Telugu Global
Andhra Pradesh

తిరుమల భక్తులపై ప్రాంక్ వీడియో.. టీటీడీ రియాక్షన్

ఘటనపై టీటీడీ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్‌ వీడియోలు చేయడం హేయమైన చర్య అని ఓ ప్రకటనలో ఖండించింది.

తిరుమల భక్తులపై ప్రాంక్ వీడియో.. టీటీడీ రియాక్షన్
X

తిరుమల క్యూ లైన్‌లో ప్రాంక్ వీడియోలు కలకలం రేపాయి. నారాయణగిరి షెడ్స్‌లో కొందరు ఆకతాయిలు ప్రాంక్ వీడియోలు తీశారు. ఆలయ సిబ్బందిలా నటిస్తూ కంపార్ట్‌మెంట్‌ తాళాలు తీస్తున్నట్టు ప్రాంక్ వీడియోలు తీశారు. నిజంగానే తాళాలు తీస్తున్నారేమో అని నమ్మిన భక్తులు ఒక్కసారిగా పైకి లేవగా.. వాళ్లను చూసి వెకిలిగా నవ్వుతూ పరుగులు తీశారు.

ప్రాంక్‌ చేసిన యువకుడిని తమిళనాడుకు చెందిన వాసన్‌‌గా గుర్తించారు. ఫ్రెండ్స్‌తో కలిసి తిరుమలలో అతను ఈ వీడియోలు తీసి వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. భక్తులపై ప్రాంక్ వీడియోల చిత్రీకరణపై విమర్శలు వస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని.. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

ఘటనపై టీటీడీ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్‌ వీడియోలు చేయడం హేయమైన చర్య అని ఓ ప్రకటనలో ఖండించింది. ప్రాంక్‌ వీడియోలు చిత్రీకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.

క్యూలైన్లో భక్తులపై ప్రాంక్ వీడియోతో టీటీడీ డొల్లతనం బట్ట­బయలైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకుకెళ్లేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ అక్కడి సిబ్బంది కళ్లుగప్పి ఏకంగా మొబైల్‌ఫోన్‌ తీసుకెళ్లడం.. అంతటితో ఆగకుండా ప్రాంక్‌ వీడియోని చిత్రీకరించడం కలకలం సృష్టించింది.

First Published:  12 July 2024 6:49 AM GMT
Next Story