నారాయణ, శ్రీచైతన్యను నిషేధించండి
ప్రభుత్వ విద్యా విధానాన్ని మెరుగు పరిచి, ప్రైవేటు కోచింగ్ సెంటర్లను నిషేధించాలని సూచించారు విజయసాయిరెడ్డి.
ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు వరదనీటిలో మునిగి దుర్మరణంపాలైన ఘటనపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కోచింగ్ సెంటర్లపై నిషేధం విధించాలని, వీలయితే నియంత్రించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉందని శ్రీచైతన్య, నారాయణ లాంటి కోచింగ్ సెంటర్లు కూడా ప్రమాణాలు పాటించడంలేదని అన్నారాయన.
https://t.co/PyJ6UyG3VA
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 29, 2024
Here is the weblink of my speech during the short-duration discussion in Rajya Sabha today on the tragic incident of the death of students in Delhi. I highlighted why private coaching centres like Narayana, Chaitanya, and Rao should be banned. Rules and…
కోచింగ్ సెంటర్ల ఫీజుల విధానాలపై కూడా ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు విజయసాయిరెడ్డి. పేద విద్యార్థులు ఆయా సంస్థల్లో చేరలేక అవస్థలు పడుతున్నారని, దీనికి కారణం ప్రభుత్వ విద్యా విధానంలో లోపమేనని అన్నారాయన. ప్రభుత్వ విద్యా విధానం సరిగా లేకపోవడం వల్ల ప్రైవేటు విద్యాసంస్థల వైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారని, అక్కడ ఫీజులు తట్టుకోలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని మెరుగు పరిచి, ప్రైవేటు సంస్థలపై నియంత్రణ విధించాలని సూచించారు విజయసాయిరెడ్డి.
రాజ్యసభ సమావేశాల్లో ఏపీలోని శాంతి భద్రతల అంశాన్ని కూడా ఇటీవల ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ప్రశాంతంగా లేరని చెప్పారు. ఢిల్లీలో తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టామని, కేంద్రం కూడా ఏపీ పరిస్థితులపై దృష్టి సారించాలన్నారు విజయసాయిరెడ్డి. తాజాగా కోచింగ్ సెంటర్ల వ్యవహారంపై ఆయన సూటిగా స్పందించారు. విద్యార్థుల చావులకు కారణం అవుతున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నిషేధించాలన్నారు.