బీఆర్ఎస్ పాలనపై టీడీపీ ప్రశంసలు
పొరుగు రాష్ట్రం తెలంగాణ కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకుంటే, ఏపీ నుంచి జగన్ కేవలం 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించడమేంటని నిలదీసింది టీడీపీ.
తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఎలా సాగింది, అదే సమయంలో ఏపీలో వైసీపీ పాలన ఎలా జరిగింది.. అనే విషయాలను పోల్చి చెబుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీడీపీ ప్రశంసలు కురిపించింది. మెడికల్ కాలేజీల నిర్మాణం అనుమతులు తెచ్చుకునే విషయంలో బీఆర్ఎస్ పనితీరుని మెచ్చుకుంది. కేంద్రం నుంచి ఏకంగా 17 మెడికల్ కాలేజీలకు బీఆర్ఎస్ అనుమతి సాధించిందని గుర్తు చేసింది టీడీపీ. అదే సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం కేవలం 5 మెడికల్ కాలేజీలకు మాత్రమే అనుమతులు తెచ్చుకుందని, అవినాష్ రెడ్డి బెయిల్ కోసం సాగిలపడి, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రజారోగ్యం గురించి నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది జగన్ రెడ్డి. ఆరోగ్యశ్రీకు నువ్వు పెట్టి వెళ్ళిన బకాయిలు గురించి, మీ సతీమణి గారే దొంగ సాక్షిలో రాసారు, ఒకసారి నీ నిర్వాకం చూసుకో. కేంద్రం 60% నిధులతో కడుతున్న మెడికల్ కాలేజీల నిధులు దారి మళ్ళించి, పునాదులు… https://t.co/43smRiHezU
— Telugu Desam Party (@JaiTDP) August 27, 2024
ఎందుకీ ఆరోపణలు..?
ఏపీలో ప్రజారోగ్య రంగానికి బాబు పాలన ఉరితాడు బిగిస్తోందంటూ మాజీ సీఎం జగన్ వేసిన ట్వీట్ తో ఈ గొడవ మొదలైంది. తమ హయాంలో 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించామని, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన 5 మెడికల్ కాలేజీలు ఆగిపోయాయని జగన్ విమర్శించారు. ఏపీ ప్రభుత్వ చేతగానితనం వల్ల మెడికల్ సీట్లలో రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. జగన్ ట్వీట్ కి కౌంటర్ గా టీడీపీ వివరణ ఇచ్చింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకుంటే, ఏపీ నుంచి జగన్ కేవలం 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించడమేంటని నిలదీసింది. కేంద్రం నిధుల్ని పక్కదారి పట్టించి, మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని, దానివల్లే అనుమతులు రాలేదని జగన్ పై ప్రతి విమర్శలు చేస్తోంది టీడీపీ.
ప్రజారోగ్యం గురించి జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని టీడీపీ ట్విట్టర్ ద్వారా బదులిచ్చింది. ఆరోగ్యశ్రీకి గత ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్లిపోయిందని కౌంటర్ ఇచ్చింది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం 60 శాతం నిధులిస్తే వాటిని అప్పటి వైసీపీ ప్రభుత్వం దారి మళ్ళించిందని ఆరోపించింది. పునాదులు కూడా దాటకుండా చేసిన జగన్ కి, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హత లేదన్నది. బిల్డింగులు కట్టకుండాా, అనుమతులు ఎవరిస్తారని..? ప్రశ్నించింది. జగన్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా పూర్తి కాలేదంటోంది టీడీపీ.
కొత్త ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఏడాది మెడికల్ కాలేజీలకు అనుమతులు రాలేదని జగన్ ఆరోపించారు. అయితే జగన్ హయాంలో పనులు పూర్తి కాకపోవడం వల్లే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇవ్వలేదంటోంది టీడీపీ. కాలేజీ బిల్డింగ్ ల నిర్మాణాలు పూర్తి కాలేదని, వైద్య, బోధన సిబ్బంది కొరత 64శాతం పైనే ఉందని, బ్లడ్ బ్యాంక్ కు అనుమతులు లేవని NMC తన రిపోర్ట్ లో పేర్కొన్నట్టు టీడీపీ చెబుతోంది. వాటికి కారణం గత ప్రభుత్వమేనంటోంది టీడీపీ.