నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
రాత్రికి బంగారు తిరుచ్చిపై ఉభయ దేవేరులతో మలయప్పస్వామి దర్శనం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో ముగియనున్నాయి. తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించిన ఉత్సవాలు ధ్వజావరోహణతో పరిసమాప్తం కానున్నాయి. శనివారం తెల్లవారుజామున స్వామివారికి చక్రస్నానం చేయించారు. ఆ తర్వాత 3 గంటల నుంచి 6 గంటల వరకు మాడవీధుల్లో వేడుకగా స్వామివారి పల్లకీ ఉత్సవాన్నినిర్వహించారు. బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో టీటీడీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. స్వామివారి పుష్కరిణి దగ్గర 600మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి ఏడు గంటలకు ఉభయదేవేరుల సమేతుడైన మలయప్ప స్వామి బంగారు తిరుచ్చిపై నాలుగు మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి ధ్వజావరోహణం జరుగనుంది. నివేదనతో పాటు వివిధ వైదిక కార్యక్రమాల తర్వాత బ్రహ్మోత్సవాల ఆరంభ సూచికగా ధ్వజస్తంభంపై ఎగురవేసిన ధ్వజపటాన్ని కిందకు దించే ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.