Telugu Global
Andhra Pradesh

గవర్నర్ వద్దకు చేరిన ఏపీ మహిళా కమిషన్ వివాదం

రాజీనామా చేయాలంటూ పరోక్షంగా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఈ వేధింపులకు భయపడేది లేదంటున్నారు చైర్ పర్సన్. తన పదవీకాలం 2026 మార్చి వరకు ఉందని ఆమె గుర్తు చేస్తున్నారు.

గవర్నర్ వద్దకు చేరిన ఏపీ మహిళా కమిషన్ వివాదం
X

పేరుకి రాజ్యాంగబద్ధ వ్యవస్థలే అయినా అందులో నియామకాలు ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు. ప్రభుత్వం మారగానే తమ వాళ్లు కాదు అనుకున్నవారిని పక్కకు తప్పిస్తారు, తమకు అనుకూలమైనవారిని అందలమెక్కిస్తారు. ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం రాగానే టీటీడీ సహా ఇతర వ్యవస్థల చైర్మన్లు రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు. కానీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి మాత్రం ససేమిరా అంటున్నారు. రాజీనామా చేయాలంటూ పరోక్షంగా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఈ వేధింపులకు భయపడేది లేదంటున్నారు చైర్ పర్సన్. తన పదవీకాలం 2026 మార్చి వరకు ఉందని ఆమె గుర్తు చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి మహిళా కమిషన్ చైర్ పర్సన్, సభ్యుల జీతాలు పెండింగ్ లో పెట్టారు. కనీసం టీఏ, డీఏలు కూడా ఇవ్వడంలేదు. ఆఫీస్ నిర్వహణ ఖర్చులు కూడా ఆపేయడంతో వివాదం మొదలైంది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ ని కూడా ఇలా ఇబ్బంది పెడతారా అంటూ గజ్జల వెంకట లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇక మహిళలకు రక్షణ ఎక్కడుందని అంటున్నారు. గవర్నర్‌కు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికి ఆమె ఫిర్యాదు చేశారు.

చైర్‌పర్సన్లు, సభ్యులు రాజీనామా చేసి వెళ్లిపోతే, ఆ స్థానాల్లో తమ వారికి పదవులు కట్టబెట్టేందుకు కొత్త ప్రభుత్వం ఎదురు చూస్తోంది. వాస్తవానికి ప్రభుత్వాలు మారిన తర్వాత ఇలాంటి పదవుల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి వెళ్లిపోతారు, కొంతమంది కొత్త ప్రభుత్వం అండదండలతో కొనసాగుతారు. కాదు, కుదరదు అన్నవారిపై వేటువేయడానికి ప్రభుత్వం వెనకాడదు. కానీ తొలగింపు అంత ఆషామాషీ కాదు. అందుకే ప్రభుత్వం వారిపై రాజీనామా ఒత్తిడి చేస్తోంది. కానీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మాత్రం ఆ ఒత్తిడికి తలొగ్గేది లేదంటున్నారు. దీంతో వివాదం మొదలైంది. ఈ పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది.

First Published:  12 July 2024 3:59 AM GMT
Next Story