వివాదంలో రోజా.. ఆమె చేసిన తప్పేంటి..?
'వైసీపీ నేత రోజా రెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్న తమిళ మీడియా'.. అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో షేర్ చేయడం విశేషం.
కెమెరాల ముందు ఏం చేసినా, బయటకు వేరే అర్థం వెళ్లిపోతున్న రోజులివి. అందులోనూ రాజకీయ నాయకులు, సినిమావాళ్లు ఈ వ్యవహారంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం. మాజీ మంత్రి రోజా కూడా ఇలాగే వివాదంలో చిక్కుకున్నారు. ఓ గుడిలో పారిశుధ్య కార్మికులు తనతో ఫొటో దిగేందుకు ఆసక్తి చూపగా.. ఆమె వారిని దూరంగా ఉండాలని చెప్పారని, ఆమె సైగల్లో అసహనం, అహంకారం కనపడిందని అంటున్నారు నెటిజన్లు. పోనీ ఇది కేవలం నెటిజన్లకే వదిలిపెడదామా అంటే రాజకీయ పార్టీలు కూడా ఈ వ్యవహారాన్ని హైలైట్ చేస్తున్నాయి. 'వైసీపీ నేత రోజా రెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్న తమిళ మీడియా'.. అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో షేర్ చేయడం విశేషం.
పారిశుధ్య కార్మికులపై వివక్ష చూపిస్తూ, అసహ్యంగా హావభావాలు పెట్టి వారిని అవమానించిన వైసీపీ నేత రోజా రెడ్డి. దుమ్మెత్తి పోస్తున్న తమిళ మీడియా. pic.twitter.com/3LmvNlOvT9
— Telugu Desam Party (@JaiTDP) July 16, 2024
ఇంతకీ రోజా ఏం చేశారు..?
వాస్తవానికి రోజా వారానికోసారి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఆమె కొండపైకి పెద్దగా రావడంలేదు. అదే సమయంలో ఆమె తమిళనాట ఉన్న ప్రముఖ ఆలయాలకు వెళ్తున్నారు. తాజాగా తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయంలో జరిగిన వరుషాభిషేకం వేడుకల్లో పతీ సమేతంగా పాల్గొన్నారు రోజా. ఆలయ సిబ్బంది ఆమెతో సెల్ఫీ తీసుకోడానికి ఉత్సాహం చూపించారు. అనంతరం ఆలయంలోని పారిశుధ్య కార్మికులు కూడా రోజా వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఇద్దరు మహిళలు తన వద్దకు వస్తున్న క్రమంలో.. వారిని కాస్త దూరంగా ఉండాలని రోజా వారించారు. ఆ సమయంలో ఆమె హావభావాలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఫొటోకి మాత్రం నవ్వుతూనే ఫోజు ఇచ్చిన రోజాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
అయితే రోజా అభిమానులు, ఆమె సన్నిహితులు మాత్రం ఇందులో తప్పేమీ లేదని అంటున్నారు. కొంతమంది గుంపుగా ఆమె మీదకు వచ్చే క్రమంలో దూరంగా ఉండాలని వారించారని చెబుతున్నారు. అంతేకానీ పారిశుధ్య కార్మికులంటే రోజాకు వ్యతిరేక భావమేదీ లేదంటున్నారు. దీనిపై రోజా స్వయంగా వివరణ ఇస్తుందేమో చూడాలి.