టీడీపీ పోటీ చేయకూడదు.. ఇది అన్యాయం - జగన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజార్టీ ఉన్నా, టీడీపీ పోటీ చేయాలని అనుకుంటోందని, ఇది విలువలు లేని రాజకీయం అని అన్నారు జగన్.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి తొలి పరీక్షగా మారాయి. వాస్తవానికి ఇక్కడ వైసీపీకే మెజార్టీ ఉంది. ప్రలోభాల పర్వం జరగకపోతే వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్సదే ఇక్కడ విజయం. కానీ కూటమి ప్రభుత్వం తగ్గేలా లేదు. తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ఈ పోటీపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజార్టీ ఉన్నా, టీడీపీ పోటీ చేయాలని అనుకుంటోందని, ఇది విలువలు లేని రాజకీయం అని అన్నారు జగన్.
"స్థానిక సంస్థల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయం. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పోటీ పెట్టకూడదు. కానీ చంద్రబాబు ఏరోజూ నైతిక విలువలు పాటించలేదు. అందుకే తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. అడ్డగోలుగా ప్రలోభాలు, బెదిరింపులతో గెలవడానికి ప్రయత్నిస్తారు. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజం" అని అన్నారు జగన్. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు జగన్. ఈ సందర్భంగా పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన.
ఉమ్మడి విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ నాయకులతో క్యాంప్ ఆఫీస్‌లో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు @ysjagan గారు సమావేశం
— YSR Congress Party (@YSRCParty) August 2, 2024
హాజరైన వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి గారు, ఉమ్మడి విశాఖ జిల్లా… pic.twitter.com/rdMY0vPFRH
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖ జిల్లాకు చెందిన మొత్తం 841 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా వీటిలో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగలిన వాటి లెక్క తీస్తే వైసీపీకి 615 మంది సభ్యుల బలం ఉండగా, కూటమికి కేవలం 215 ఓట్లు ఉన్నాయి. టెక్నికల్ గా ఇక్కడ వైసీపీదే విజయం. కానీ ఇప్పటికే చాలామంది వైసీపీని వీడి టీడీపీ, జనసేన గూటికి చేరుకుంటున్నారు. ఎన్నికల తేదీ ఆగస్ట్ 30లోగా చేరికలు జోరందుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ నాయకులెవరూ చేజారకుండా జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. అందర్నీ ఈరోజు తాడేపల్లికి పిలిపించారు. విజయం మనదేనని, ఎవరూ తొందరపడి పక్క పార్టీల్లోకి వెళ్లొద్దని సూచించారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి వైసీపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థిని పోటీ పెట్టడం అన్యాయం అని జగన్ అనడంవిశేషం. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రలోభాలు పెట్టడం సహజం. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా. ప్రలోభాలు లేకుండా ఎన్నికలు జరగాలని జగన్ కోరుకోవడం మంచిదే కానీ, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏపీలో ఉన్నాయా అనేది అనుమానమే. బొత్సను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినా, వైసీపీని ఇంకా ఓటమి భయం వెంటాడుతూనే ఉంది. మిగతా ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా గెలిచాక పార్టీ మారే అవకాశం ఉందని అనుమానించి బొత్సను ఇక్కడ బరిలో దింపుతున్నారు జగన్.