శ్రీవారి లడ్డూ కల్తీపై టీటీడీ అత్యవసర సమావేశం
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై ఆగ్రహం వ్యక్తమౌతున్నది. కల్తీపై పీఠాధిపతులు మండిపడగా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నేతల డిమాండ్
శ్రీవారి లడ్డూ కల్తీపై టీటీడీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో శ్యామలరావు చర్చిస్తున్నారు. సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
లడ్డూ కల్తీపై పీఠాధిపతులు ఆగ్రహం
మరోవైపు తిరుమలలో లడ్డూ కల్తీపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ప్రజలు కదిలి ధర్మాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రసాదంలో ఏం కలుస్తున్నదన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. స్వామి సన్నిధిలో వేరే మతస్థులకు ఉద్యోగం ఉండకూడన్నారు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాబ్ మనకు ఆధారం.. అవి స్పష్టం చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు.
లడ్డూ వివాదంపై చంద్రబాబే నిర్ణయం తీసుకుంటారు: కేంద్ర మంత్రి
లడ్డూ కల్తీపై విచారణను సీబీఐకి ఇవ్వాలా.. సిట్‌కు అప్పగించాలా అనే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబే నిర్ణయం తీసుకుంటారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆయన సమర్థవంతమైన పరిపాలకుడు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి కోరారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై ఆగ్రహం వ్యక్తమౌతున్నది. కల్తీపై పీఠాధిపతులు మండిపడగా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నేతల డిమాండ్
తిరుమల ఆలయాన్ని, శ్రీవారి పోటును సంప్రోక్షణ చేయాలని తిరుపతి జనసేన ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ తెలిపారు. కల్తీ నెయ్యి కొనుగోళ్లలో మాజీ ఈవో ధర్మారెడ్డి కీలకమని, ఆయనను, టీటీడీ ఉన్నతాధికారులను అరెస్టు చేయాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.