Telugu Global
Andhra Pradesh

ఆడబిడ్డల జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టం

నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ఆడబిడ్డల జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టం
X

ఆడబిడ్డల జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈరోజు ఒక ఆడబిడ్డ చావు బతుకుల్లో ఉంది.. ఆమెకు అలా జరగడానికి కారకుడిని కఠినంగా శిక్షిస్తాం.. మున్ముందు ఎవరైనా ఆడపిల్లల వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకువస్తామని తేల్చిచెప్పారు. నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. నేరాలు చేసే వ్యక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని.. వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తామన్నారు. సంపద సృష్టిస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. పట్టణాల్లో 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, అక్టోబర్‌ రెండో తేదీ నాటికి దానిని తొలగించే బాధ్యతను మున్సిపల్‌ శాఖకు అప్పగించామన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నెలలో ఒకరోజు కేటాయించాలన్నారు. చెత్తను పునర్వినియోగించి దాని ద్వారా సంపద సృష్టిస్తామన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో 64 లక్షల మందికి ప్రతి నెల పింఛన్‌ ఇస్తున్నామని చెప్పారు. ఇబ్బందుల్లో ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

First Published:  15 Feb 2025 4:38 PM IST
Next Story