ఎమ్మెల్యే కొలికపూడిని సస్పండ్ చేయాలని మహిళల నిరసన
మహిళా ఉద్యోగుల వాట్సప్ నంబర్లకు అసభ్యకరంగా మెస్సెజ్‌లు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణ
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే మీడియా ప్రతినిధులను కించపరిచేలా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.తనకు అన్ని విషయాలు తెలుసున్న సీఎం.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 'సేవ్ తిరువూరు' ర్యాలీ చేపట్టాలనుకున్న ఎమ్మెల్యేను పార్టీ హైకమాండ్ మందలించడంతో ఆయన విరమించుకున్నారు. తాజాగా ఆయనపై మహిళలు ఆరోపణలు చేశారు. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని రోడ్డెక్కారు.
మహిళా ఉద్యోగుల వాట్సప్ నంబర్లకు అసభ్యకరంగా మెస్సెజ్‌లు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును టీడీపీ అధిష్ఠానం సస్పెండ్ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలోని చిట్టేలలో సోమవారం మహిళలు ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. మహిళల పట్ల ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనపై చేసిన ఆరోపణలు నిజమైతే అరెస్టు చేసి శిక్షించాలన్నారు. లేనిపక్షంలో ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.