Telugu Global
Andhra Pradesh

గంజాయికోసం సెల్ ఫోన్లు తాకట్టు.. ఆ పై హత్య

గంజాయికోసం డబ్బులు లేకపోవడంతో సెల్ ఫోన్లు తాకట్టు పెట్టారని, ఆ తర్వాత వారి మధ్య గొడవ జరిగిందని అంటున్నారు పోలీసులు. ఈ గొడవలో బాలుడు మృతి చెందాడు.

గంజాయికోసం సెల్ ఫోన్లు తాకట్టు.. ఆ పై హత్య
X

గంజాయికి బానిసైన యువత దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు, ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా గంజాయి వ్యసనం ఓ టీనేజర్ హత్యకు దారి తీసింది. విశాఖ నగరంలోని కంచరపాలెంకు చెందిన 17 ఏళ్ల బాలుడి హత్యకు గంజాయి బ్యాచ్ కారణం అని తేల్చారు పోలీసులు. ఈ హత్యకేసుకి సంబంధించి ఎనిమిదిమందిని అరకు లోయ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

జులై 30న కంచరపాలెంకు చెందిన ఓ బాలుడు కనిపించడంలేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి వారు దర్యాప్తు ప్రారంభించారు. ఆ బాలుడికి గంజాయి అలవాటు ఉందని నిర్థారించుకున్న తర్వాత ఆ కోణంలో ఎంక్వయిరీ మొదలు పెట్టారు. ఈలోగా ఈనెల 6న అరకు ప్రాంతంలోని డుంబ్రిగుడ మండలం బొందుగుడ చెరువులో బాలుడి మృతదేహం లభించింది. హత్య అనే అనుమానంతో పోలీసులు మరింత లోతుగా ఎంక్వయిరీ చేపట్టారు.

గంజాయికి అలవాటు పడ్డ ఆ బాలుడు.. కంచరపాలం నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ తో కలసి అరకు వెళ్లాడు. అక్కడ కొంతమంది అతడికి పరిచయం ఉండటంతో వారి వద్దకు వెళ్లి గంజాయి కావాలని అడిగినట్టు పోలీసులు తెలిపారు. డబ్బులు లేకపోవడంతో సెల్ ఫోన్లు తాకట్టు పెట్టారని, ఆ తర్వాత వారి మధ్య గొడవ జరిగిందని అంటున్నారు. ఈ గొడవలో బాలుడు మృతి చెందాడు. అరకు యువకుల దాడిలో ఆ బాలుడు మృతి చెందడంతో వారు డెడ్ బాడీని చెరువులో పడేశారు. ఆ బాలుడి స్నేహితులు అక్కడ్నుంచి పారిపోయారు. గంజాయికి అలవాటు పడి, దానికోసం వెదుక్కుంటూ అరకు ప్రాంతానికి వెళ్లి చివరకు ఆ బాలుడు హత్యకు గురయ్యాడని పోలీసులు తేల్చారు.

First Published:  8 Aug 2024 8:50 AM GMT
Next Story