బాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
చంద్రబాబుతో భేటీలో ఈ అంశాన్ని చర్చకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్‌కు కూడా ఆయన సిగ్నల్స్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్ CP రాధాకృష్ణన్ భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే వీరి భేటీ గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాధాకృష్ణన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేయాలని భావిస్తున్నారని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి ఫుల్‌టైం గవర్నర్‌గా ఉండాలని భావిస్తున్నారట.
రాధాకృష్ణన్ ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్‌గా ఉన్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామాతో ఆయనకు తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు సైతం ఆయనే చూసుకుంటున్నారు. అయితే ఇటీవల ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో రాధాకృష్ణన్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. రాధాకృష్ణన్ తెలంగాణ ఫుల్ టైం గవర్నర్‌గా లేదా ఏపీకి పూర్తిస్థాయి గవర్నర్‌గా బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం. చంద్రబాబుతో భేటీలో ఈ అంశాన్ని చర్చకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్‌కు కూడా ఆయన సిగ్నల్స్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.
రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉండాలని భావిస్తున్నారట. రాబోయే కొన్ని నెలల్లో 12కుపైగా రాష్ట్రాల్లో గవర్నర్ల పదవీకాలం ముగియనుంది. దీంతో కొత్త గవర్నర్లను నియమించాల్సి ఉంటుంది. కొత్తగా కొంతమంది సీనియర్లను గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చే అవకాశం కూడా ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే తెలంగాణ లేదా ఏపీకి పూర్తిస్థాయి గవర్నర్‌గా ఉండాలనేది రాధాకృష్ణన్ ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. 2023 ఫిబ్రవరిలో ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు మరో నాలుగేళ్ల పదవీకాలం ఉంది.