మేం జగన్ వెంటే.. ఆ నలుగురు క్లారిటీ
తనకు ఇబ్బందులున్న మాట వాస్తవమే కానీ, పార్టీని మాత్రం వీడిపోనని క్లారిటీ ఇచ్చారు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి.
వైసీపీలో ఉండేదెవరు..? ఓటమి తర్వాత సేఫ్ జోన్ వెదుక్కుంటోంది ఎవరు..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాళ్లు వెళ్లిపోతారు, వీళ్లు వెళ్లిపోతారంటూ మీడియాలో చాలామంది పేర్లు వినపడుతున్నాయి. ప్రస్తుతానికి పోతుల సునీత, తన ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ.. తమ రాజ్యసభ సభ్యత్వాలను వదులుకుని, టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మిగతావారు కూడా తమపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తూ మీడియా ముందుకొస్తున్నారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య విడివిడిగా తమ స్టేట్ మెంట్లిచ్చారు. తాము వైసీపీలోనే ఉంటామని, జగన్ తోనే నడుస్తామని అన్నారు. ఈ క్రమంలో మరో నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా తమపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
మేం నలుగురుం..
మొత్తం నలుగురు ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నామని, కానీ మిగతా ఇద్దరు అందుబాటులో లేకపోవడంతో తామిద్దరమే మీడియా ముందుకొచ్చామని అన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. తాడేపల్లి వైసీపీ ఆఫీస్ లో వారు మీడియాతో మాట్లాడారు. తమతోపాటు రఘునాథరెడ్డి, గొల్లబాబూరావు కూడా జగన్ తోనే ఉండేందుకు నిర్ణయించుకున్నామని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లేందుకు తామేమీ వెన్నుపోటుదారులం కాదన్నారు ఎంపీలు.
ఇబ్బందులున్నాయి.. కానీ..!
తనకు ఇబ్బందులున్న మాట వాస్తవమే కానీ, పార్టీని మాత్రం వీడిపోనని క్లారిటీ ఇచ్చారు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి. తమపై తప్పుడు వార్తలు రాయడం సరికాదన్నారాయన. తాము రాజీనామా చేస్తే, ఆ స్థానాలను తమ పార్టీ మరొకరికి ఇచ్చే అవకాశం లేదని, అలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసి వెళ్లిపోయినా అది వెన్నుపోటే అవుతుందన్నారు. తాము జగన్ వెంటే ఉంటామన్నారు ఎంపీ ఆళ్ల. తమకు కూడా ఆఫర్లు వచ్చాయని, అయితే తాము వాటిని రిజెక్ట్ చేశామన్నారాయన.
వైసీపీ నుంచి బయటకు వెళ్లేవారు ఒక్క నిమిషం ఆగి ఆలోచించాలని సూచించారు ఎంపీలు. గెలుపు ఓటములు సహజం అని, అధికారం శాశ్వతం కాదని వారు చెప్పారు. పార్టీ వీడాలనుకుంటున్నవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.