ఉప్పెనలో కొట్టుకుపోతూ
జవాబులేని ప్రశ్ననై,
ఉండిపోతున్నా మౌనంగా…
కాలానికి చిక్కిన గాలమై,
జనన మరణాలకు మధ్య ఆటనై !!
– అరుణ ధూళిపాళ