Telugu Global
Andhra Pradesh

వైసీపీ కార్పొరేటర్ల పంపకాలు.. టీడీపీ జనసేన వాటాలు

తమకి తాముగా ఎవర్నీ టార్గెట్ చేయడం లేదని, ప్రజా ప్రయోజనాలకోసమే వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారని కూటమి నేతలు చెప్పడం కొసమెరుపు.

వైసీపీ కార్పొరేటర్ల పంపకాలు.. టీడీపీ జనసేన వాటాలు
X

విశాఖలో వైసీపీ కార్పొరేటర్లను వాటాలు వేసుకుని మరీ టీడీపీ, జనసేన పార్టీలు పంచుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఎవరి వాటా ఎంతనేది క్లారిటీ వచ్చేసింది. మొత్తం 25మంది కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకుంటున్నామని, ప్రస్తుతం టీడీపీలోకి 13మంది, జనసేనలోకి ఏడుగురు వస్తున్నారని చెప్పారు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్. వీరిలో కొందరికి ఆల్రడీ కండువాలు కప్పేశారు.

మేమేం పిలవలేదు..

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్ని తామేమీ పార్టీలోకి పిలవడం లేదని, వారే వచ్చి చేరతామంటున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ చెబుతున్నారు. విశాఖలో కూడా కార్పొరేటర్లు తమకు తామే పార్టీ మారతామంటున్నారని అన్నారు. విశాఖ కార్పొరేషన్ పై కూటమి ఫోకస్ పెట్టడంతో వైసీపీ కార్పొరేటర్లు కొందరు కూటమివైపు వెళ్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చివరి వరకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఆయన హామీలను కూడా కార్పొరేటర్లు లెక్కచేయలేదు. ప్రతిపక్షంలో ఉండటం ఇష్టం లేక వారు అధికార కూటమివైపు అడుగులేస్తున్నారు.


తామెవర్నీ టార్గెట్ చేయడం లేదని, వస్తామంటున్నవారినే తీసుకుంటున్నామని చెబుతున్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని వద్దనుకున్న తర్వాత ఆ పార్టీ కార్పొరేటర్లు కూడా కూటమివైపు వచ్చేస్తున్నారని చెప్పారు. విశాఖ అభివృద్ధికోసం అందరం కలసి పనిచేస్తామన్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఫిరాయింపులు ఊహించినవే. అయితే తమకి తాముగా ఎవర్నీ టార్గెట్ చేయడం లేదని, ప్రజా ప్రయోజనాలకోసమే వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారని కూటమి నేతలు చెప్పడం కొసమెరుపు.

First Published:  21 July 2024 11:25 AM GMT
Next Story