Telugu Global
Andhra Pradesh

అప్పులపై పక్కా లెక్కలు.. బాబుకు జగన్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పుల గురించి ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇటీవల గవర్నర్ ప్రసంగంలో అప్పులను రూ.10 లక్షల కోట్లకు తగ్గించారని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పించిన అప్పు కూడా పూర్తిగా అబద్ధమన్నారు జగన్.

అప్పులపై పక్కా లెక్కలు.. బాబుకు జగన్‌ స్ట్రాంగ్ కౌంటర్‌
X

ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి చేస్తున్న ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్‌. ఇచ్చిన వాగ్దానాలు, దొంగ హామీల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఒక్కో స్టోరీ బిల్డప్ చేసుకుంటూ పోతున్నాడని ఆరోపించారు జగన్. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధ్వంసమైందనేది చంద్ర‌బాబు మొదటి స్టోరీ అన్నారు జగన్.

ఎన్నికల టైమ్‌లో ఏపీ అప్పులు రూ.14 లక్షల కోట్లంటూ చంద్రబాబు, ఆయన మీడియా ఊదరగొట్టాయన్నారు జగన్. అప్పులపై అలా ప్రచారం చేస్తూనే మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పుల గురించి ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇటీవల గవర్నర్ ప్రసంగంలో అప్పులను రూ.10 లక్షల కోట్లకు తగ్గించారని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పించిన అప్పు కూడా పూర్తిగా అబద్ధమన్నారు జగన్.


రాష్ట్ర అప్పులపై జగన్ క్లారిటీ!

రాష్ట్ర అప్పులపై పక్కా లెక్కలతో క్లారిటీ ఇచ్చారు జగన్. ఇటీవల చంద్రబాబు బాధ్యతలు తీసుకునే నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ఉన్న అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్లు మాత్రమేనన్నారు జగన్. 2014లో రాష్ట్రానికి రూ.లక్షా 18 వేల కోట్ల అప్పు ఉంటే.. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ప్రభుత్వానికి నేరుగా ఉన్న అప్పు రూ. 2 లక్షల 71 వేల 798 కోట్లకు పెరిగిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఆ అప్పు రూ. 5 లక్షల 18 వేల కోట్లు అయిందన్నారు జ‌గ‌న్‌.

స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి తీసుకునే అప్పు విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు జగన్. చంద్రబాబు 2019లో అధికారం కోల్పోయే నాటికి గ్యారెంటీ అప్పు రూ.50 వేల కోట్లుగా ఉందన్నారు. ఇటీవల వైసీపీ దిగిపోయే నాటికి గ్యారెంటీ అప్పు లక్షా 6 వేల కోట్ల రూపాయ‌ల‌కు చేరిందన్నారు.

విద్యుత్ సంస్థలకు బకాయిల వివరాలు కూడా పక్కాగా చెప్పారు జగన్. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాకముందు అలాంటి అప్పు రూ.26 వేల కోట్లుగా ఉంటే.. ఆయన దిగిపోయేనాటికి (2019) రూ.64 వేల 676 కోట్లకు చేరిందన్నారు. ఇక ఐదేళ్ల పాల‌న పూర్తిచేసుకొని వైసీపీ దిగిపోయే నాటికి ఆ అప్పు రూ.లక్షా 11 వేల 864 కోట్లకు పెరిగిందన్నారు జగన్. 2019లో తాను అధికారంలోకి వచ్చే నాటికే ఏపీకి రూ.4 లక్షల 8 వేల కోట్ల అప్పు ఉందన్నారు జగన్‌. ఐదేళ్ల త‌రువాత వైసీపీ ప్ర‌భుత్వం దిగిపోయే నాటికి రూ.7 లక్షల 48 వేల కోట్లు అప్పులున్నాయన్నారు. 2014 - 19 మధ్య అప్పుల గ్రోత్‌ 21 శాతంగా ఉంటే.. తన హయాంలో అది కేవలం 12.90 శాతం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు జగన్.

First Published:  26 July 2024 8:42 AM GMT
Next Story