Telugu Global
Andhra Pradesh

కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. కర్నూలు జిల్లాకు అలర్ట్

తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. కర్నూలు జిల్లాకు అలర్ట్
X

కర్నాటకలోని తుంగభద్ర డ్యామ్ గేటు వరదలకు కొట్టుకుపోయింది. అయితే దీని ప్రభావం కర్నూలు జిల్లాపై కూడా పడే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్నూలు జిల్లాకు ఏపీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అటు కృష్ణానదీ పరివాహ ప్రాంత ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


కొట్టుకుపోయన గేటు..

కర్నాటకలోని హోస్పేట్‌లో తుంగభద్ర డ్యామ్‌ ఉంది. వరదనీరు పోటెత్తడంతో ఇటీవల డ్యామ్ గేట్లు తెరిచారు. తిరిగి ఇన్ ఫ్లో తగ్గడంతో వాటిని మూసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 19వ గేటు గత అర్థరాత్రి ఊడిపోయింది. చైన్ తెగి గేటు మొత్తం వరదనీటిలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడ నీరు వృథాగా పోతోంది. ప్రాజెక్టు నుంచి మొత్తం 60 టీఎంసీల నీరు వృథాగా పోతుంది. ఈ నీరు పూర్తిగా బయటకు వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు తెలిపారు.

తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగే అవకాశముంది. వరద ఎక్కువగా ఉండటంతో తాత్కాలిక ఏర్పాట్లు కూడా ఫలించలేదు. తుంగభద్రలో పూర్తిగా వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపడతారు. తుంగభద్ర డ్యామ్‌ విషయంలో గేటు పూర్తిగా కొట్టుకుపోయేంత పెద్ద ఘటన జరగడం 70 ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

First Published:  11 Aug 2024 7:57 AM IST
Next Story