Telugu Global
Andhra Pradesh

ఏపీలో యూట్యూబ్ అకాడమీ..! చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ, గూగుల్ ఏపీఏసీ హెడ్ తో ఆన్ లైన్ లో భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు.

YouTube Academy in Andhra Pradesh says Chandrababu Naidu
X

ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు చంద్రబాబు ట్వీట్ వేశారు. ప్రపంచస్థాయి టెక్‌ దిగ్గజ సంస్థల్ని ఏపీకి తీసుకొచ్చే దిశగా తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. పెద్దఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు. యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌, గూగుల్‌ ఏపీఏసీ హెడ్‌ సంజయ్‌ గుప్తాతో చంద్రబాబు వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించినట్లు ఆయన ప్రకటించారు.


యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ, గూగుల్ హెడ్ తో ఆన్ లైన్ లో భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, స్కిల్ డెవలప్మెంట్, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను వారికి కూడా వివరించామన్నారు. వారి భాగస్వామ్యంతో ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణ తయారు చేస్తామన్నారు చంద్రబాబు.

మీడియా సిటీ..

ఐటీ విషయంలో చంద్రబాబు తన మార్కు చూపించాలనుకుంటున్నారు. ఐటీ కంపెనీలను ఏపీకి తీకొస్తామని చెబుతున్న ఆయన, గత ప్రభుత్వానికి ఇప్పటికి మార్పు స్పష్టంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో వర్చువల్ గా సమావేశమవుతున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో మీడియా సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఇదివరకే చంద్రబాబు ప్రకటించారు. ఈ మీడియా సిటీకి కూడా దిగ్గజ కంపెనీల నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామన్నారు. ఈ ప్రతిపాదనలన్నీ పట్టాలెక్కితే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు చంద్రబాబు. మేధో వలసలు తగ్గుతాయన్నారు.

First Published:  6 Aug 2024 1:20 PM GMT
Next Story