Telugu Global
Andhra Pradesh

బాబుకు భయం.. అందుకే ఆ పని చేయట్లే - జగన్‌

. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితే మోసపూరిత హామీల గుట్టు బయటపడుతుందన్న భయం చంద్రబాబును వెంటాడుతోందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే రాష్ట్రంలో అరాచకాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు జగన్.

బాబుకు భయం.. అందుకే ఆ పని చేయట్లే - జగన్‌
X

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా ఫెయిల్ అయిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. చంద్రబాబు అరాచకపాలన పట్ల ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని, అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనిపిస్తోందన్నారు. కనీసం పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారని, దేశంలోనే తొలిసారిగా ఏడు నెలలుగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ మీద ప్రభుత్వం నడుస్తోందన్నారు జగన్.


ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితి స్పష్టంగా కనిపిస్తోందన్నారు జగన్. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితే మోసపూరిత హామీల గుట్టు బయటపడుతుందన్న భయం చంద్రబాబును వెంటాడుతోందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే రాష్ట్రంలో అరాచకాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు జగన్. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం చేస్తూ ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదన్న పరిస్థితిని సృష్టిస్తున్నారన్నారు.

ప్రతిపక్ష హోదా ఎందుకివ్వరు..?

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అంశాన్ని మరోసారి లేవనెత్తారు జగన్. ప్రస్తుతం అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయని, ఒకటి అధికార పక్షం, మరొకటి ప్రతిపక్షం అన్నారు. ఇక ప్రతిపక్షంలో ఒకే పార్టీ ఉందన్న జగన్‌.. ఆ పార్టీనే అపోజిషన్ పార్టీగా గుర్తించాలన్నారు. ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కానీ ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రభుత్వాన్ని ఎండగడతారన్న భయంతోనే ఆ పని చేయట్లేదన్నారు.

శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు కూడా పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు జగన్. తనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్తున్నామని, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక, హత్యా రాజకీయాలు దౌర్జన్యాలపై 24వ తేదీన ఢిల్లీలో ఫొటో గ్యాలరీ ప్ర‌ద‌ర్శిస్తూ నిరసన తెలియజేస్తామన్నారు. ఏపీలో పరిస్థితిని దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లి.. రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరాన్ని చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో తమతో వచ్చే పార్టీలను కలుపుకుని వెళ్తామన్నారు.

First Published:  22 July 2024 11:39 AM GMT
Next Story