Telugu Global
Andhra Pradesh

ఢిల్లీలో జగన్ ధర్నా మొదలు.. ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు

తమ హయాంలో ఎలాంటి ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేయలేదని, ఎవరికీ కష్టం కలిగించలేదని, ఎవరినీ నష్టపరచలేదని చెప్పారు జగన్.

ఢిల్లీలో జగన్ ధర్నా మొదలు.. ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
X

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయన్నారు. వందల ఇళ్లు నేలమట్టం అయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా అక్రమ కేసులో పెట్టారన్నారు. తమకు నచ్చనివారి పంట పొలాలను కూడా నాశనం చేశారన్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు ముందు మీడియాతో మాట్లాడరు జగన్.


సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ చేతిలో రెడ్ బుక్ పెట్టుకున్న ఫొటోలతో రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్ లు పెట్టారని అన్నారు జగన్. ఆ రెడ్ బుక్ లో వారు దాడి చేయాలనుకున్న వారి పేర్లు వివరాలు ఉన్నాయని, అలాంటి హోర్డింగ్ లు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాయని ప్రశ్నించారు. లోకేష్ లాంటి వ్యక్తి చేతిలో రెడ్ బుక్ పట్టుకుని రెచ్చగొడితే, గ్రామ స్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవాలన్నారు. తాము అధికారంలో ఉన్నప్పడు అలాంటి రెచ్చగొట్టే పనులు చేయలేదన్నారు జగన్. ఎప్పుడూ ఎలాంటి హింస, ధ్వంసరచనకు పాల్పడలేదన్నారు. తమ హయాంలో ఎలాంటి ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేయలేదని, ఎవరికీ కష్టం కలిగించలేదని, ఎవరినీ నష్టపరచలేదని చెప్పారు జగన్.

ఏపీలో ఒక ఎంపీ, మాజీ ఎంపీ ఇంటికి వెళ్తే రాళ్లదాడి జరిగిందని, ఏపీలో అలాంటి పరిస్థితి ఉందన్నారు జగన్. జంతర్ మంతర్ వద్ద ఉన్న ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రతి ఒక్కరూ చూడాలని, రాష్ట్రంలోని పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలన్నారు. జాతీయ మీడియా ఈ విషయానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదన్నారు జగన్. మీడియా ప్రశ్నలకు మాత్రం జగన్ సమాధానమివ్వలేదు. ఏపీలో జరుగుతున్న దారుణాలనుంచి దృష్టి మరల్చే ప్రశ్నలు వేయొద్దన్నారు. అనంతరం ధర్నాలో కూర్చున్నారు.

First Published:  24 July 2024 6:40 AM GMT
Next Story